కలుషిత పదార్ధాలతో వచ్చే అమీబియాసిస్‌

ఛాతీ నొప్పి, ఆయాసం
June 1, 2011
ఆస్థమాతో జాగ్రత్త
June 1, 2011

కలుషిత పదార్ధాలతో వచ్చే అమీబియాసిస్‌

తరచూ ప్రయాణాలు చేసేవారు ఆందోళన పడే అంశాలు పరిశుభ్రమైన ఆహారం, నీరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కలుషితమైనవి తీసుకోవాల్సి వస్తే దాంతో వచ్చే ఇబ్బందులు వర్ణనాతీతం. జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో కడుపు ఉబ్బరం, బంక విరోచనాలు, నెత్తుటి విరోచనాలు వంటివి ఏర్పడుతుంటాయి. దానికి కారణం ‘అమీబియాసిస్‌’.

అమీబియాసిస్‌ అంటే…

ప్రోటోజోవా అనే ఒక ఏకకణ జీవి వల్ల అమీబియాసిస్‌ అనే ఈ వ్యాధి వస్తుంది. వ్యాధికి కారణమయ్యే ఆ ఏకకణ జీవి పేరు ‘ఎంటమిబా హిస్టోలిటికా’. ఈ జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహార పదార్ధాల మీద లేదా నీళ్ళలో కలవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.ఒక్కోసారి చేతులు మురికి అయి వాటిని నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా వ్యాధి సోకవచ్చు. అందుకే ఆరుబయట మల విసర్జన జరిగినప్పుడు ఎంటమిబా హిస్టోలిటికా నీళ్ళలో కలవడం అన్నది ఈ వ్యాధికి ప్రధాన కారణమవుతుంది. మన దేశంలో పల్లెల్లో ఇంకా సరైన శానిటేషన్‌ సౌకర్యాలు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల దీని వ్యాప్తి సర్వసాధారణం అయ్యింది.

ఇలా నోటి ద్వారా శరీరంలోకి చేరే ఈ జీవి జీర్ణ వ్యవస్థలోని పెద్ద పేగు వరకు వెళ్ళి సమస్యలు సృష్టిస్తుంది. జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించే ఈ జీవులు పేగుల లోపలి పొర (ఇంటెస్టైనల్‌ లైనింగ్‌)ను దెబ్బ తీస్తాయి. దీన్నే అమీబిక్‌ కొలైటిస్‌ అంటారు. ఒక్కోసారి ఇవి రక్త ప్రవాహంలోకి చేరి కొన్ని సందర్భాల్లో కాలేయంలోకి వ్యాపించవచ్చు. ఫలితంగా వచ్చే సమస్యను అమీబిక్‌ లివర్‌ యాబ్సెసెస్‌ అంటారు. కొన్నిసార్లు ఈ అమీబిక్‌ లివర్‌ యాబ్సెసెస్‌ అనే సమస్య నీళ్ళ విరోచనాల వంటి లక్షణాలేమీ కనిపించకుండానే రావచ్చు. ఈ సందర్భంలో మరో విషయం కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నీళ్ళ విరోచనాలు అమీబియాసిస్‌కు ఒక లక్షణమే అయినా… నీళ్ళ విరోచనాలు అయిన ప్రతి సందర్భంలోనూ దానికి అమీబియాసిస్‌ మాత్రమే కారణం కాకపోవచ్చు. సాధారణంగా ప్రయాణాల్లో వచ్చే నీళ్ళ విరోచనాలు ‘ట్రావెలర్స్‌ డయేరియా’ను అమీబియాసిస్‌గా పొరబాటు పడే అవకాశం కూడా ఉంది.

లక్షణాలు…

అమీబియాసిస్‌కు కారణమైన ఏకకణ జీవి (ప్రోటోజోవా) కడుపులోకి చేరినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ అమీబియాసిస్‌ సోకినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, వికారం (నాజియా)తో ఒక్కోసారి వాంతులు కూడా కల్గుతాయి. జ్వరం వస్తుంది. శక్తి తగ్గిపోయి నీరసంగా మారడం జరుగుతుంది.

కారణాలు…

సరైన శానిటేషన్‌ సౌకర్యాలు లేనప్పుడు దీని గుడ్ల (సిస్ట్‌‌స) దశ లేదా ఇతరత్రా (ట్రోపోజువాయిట్‌ వంటీ) దశలలో కూడా ఇది వ్యాప్తి చెందవచ్చు.

నివారణ…

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం..అంటే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వంటివి.ప్రయాణాల్లో ఎక్కడ పడితే అక్కడ కలుషితమైన నీటిని తాగడం వంటి చర్యల వల్ల ఈ జీవుల వ్యాప్తి జరుగుతుంది.ఇలా కలుషితమైన ఆహారం సరిగ్గా ఉడికించకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు వ్యాప్తి జరగవచ్చు.

నిర్ధారణ పరీక్షలు…

మల పరీక్ష ద్వారా అమీబియాసిస్‌ నిర్ధారణ చేస్తారు.

డాశ్రీరంగ్‌ అబ్కారీ
కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజీషియన్‌
అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌
ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 9848540595

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.