మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం
October 19, 2010
కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు
October 25, 2010

కారణం తెలియని కడుపునొప్పి

ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌. దీనినే ఐబిఎస్‌ అని కూడా అంటారు. ఇది జీర్ణాశయంలో జీర్ణకోశం, పేగులకు సంబంధించిన వ్యాధి. జీర్ణకోశం, పేగుల పనితీరులో మార్పులుంటాయి. మలవిసర్జనలో మార్పులు, కడుపులో ఓ విధమైన నొప్పిగా ఉంటుంది. పేగులు అతిగా స్పందించడం వల్ల ఇది కలుగుతుంది. స్త్రీలలో ఎక్కువ. సాధారణంగా 30 ఏళ్లలోపు వయస్సులో అధికం.

కారణాలు 

 దీనికి స్పష్టమైన కారణం అంటూ తెలియదు. కొందరిలో ఆహారం సరిపడక అలర్జీగా తయారై, వ్యాధిగా పరిణమించవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన కారణాలుగా చెప్పొచ్చు. మాల్‌ అబ్జార్పషన్‌ నుండి కూడా ఇది సంభవించవచ్చు.

లక్షణాలు 

 ఉదరంలో కిందగాని, పక్కలకుగాని, ఏ భాగం లోనైనా నొప్పిగా ఉంటుంది. కడుపు గుడ గుడ గానీ, మెలిపెట్టినట్టు నొప్పి గానీ ఉండొచ్చు. ఈ నొప్పి వీపువైపునకు గానీ లేక ఛాతీ కిగాని పాకవచ్చు. మలబ ద్దకం, తర్వాత నీళ్ళ వీరేచనాలు ఒకదాని తర్వాత ఒకటి, మ్యూకస్‌తో కూడిన, నున్నటి మలవి సర్జన కలు గుతుంది.. రిబ్బన్‌ లేక పెన్సిల్‌ లాగా వీరేచనాలు రక్తం లేకుండా ఉంటుంది. కడుపు వుబ్బరంగా వుంటుంది. ఏవైనా తింటూనే కడుపులో గుడ గుడ అనిపించి విరేచ నానికి వెళ్తారు. విరేచనంలో మలం లేకపోయినా, గ్యాస్‌ పోవడం, దానివల్ల కడుపు నొప్పి తగ్గినట్టు ఉంటుంది. ఇవి ప్రధాన లక్షణాలు. మానసిక ఒత్తిడి, మరి ఆందోళన చెందే వారిలో ఈ ఐబిఎస్‌ ఎక్కువ. వీరేచనానికి వెళ్లివచ్చిన తర్వాత కూడ ఇంకా కడుపులో గ్యాస్‌గానీ, మలం గానీ మిగిలినట్టు ఫీలవుతారు. కింది కడుపులో తరచూ మలవిసర్జనమే కాక, మూత్రవిసర్జన కూడా జరగుతుంటుంది.

రోగ నిర్ధారణ

 వ్యాధి లక్షణాలు కలిగి, మానసిక ఒత్తిడి, ఆందోళనతో కూడిన రోగులు అయితే చాలా వరకు ఇది ఐబిఎస్‌గా పరిగణించాలి. రోగ నిర్ధారణకు మలపరీక్ష, సిగ్మాయిడోస్కోపి, బేరియం ఎనిమా, ఉదరభాగం ఎక్స్‌రే ముఖ్యమైనవి.

జాగ్రత్తలు – చికిత్స

* మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.

* ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకొంటే, వ్యాధి మందులు లేకుండా నయమవుతుందని వైద్యులు రోగికి ధైర్యం చెప్పాలి.

* మిర్చి, మసాల దినుసులు, పులుపు పదార్థాలు, చాక్లెట్‌లు మానాలి. పీచు పదార్థాలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

* లోపరమైడ్‌ 2ఎంజి మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. డాక్టర్‌ సలహా మేరకు ఇతర మందులు వాడాలి.

ఈ వ్యాధి నయమవడానికి కొన్ని నెలలు దాకా పట్టవచ్చు. మానసిక చికిత్సే, కాకుండా మందులు కూడా వాడాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి

చీఫ్‌ ఫిజిషియన్‌,

మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌, ఎంహెచ్‌ భవన్‌

అజామాబాద్‌, హైద్రాబాద్‌.

ఫోన్‌ : 9676376669

(మూలం – ప్రజాశక్తి, 25 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.