గుండెనొప్పి – ఇసిజి
October 19, 2010
పుట్టుమచ్చలు – క్యాన్సర్‌
October 19, 2010

కథలు రోగాన్ని నయం చేస్తాయా?

ఆమె అరవై ఏళ్ళ వయస్సున్న మనిషి. అనేక రోజులుగా అనేక మంది దగ్గర బిపికి, వణుకుడికి వైద్యం చేయించుకుంటోంది. ఎక్కడా తగ్గట్లా.

ఒకరోజు నా ఛాంబర్‌లోకి తూలిపోతూ వచ్చింది. బిపి కూడా 170/110 ఉంది. 3 రోజులు ఎడ్మిట్‌ అయి ఉంటానని చెప్పింది. నెమ్మదిగా కష్టం ఏమిటి, ఎప్పట్నించీ, ఎలా వస్తోంది కూపీలాగాను. సుమారు 3 సంవత్సరాలక్రితం తన కూతురు ఏదో జబ్బుతో చనిపోయింది. అప్పట్నుంచీ ఈవిడ పరిస్థితి ‘కళాకళ్లు వెలావెళ్లు’ అంటే బిపి ఎక్కువ ఉండటం, వణుకు, ఆయాసం, వగైరా వగైరా. ఎంతమంది దగ్గర చూపించినా తగ్గట్లేదు.

వివరాలన్నీ కనుక్కుని అలాగే ఉండు. దానికేం భాగ్యం అని అడ్మిట్‌ చేశాం.

ఆమెను ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు వేశాను.

1. వంద ఏళ్లు బ్రతికిన వాళ్లని ఎంతమందిని చూశారు.

2. అసలు చనిపోకుండా ఉన్నవాళ్ళని ఎవర్నైనా చూశారా?

3. హిందువుల నమ్మకం ప్రకారం చనిపోయినవాళ్ళు కూడా పైన ఎక్కడో ఏదోలోకాల్లో ఉంటారని. అలా ఉంటే నీ కూతురు పై నుంచి చూస్తూ ఉంటుందీ కదా. అలా చూస్తూ ఉంటే తన తల్లి ఇలా ఇన్ని రోజుల తర్వాత కూడా దుఃఖపడటం చూసి ఆనందిస్తుందా?

4. ఇలా ఎంతకాలం దుఃఖపడుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడదామని ఉంది?

ఈ ప్రశ్నలు ఆమెని కలవరపెట్టాయి.

నిజమే. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు?

అందరూ బ్రతికే ఉంటే ఈ భూమి మీద చోటు సరిపోతుందా?

అందరూ చనిపోవాల్సిందే కదా? అలాంటప్పుడు, చావు గురించి భయపడటంలో అర్ధముందా?

మనతోటివారు చనిపోయారని ఏళ్ల తరబడి మన ఆరోగ్యం పాడుచేసుకోవటంలో అర్ధముందా?

పైగా భారతంలో ఒక కథ ఉంది.

ధర్మరాజు తన సోదరులతో అరణ్యవాసంలో ఉన్నాడు. దాహంవేసి తన సోదరుల్ని నీటికోసం పంపాడు. వాళ్లంతా యక్షుడితో తలపడి మూర్ఛిల్లారు. అప్పుడు ధర్మరాజుని యక్షుడు కొన్నిముఖ్యమైన ప్రశ్నలడిగాడు. వాటిలోని ఒక ముఖ్యమైన ప్రశ్న- ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయమేది. దీనికి ధర్మరాజిచ్చిన సమాధానం మనల్నందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది

‘లోకంలో ఇంతమంది పుడుతున్నారు. ఇంతమంది చనిపోతున్నారు. ఇవి చూస్తూ మనిషి తనంతటివాడు లేడు అని విర్రవీగుతుంటాడు కదా’ అని.

నిజంగా అందరినీ ఆలోచింపజేసే సమాధానం.

ఈ కథని కూడా ఆమెకి చెప్పటం జరిగింది. ఆశ్చర్యకరంగా ఆమె ఆరోగ్యం బాగుపడింది. ఇలాంటి కథలనే ‘పారాబుల్స్‌’ అంటారు. దీన్నే ‘పారడీ షిప్ట్‌’ అంటారు. అంటే ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవటం అని.

జరిగేది ఒకే రకమైన సంఘటనే. దానికి రకరకాల మనుష్యులు రకరకాలుగా స్పందిస్తారు. చాలాసార్లు వేరేకోణం నుంచి ఆలోచించటం వలన ఫలితం ఉండవచ్చు.

ఉదాహరణకు ఇలాంటి సంఘటనే జరిగిన కొందరు నటులు వాళ్ళ పిల్లల పేరుతో ఒక బృహత్తరమైన సత్కార్యం చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివారిని చూసి మనం కూడా స్ఫూర్తిని పొందితే బాగుంటుంది.

డా|| మెట్లపల్లి జగన్‌మోహన్‌,

 వీ.ణ.,ణ.వీ.,

గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు,

సెల్‌: 94408 83800

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.