మోకాలి నొప్పులకు విస్కోసప్లిమెంటేషన్‌
November 15, 2010
సొరియాసిస్‌కు.. శాశ్వత పరిష్కారమా?
November 16, 2010

అమ్మ కడుపులోనే ఆపరేషన్‌

ఈ ప్రకృతిలో.. పువ్వు సున్నితం! మొగ్గ మరింత సున్నితం!! బిడ్డ సున్నితం! పిండం మరింత సున్నితం!! పొత్తిళ్లలోని పురిటి గుడ్డుకు, ముట్టుకుంటే కందిపోయే లేలేత పసికందుకు ఆపరేషన్‌ చెయ్యటమే కష్టమనుకుంటే.. ఇప్పుడు ఏకంగా తల్లి కడుపులోని నలుసుకే సంక్లిష్టమైన చికిత్సలు చేసే స్థాయికి చేరుకుంది మన వైద్యరంగ0

పిండం.. ఈ ప్రకృతిలో అపురూపానికే అపురూపం. అందుకే దానికి అంతటి సుకుమారమైన రక్షణ! అమ్మ కడుపులో.. దళసరి గర్భసంచిలో.. మృదువైన మాయ పొరల మధ్య.. ఊయలలూపే ఉమ్మనీటిలో.. బొడ్డుతాడు పెనవేసుకుని సుతారంగా తేలియాడుతుంటుంది ఓ చిన్న ప్రాణం! రెండు జీవాణువుల సంయోగఫలంగా కడుపున పడిన ఈ చిన్ని నలుసు.. దినదిన ప్రవర్ధమానమై.. వారంవారం విస్తరించుకుంటూ.. నెలనెలా కొత్తపుంతలు పోతూ.. సున్నితమైన అంగాలుగా, సంక్లిష్ట అవయవాలుగా.. నవమాసాల్లో బోసి నవ్వుల పసిపాపగా రూపుదిద్దుకోవటం.. ఓ రమణీయ ఘట్టం.

ఎక్కడో లోలోపల ఉన్న ఈ సున్నితమైన నలుసుకు ఉండే గుండె ఎంత? దాని ఆయువెంత? మరి దానిలో ఏదైనా లోపం తలెత్తుతోందని తెలిస్తే మనం ఏం చెయ్యగలం? మన వైద్యరంగం ఈ విషయంలో నిన్నమొన్నటి వరకూ నిస్సహాయంగా ఉండిపోయేది. పుట్టించి కష్ట పెట్టే బదులు.. కడుపులోనే తుంచుకోవటం ఏకైక మార్గంగా ఉండేది. కానీ ఇదంతా ఒకప్పటి ఆలోచన. ఇప్పుడు కడుపులోని పిండాన్ని.. ఆ పిండంలోని గుండెను చేరుకుని.. దానికి సున్నితమైన మరమ్మతులు చేసే సరికొత్త చికిత్సా ద్వారాలను తెరుస్తోంది మన వైద్య రంగం. ఫలితంగానే ఇప్పుడు ‘ఫీటల్‌ కార్డియాలజీ’ ‘పెరినేటల్‌ కార్డియాలజీ’ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

పైనుంచి సున్నితమైన సూదులతో, తీగలతో, బెలూన్లతో అమ్మ కడుపులోని పిండం, దాని గుండెను చేరుకుని లోపాన్ని సరిచేసి.. పిండానికి ప్రాణగండం తప్పించే కీలక చికిత్సలను ఇప్పుడు ప్రపంచంలోని అతికొద్ది ఆసుపత్రులు ఆరంభించాయి. మన దేశంలో తొలిసారిగా కేర్‌ ఆసుపత్రి ‘పీడియాట్రిక్‌ కార్డియాలజీ’ విభాగం కూడా ఇటువంటి చికిత్సలు ఆరంభించినది.

ఫీటల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హార్ట్‌ డిసీజెస్‌

అంటే పిండం కడుపులో ఉన్నప్పుడే.. దాని గుండెలో తలెత్తిన లోపాలకు చికిత్స చేస్తూ.. ఆ పిండం ఆరోగ్యకరమైన బిడ్డలా ఎదిగేలా చూసే విధానం. గత దశాబ్దకాలంగా వైద్య ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రంగం ఇది. ఎందుకంటే అమ్మ కడుపులో పెరుగుతున్న నలుసుకు ఉన్నట్టుండి గుండె వేగం విపరీతంగా పెరిగిపోవచ్చు, బాగా తగ్గిపోనూ వచ్చు. గుండె ఏర్పడే క్రమంలోనే.. కవాటాలు బిగుసుకుపోయి అసలు గుండె గదులు సరిగా తయారవ్వకపోవచ్చు. అలాగే బిడ్డ పుట్టే వరకూ రక్తప్రవాహం కోసం గుండె గదుల మధ్య ఉండాల్సిన రంధ్రం ముందే మూసుకుని పోవచ్చు. ఇవన్నీ కీలక సమస్యలే. ఇవి పిండానికి గండం తెచ్చిపెట్టే సమస్యలు! బిడ్డ కడుపులోనే చనిపోవటం ఎంతటి గర్భశోకాన్ని మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అది.. లేకలేక నిలిచిన గర్భమైతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే వైద్యరంగం ఈ పిండం గుండె సమస్యలను నెగ్గుకొచ్చేదెలా? అన్న దానిపై పరిశోధనలు చేస్తోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు, చికిత్సా ద్వారాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

లోపాలు ఎప్పుడు గుర్తించొచ్చు?

* గర్భస్థ పిండానికి 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. 4 వారాలకల్లా గుండె గదులు ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. గర్భిణికి వూబకాయం లేకపోతే నిపుణులైన ఎకో కార్డియోగ్రాఫర్లు ఈ సమస్యలను చాలావరకూ 16వ వారంలోనే గుర్తించగలుగుతారు. సాధారణంగా గర్భిణికి 18-22 వారాల సమయంలో స్కానింగుల్లో భాగంగా ‘ఫీటల్‌ ఎకో’ చేయాలి. ఒకవేళ గతంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బులున్నా, గర్భం పోయినా, బిడ్డలు చనిపోయిన చరిత్ర ఉన్నా.. ఇంకా ముందు నుంచే ఫీటల్‌ ఎకో స్కానింగులు చెయ్యాలి.

కొన్నిసార్లు 26-28 వారాల మధ్య కూడా పరీక్ష చేయిస్తుంటారు. కానీ 20 వారాల లోపు గనక తీవ్రమైన గుండె లోపాలను గుర్తిస్తే.. అవసరమైతే చికిత్సలు (ఫీటల్‌ కార్డియాక్‌ ఇంటర్వెన్షన్స్‌) లేదంటే అబార్షన్‌ చేయించుకునే వీలుంటుంది. తొలి వారాల్లోనే పిండం గుండె లోపాలు బయటపడితే తల్లిదండ్రులకు ముందుగానే అవగాహన కల్పించటం అవసరం. కొన్నిరకాల గుండె సమస్యలున్న బిడ్డలు పుట్టగానే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని కడుపులో ఉండగానే చికిత్స చేసే వెసులుబాటు ఉంటుంది.

గుండె వేగం అస్తవ్యస్తం

సాధారణంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం గుండె కొట్టుకునే వేగం (హార్ట్‌రేట్‌) నిమిషానికి 120-160 మధ్య ఉండాలి. 3-6 నెలల మధ్య కొంత ఎక్కువుంటుంది, 6-9 నెలల మధ్య కొంత తగ్గుతుంది. ఎంత తగ్గినా, ఎంత పెరిగినా మొత్తానికి అది 120-160 మధ్యనే ఉంటుంది. ఇది 100 కంటే తగ్గినా (ఫీటల్‌ బ్రాడీకార్డియా), 180 కంటే ఎక్కువైనా (ఫీటల్‌ టెకీకార్డియా) దాన్ని సమస్యగా గుర్తించాలి. ఇలా పిండం గుండె కొట్టుకునే రేటు అస్తవ్యస్తం కావటం చాలా పెద్ద సమస్య. ఇది 22-36 వారాల మధ్య ఎక్కువగా కనబడుతుంది.

 గుర్తించేదెలా

 ఎవరికి వారే దీన్ని గుర్తించటం కష్టం. కాకపోతేపిండానికి ఇటువంటి ‘హార్ట్‌ రేట్‌’ సమస్యలుంటే గుండె నుంచి రక్తం పంపింగ్‌ తగ్గిపోయి.. బిడ్డ త్వరగా అలిసిపోయినట్త్లె కదలికలు తగ్గుతాయి. కాబట్టి పిండం కదలికలు తగ్గినట్టు అనిపిస్తే దాన్ని వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లాలి. వాస్తవానికి పిండం కదలికలు తగ్గటమన్నది చాలా రకాల సందర్భాల్లో జరగుతుంటుంది. వాటిలో ఇది కూడా ఒకటి. రెండోది- మామూలుగా గర్భిణులకు గైనకాలజిస్టులు క్రమం ప్రకారం చేసే స్కానింగుల్లో ఇది బయటపడుతుంది. ఈ రెండు మార్గాల్లో తప్పించి వీటిని మరే విధంగానూ గుర్తించే అవకాశం ఉండదు.

 గుర్తించకపోతే

 పిండం గుండె వేగం 220 కంటే ఎక్కువగా పెరిగిపోతే.. ‘ఫీటల్‌ హైడ్రాప్స్‌’ అనే సమస్యకు దారి తీస్తుంది. అంటే గుండె చుట్టూ, ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు చేరిపోతుంది. ముఖం ఉబ్బిపోవటం, మాయ పెద్దదవటం… ఇవన్నీ వస్తాయి. దీన్ని గుర్తించలేకపోతే పిండం తల్లి కడుపులోనే చనిపోతుంది. కాబట్టి దీన్ని కచ్చితంగా గుర్తించాలి

గుర్తిస్తే

 ఈ సమస్యను ముందే గుర్తిస్తే గర్భంలో ఉండగానే చికిత్స చెయ్యచ్చు. దీనికి మూడు పద్ధతులున్నాయి.

1. తల్లికి మందులు ఇవ్వచ్చు. మాత్రల రూపంలో ఇచ్చే ఈ మందులు మాయను దాటుకొని శిశువును చేరుకుని, గుండె కొట్టుకునే వేగాన్ని సరిచేస్తాయి. వీటిలో కొన్ని మందుల వల్ల తల్లి గుండె కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి తరచుగా తల్లికి ఈసీజీ తీసి చూస్తుంటారు. ఈ మందులతో 90% నియంత్రణలోకి వచ్చేస్తుంటుంది. ఈ పిల్లలు పుట్టిన తర్వాత కొందరికి అవసరాన్ని బట్టి మూణ్నెల్ల నుంచి సంవత్సరం వరకు మందులు ఇవ్వాల్సిన అవసరం రావొచ్చు.

2. ఉమ్మనీటిలోకి ఇంజెక్షన్‌.. పిండం బాగా ఉబ్బిపోయి.. తల్లికి మందులిచ్చినా పిండం గుండె వేగం తగ్గకుండా.. తల్లికి వాంతులు కూడా అవుతుంటే.. కొన్ని సందర్భాల్లో మందును నేరుగా ఉమ్మనీటి సంచిలోకి కూడా ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చి నియంత్రించొచ్చు.

3. పిండానికే ఇంజెక్షన్‌.. అల్ట్రాసౌండ్‌ సాయంతో చూస్తూ తల్లి పొట్ట మీది నుంచే నేరుగా పిండానికే ఇంజక్షన్‌ ఇవ్వటమన్నది మరో విధానం. ఇది సుశిక్షితులైన నిపుణులు మాత్రమే జాగ్రత్తగా, బిడ్డకు ఎటువంటి హానీ జరగకుండా ఇవ్వగలరు.

పుట్టిన తర్వాత.. గుండె వేగం అస్తవ్యస్తం కావటానికి కారణాన్ని బట్టి ఈ బిడ్డలకు 1-3 వారాలు, కొద్దిమందికి 6 వారాల నుంచి 3 నెలలలోపు మందులు ఇవ్వాల్సి రావచ్చు. కొందరిలో గుండెలోని విద్యుత్‌ ప్రసారాల్లో తేడాల వల్ల గుండె వేగం మారిపోతుంది. వీరికి ఏడాది పాటు మందులు ఇవ్వాల్సి రావచ్చు. మొత్తానికి ఈ పిల్లలు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతారు. దీనికి సంబంధించిన ఇబ్బందులేవీ వెంటాడటమన్నది ఉండదు.

విశేషాలు

* పిండానికి గుండె మరమ్మతు చెయ్యాలంటే దీనికి పెద్ద బృందమే కావాలి. పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌, ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, ప్రసూతి నిపుణులు, పీడియాట్రిక్‌ అనస్థెటిస్ట్‌, నియోనేటాలజిస్ట్‌, శిక్షితులైన నర్సులు.. అందరూ ఉండాలి. తల్లికి దుష్ప్రభావాలు రాకుండా గైనకాలజిస్ట్‌లు జాగ్రత్తలు తీసుకుంటారు.

* ఈ ప్రక్రియలు చేసే సమయంలో కదలకుండా ఉండేందుకు పిండానికి మత్తు ఇస్తారు. ఈ మత్తు ఇచ్చిన 2 నిమిషాల తర్వాత పిండం కదలకుండా స్థిరంగా ఉంటుంది. అప్పుడు చికిత్సా ప్రక్రియలు చేపట్టటం తేలిక.

పిండం గుండెకు ఎందుకీ గండం?

పిండం ఎదిగే క్రమంలో గుండెలో లోపాలు తలెత్తటానికి ఎన్నో అంశాలు కారణమవుతున్నాయి.
* జన్యుపరమైన అంశాలు

* వాతావరణ కాలుష్యం

* ఫోలిక్‌ యాసిడ్‌ లోపం

 * పురుగు మందుల ప్రభావం

 * గర్భిణికి తొలి మూణ్నెల్లలో జ్వరాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకటం

* పోషకాహార లోపం

* పొగ పీల్చటం (పాసివ్‌ స్మోకింగ్‌)

* గర్భిణి ఫిట్స్‌ వంటి జబ్బులకు వేసుకునే మాత్రలు

 * తెలియకుండానే రేడియో ధార్మిక ప్రభావానికి గురికావటం

 మేనరిక వివాహాలు

 సాధారణంగా ప్రతి వెయ్యిమంది పిల్లల్లో 10 మందికి పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటుంటాయి. కానీ మేనరిక వివాహాలు చేసుకున్న వారికి పుట్టే పిల్లల్లో ప్రతి వెయ్యి మందిలో 40-50 మందిలో ఇవి కనిపిస్తున్నాయని అలీగఢ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

ఫలితం ఉంటుందా?

పిండం దశలోనే మనం ఈ చికిత్సా ప్రక్రియలు చేపట్టటం వల్ల ఫలితం ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. గుండె వేగానికి సంబంధించిన అరిత్మియాలను నూటికి నూరు శాతం నయం చేసే వీలుంది. అలాగే రంధ్రాన్నీ సరిచెయ్యచ్చు. ఇక కవాటాల విషయంలో- ఈ ఆపరేషన్లతో 30-50% బతికి బట్టకడుతున్నారు. కాబట్టి నూటికి నూరుశాతం మరణిస్తారని తెలిసీ వదిలెయ్యటం కంటే 30-50 శాతం మంది చక్కగా జీవించేలా చెయ్యటం సాధ్యమేనన్నది గమనించాల్సిన విషయం.

మూసుకునే కవాటాలుసాధారణంగా పిండంలో 12 వారాల వారాల్లోపే గుండెలోని గదులు రూపొందుతాయి. ఈ గదుల్లోకి రక్తం వచ్చిపోయేందుకు కీలకమైన కవాటాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ కవాటాలు మూసుకుపోతే రక్తప్రవాహం లేక అసలు గుండె గదులే సరిగా తయారవ్వవు. రక్తప్రవాహం లేని గదులు చిన్నగా కుచించుకుపోతాయి. పిండ దశలో ప్రధానంగా ఈ సమస్య- అయోటిక్‌ వాల్వ్‌, పల్మనరీ వాల్వ్‌లకు ఎక్కువగా కనబడుతుంటుంది.

* గుర్తించేదెలా..

16-18 వారాలలోపు స్కానింగ్‌ చేసినపుడు కవాటాల లోపం (అయోటిక్‌ స్టినోసిస్‌, పల్మనరీ అట్రీసియా) వంటివి గుర్తిస్తే.. 26 వారాల లోపు ఆపరేషన్‌ చేసి లోపాలను సవరించొచ్చు.

* గుర్తించకపోతే..

కవాటాలు మూసుకుపోయే సమస్య తీవ్రస్థాయిలో ఉంటే వీరు హైపోప్లాస్టిక్‌ లెఫ్ట్‌ హార్ట్‌ సిండ్రోమ్‌, రైట్‌హార్ట్‌ సిండ్రోమ్‌ అనే సమస్యల్లోకి వెళ్లిపోతారు. పుట్టకముందే తల్లి కడుపులోనే చనిపోవచ్చు లేదంటే పుట్టగానే చనిపోతారు. కొందరు బతికి బట్టకట్టినా తీవ్ర ఇబ్బందులతో ఆయుర్దాయం సరిగా ఉండదు.

* గుర్తిస్తే..

ఈ అడ్డంకులను గుర్తించి, మూడు నెలలలోపే వాటిని వెడల్పు చెయ్యగలిగితే- ఆ గదులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. దీనికోసమే ఇప్పుడు ఇప్పుడు అత్యాధునికమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అల్ట్రాసౌండ్‌ ద్వారా చూస్తూ.. తల్లి పొట్ట మీది నుంచి ప్రత్యేక సూదులు, వాటితో బెలూన్‌ను నేరుగా పిండం గుండెలోకి పంపి.. బెలూన్‌ను ఉబ్బించటం ద్వారా కవాటాన్ని వెడల్పు చెయ్యాలి. ప్రస్తుతం ఈ ఆపరేషన్లు 50-60% వరకూ విజయవంతమవుతున్నాయి.

* పుట్టిన తర్వాత.. 20-30 శాతం మందికి మళ్లీ బెలూన్‌తో వెడల్పు చేయాల్సి వస్తుందిగానీ అదేమంత పెద్ద విషయం కాదు. దాన్ని చాలా తేలికగా చేస్తారు. ఒకసారి కవాటాలు వెడల్పు చేసి.. రక్తప్రవాహాన్ని సరిచేసి.. గుండె గదులు చక్కగా పెరిగేలా చూడగలిగితే వారు దాదాపు సాధారణ జీవితం గడపగలుగుతారు. కాకపోతే ఇది కొద్దిమందిలోనే సాధ్యమవుతుంది.

ముందే మూసుకునే రంధ్రం (ఎర్లీ క్లోజర్‌ ఆఫ్‌ ఫొరామినా ఒవేల్‌)

* పిండం తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు.. పిండానికి మంచి రక్తం తల్లి మాయ నుంచే వెళుతుంటుంది, పిండం చెడు రక్తాన్నీ తల్లి శరీరమే శుద్ధి చేస్తుంటుంది. ఇలా తల్లి నుంచి రక్తప్రవాహానికి వీలుగా పిండం ఎదిగేటప్పుడు, బిడ్డ పుట్టే వరకూ కూడా… పిండం గుండెలోని పైరెండు గదుల మధ్యా సహజంగానే ఒక రంధ్రం ఉంటుంది. దీన్నే ‘ఫొరామినా ఒవేల్‌’ అంటారు. ఇది కీలకం. పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చుకుని, బిడ్డ వూపిరితిత్తులు పని చెయ్యటం ఆరంభించగానే ఇక దీని అవసరం ఉండదు. కాబట్టి ఇది 72 గంటల్లోపే పని చెయ్యటం మానేస్తుంది, 4-6 వారాల్లో పూర్తిగా మూసుకుపోతుంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మూసుకుపోవాల్సిన ఈ రంధ్రం… కొందరిలో పిండం పొట్టలో ఉన్నప్పుడే మూసుకుపోతుంది. దీనివల్ల పిండానికి రక్తసరఫరా తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితి తలెత్తుతుంది. గుండెలోకి రక్తం వస్తూనే ఉంటుందిగానీ అది సరిగా బయటకుపోదు కాబట్టి గుండె పెద్దగా అయిపోతుంది, నీరు పడుతుంది, ఒకవైపు గుండె గదులన్నీ చిన్నగా కుచించుకుపోతుంటాయి.

* గుర్తించేదెలా..

దీన్ని కేవలం స్కానింగుల్లో మాత్రమే గుర్తించగలరు. కాబట్టి పిండం ఎదిగే క్రమంలో వైద్యులు చెప్పినట్టుగా స్కానింగులు చెయ్యటం తప్పనిసరి.

* గుర్తిస్తే..

3-6 నెలల మధ్య మూసుకుపోతే.. తల్లి కడుపు మీది నుంచి కొన్ని ప్రత్యేక సూదులు, వాటితో పాటు బెలూన్‌ను పిండం గుండెలోని ఆ రంధ్రం వరకూ పంపి.. బెలూన్‌ ఉబ్బించటం ద్వారా దాన్ని తెరవచ్చు. ఇదొక్కటే పరిష్కారం. ఒకవేళ కాన్పుకు 2-4 వారాల ముందు ఈ సమస్యను గుర్తిస్తే.. అప్పటికే బిడ్డ చాలావరకూ ఎదిగింది కాబట్టి వెంటనే అధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రిలో కాన్పు చేసి.. బిడ్డను బయట కొద్ది వారాల పాటు జాగ్రత్తగా చూసుకుంటారు.

* గుర్తించకపోతే..

తొలివారాల్లోనే మూసుకుపోతే.. ఆలస్యం అయినకొద్దీ శిశువు కడుపులోనే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని తెరిచే చికిత్సా ప్రక్రియ చెయ్యాలి. మలివారాల్లో అయితే కాన్పు చేసెయ్యాలి. దీన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

డా|| కోనేటి నాగేశ్వరరావు
పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌
కేర్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.