మూత్రపిండాల్లో రాళ్లు
మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
June 10, 2014
తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు
September 12, 2014
usiri

ఉసిరికాయ పెచ్చుల పొడి, పిల్లిపీచర గడ్డల పొడి (శతావరి), పంచదార, తేనె ఈ నాలుగింటినీ సమాన భాగాలు కలిపి పాలు లేదా నెయ్యితో తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీనిని చతుస్సమ కల్పం అంటారు.

ఉసిరి పండ్ల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే వాయువు బంధించబడి, పైవైపుకదలటం వల్ల వచ్చిన కడుపు నొప్పి తగ్గుతుంది.

ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తం వల్ల వచ్చే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. లేదా ఉసిరిపండ్ల రసానికి ద్రాక్ష పండ్ల గుజ్జును, పంచదారను కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఉసిరి పండ్ల పొడికి లోహ భస్మం, అతి మధురం పొడిని కలిపి తేనె అనుపానంగా తీసుకుంటే ఆహారం జీర్ణమయ్యే సమయంలో వచ్చే పరిణామశూల తగ్గుతుంది.

ఉసిరిపొడికి వేపాకు పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలం నుంచి బాధించే చర్మవ్యాధులు తగ్గుతాయి.

ఉసిరిపండ్ల పెచ్చులు, చండ్ర చెక్కలను నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి, బావంచాలు గింజల పొడిని కలిపి తీసుకుంటే తెల్లమచ్చలు త్వరితగతిన తగ్గుతాయి.

ఉసిరిపెచ్చులు, పసుపు దుంపలను నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసి తేనె కలిపి తీసుకుంటే వాతరక్తం తగ్గుతుంది.

ఉసిరిపండ్ల రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారైన చీము పొక్కులు తగ్గుతాయి. మలబద్ధకం ఉంటే తెల్లతెగడ వేరు బెరడు పొడిని కలిపి తీసుకోవాలి.

ఉసిరిపండ్ల పెచ్చుల పొడిని చన్నీళ్లతో కలిపి బాహ్యంగా ప్రయోగించటంతోపాటు అభ్యంతరంగా కూడా తీసుకుంటే చర్మం పైన వేగంగా వ్యాపించే శోధ తగ్గుతుంది.

ఉసిరిపండ్ల పెచ్చులను, ఇప్పపువ్వులను (మధూకం) నీళ్లకు కలిపి మరిగించి, తేనె కలిపి బాగా పుక్కిట పడితే నోటిలోనూ, గొంతులోనూ తయారైన పూత, నోటి పుండ్లు తగ్గుతాయి.

లేత ఉసిరి పండ్లను ఎంచుకొని తెచ్చి, గోమూత్రంలో వారంపాటు ఊరబెట్టి, మేకపాలతో కలిపి మెత్తని పేస్టు మాదిరిగా నూరి, ముఖ చర్మం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే మంగు మచ్చలు తగ్గుతాయి.

ఉసిరిపండ్లు, మండూర భస్మం, మందార పువ్వులను మెత్తని ముద్దగా నూరి, తలస్నానానికి ముందు జుట్టుకు ప్రయోగిస్తే జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది.

ఉసిరి పెచ్చులు, పసుపుకొమ్ములను ముద్దగా నూరి తీసుకుంటే ప్రమేహంలో అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. మధుమేహం లేనివారు తేనె కలిపి తీసుకోవచ్చు.

ఉసిరిపెచ్చులు, కరకపిందెలు, తానికాయ, తుంగముస్తలు, మానుపసుపు, దేవదారు చేవలను సమాన మాత్రలో తీసుకొని, 10 గ్రాముల మిశ్రమాన్ని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి, 10-20 మిల్లీలీటర్ల మోతాదులో ఉదయ సాయంకాలాలు తీసుకుంటే ప్రమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

ఉసిరి రసాన్ని 160 మిల్లీలీటర్ల మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.

ఉసిరి రసానికి ఏలక్కాయ పొడిని కలిపి తీసుకుంటే మూత్ర పరిమాణం పెరుగుతుంది.

ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

-డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.