కడుపులో గ్యాస్‌ ఉంటుందా ?

కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది వైద్యున్ని సంప్రదించడం సాధారణమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గమనించాలి.

కారణాలు : ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునేవారు, వ్యాయామం లేనివారు, అతిగా నిద్రపోయేవారు, కొన్ని మందుల వల్ల జీర్ణాశయంలో, పేగుల్లో కొన్ని సూక్ష్మ జీవుల వల్ల గ్యాస్‌ ఏర్పడుతుంది. ఇది ఉర్ధ్వముఖంగాని, అపానవాయువుగా గాని బయటికిపోవాలి. లేదంటే మనిషిని చాలా కష్టపెడుతుంది. జీర్ణవ్యవస్థ లోపం వల్ల, పిత్తాశయ వ్యాధి వల్ల, జీర్ణాశయానికి, పేగులకు ఆపరేషన్‌ తర్వాత గాని, జీర్ణవ్యవస్థలో వ్యాధులవల్ల, పిండి పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల (కూరగాయలు అంటే క్యాబేజి, ఆలుగడ్డ, కందగడ్డ శ్యామగడ్డ, వుల్లి), పేగులలో వుండే కొన్ని బ్యాక్టీరియా ప్రభావం వల్ల కూడా గ్యాస్‌ ఏర్పడుతుంది. అమీబియాసిస్‌లో గ్యాస్‌ ఎక్కువగా వుండవచ్చు.

లక్షణాలు : కడుపు ఎప్పుడు ఉబ్బరించుకోవడం. అన్నంతిన్న తర్వాత ఆయాసంగా ఉండడం. కడుపు, గుండెలో మంటగా ఉంటుంది. తేన్పు రావడానికి ఇబ్బంది. తేన్పులు వచ్చినప్పుడు అపానవాయువు ద్వారాగాని గ్యాస్‌ బయటికిపోతే ఉపశమనం కలగడం. ఏమి తిననప్పుడు కూడా కడుపు ఉబ్బరించుకోవడం. నడవడానికి కూడా ఇబ్బంది పడడం.

చికిత్స : కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం అతిముఖ్యమైంది. బ్రిస్క్‌వాక్‌ రోజు 40 నిమిషాలు ఉదయం, లేక సాయంత్రం చేయాలి. నీళ్లు బాగా తాగాలి. స్విమింగ్‌ లేక తాడుతో గెంతడం (స్కిప్పింగ్‌) చేయాలి. అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. గ్యాస్‌ ఎక్కువ చేసే పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా మద్యం సేవించకూడదు. మసాల దినుసులు తగ్గించాలి. వేళకూ మితంగా భోజనం చేయాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. డైమల్‌ సిరఫ్‌ గాని, యూనిమెంజైమ్‌ మాత్రలు రోజుకు రెండు వాడాలి. అమీబియాసిస్‌ ఉంటే వైద్యుని సలహా మేరకు మందులు వాడాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి

చీఫ్‌ ఫిజిషియన్‌,

మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌, ఎంహెచ్‌ భవన్‌

అజామాబాద్‌, హైద్రాబాద్‌.

ఫోన్‌ : 9676376669

(మూలం – ప్రజాశక్తి, 18 అక్టోబర్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*