సమతౌల్యం లేని ఆహారం, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం, విపరీతమైన ఒత్తిళ్ళతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అతివేగంతో కూడిన జీవనశైలి వల్ల రాష్ట్రంలో ఉదరకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి.కాలేయం దెబ్బతినడానికి 40 నుంచి 50 శాతం వరకు వైరల్ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణమైతే, 30 నుంచి 40 శాతం మందిలో క్యాన్సర్ దెబ్బతినడానికి అతిగా మద్యం సేవించడమే ముఖ్యకారణం. ఆహారం, నీరు కలుషితమైనవి తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఎ,ఇ వైరస్‌లు దాడి చేసి కామెర్లు, తద్వారా కాలేయం పూర్తిగా పాడయిపోవడానికి కారణమవుతున్నాయి. కలుషితమైన సూదులు, సిరంజిలు వాడడం, మత్తు పదార్థాలు తీసుకోవడం తదితర కారణాల వల్ల హెపటైటిస్ బి,సి వైనస్‌లు ప్రవేశించి కాలేయాన్ని మట్టుబెడతాయి.
విపరీతంగా మద్యం సేవించడం వల్ల కాలేయం సిర్రోసిస్ అనే జబ్బుకు గురవుతుంది. ఫలితంగా కాలేయం పూర్తిగా చెడిపోతుంది. లివర్ ఇన్‌ఫెక్షన్లను గాని మద్యపాన ప్రభావాన్ని గాని నివారించగల అవకావం ఉన్నా అవగాహన లేక చాలా మంది వీటివల్ల కాలేయ క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. వేరుశగలాంటి గింజల్లో పెరిగే ఫంగస్‌లు ఉత్పత్తి చేసే ఆఫ్లటాక్సిన్లు కాలేయానికి క్యాన్సర్ కలుగజేస్తాయి. కొన్ని రకాల గర్భనిరోధక మాత్రలు కూడా కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తాయి. కూరగాయలను శుభ్రంగా కడగకుండా తినడం వల్ల కాలేయంలో తిత్తులాంటివి ఏర్పడతాయి.మన ఆహార అలవాట్లు సరిగా లేనప్పుడు కడుపులో ఆమ్లాలు అవసరానికి మించి తయారవుతాయి. వీటివల్ల లోపలి పొరలు దెబ్బతిని పుండులా ఏర్పడుతుంది. నొప్పి నివారించే పెయిన్ కొల్లర్ల వల్ల కూడా అల్సర్లు ఏర్పడతాయి.
కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళలో అల్సర్లు ఏర్పడానికి చాలా వరకు ఇవే కారణం. ఫలితం గా క్యాన్సర్ చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. పీచు పదార్థా లను చాలా తక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడికి గురవడం వల్ల అల్సరేటివ్ కోలైటిస్, క్రౌన్స్ డిసీజ్ లాంటివి పెద్దపేగును బాధిస్తాయి.మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వాళ్ళకి అల్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీనికి తోడు ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వంటి అలవాట్లు అల్సర్లను ప్రేరేపిస్తాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్ల హెలికోబాక్టర్ ఫైలోరి బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తాయి. తద్వారా జీర్ణకోశంలో అల్సర్లు బాధిస్తాయి.అవసరం కన్నా ఎక్కువగా తినడం, తక్కువ పనిచేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తద్వారా వచ్చే ఊబకాయం… గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవుతాయి. థాలసేమియా, సికిల్‌సెల్ అనీమియా, మలేరియా లాంటి రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉంటే నల్లని రాళ్ళు ఏర్పడతాయి. కాలెస్ట్రాల్ పెరిగితే పసుపు రంగు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నొప్పిగా ఉండడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు కూడా కలుగుతాయి. ఇవి క్లోమ గ్రంథికి కూడా సమస్యలు తెచ్చిపెడతాయి.
రక్తంలో చక్కెరలను నియంత్రించడమే కాకుండా ఆహారం జీర్ణం కావడంలో ప్రధాన పాత్ర వహించే క్లోమగ్రంథికి మన అలవాట్లే శాపాలవుతాయి. గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడడం, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల, కాల్షియం మోతాదు పెరిగినా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల శాతం పెరిగినా క్లోమ గ్రంథి కుళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. పాంక్రియాస్ దెబ్బతింటే 60 శాతం మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. దీన్నే అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. క్రానిక్ పాంక్రియాటైటిస్‌కు గురయినప్పుడు రాళ్లు క్లోమ నాళానికి అడ్డుపడడం వల్ల క్లోమరసానికి దారి ఉండదు. ఫలితంగా జీర్ణప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. క్లోమ గ్రంథిలో రాళ్ళు ఇన్సులిన్‌ను తయారు చేసే ఐలెట్ కణాలను సైతం దెబ్బతీస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరలు పెరుగుతాయి. బరువు చాలా తగ్గిపో తారు. ఈ పరిస్థితి క్లోమగ్రంథి క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. కడుపుబ్బరం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, నొప్పి, గుండెలో మంట, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గిపోవడం, మలం నల్లగా రావడం, రక్తం పడడం, హఠాత్తుగా మలబద్ధకం రావడం ఇవన్నీ దానికి సంకేతాలు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తినే ఆహారం, నీళ్ళు స్వచ్ఛంగా ఉండాలి. ఏది తిన్నా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. కొంచెం సమస్య అనిపించినా సొంతవైద్యానికి పోకుండా డాక్టర్‌ని కలిసి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యంగా వస్తే జబ్బు ముదిరితే ఎంత సమర్థవంతమైన డాక్టర్ అయినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. డాక్టర్ ఇచ్చిన మందుల మోతాదు పూర్తిగా తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం సమయపాలన పాటించడం, వేపుళ్ళు, మసాలాలు తగ్గించడం, మళ్ళీ మళ్ళీ మరిగించిన నూనెను వాడడం, బాగా కాల్చిన ఆహారం తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మద్యానికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్త పాటిస్తే ఎటువంటి జీర్ణ సమస్యలూ రావు. కాలేయమూ పదిలంగా ఉంటుంది.
– డా కె. రవీంద్రనాథ్
సర్జికల్ గాస్ట్రోఎంటరాలజిస్ట్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
గ్లోబల్ హాస్పిటల్, హైదారాబాద్
సెల్: 98490 34567
(సూర్య దినపత్రిక, జూలై ౧ )
సంబంధిత ఇతర వ్యాసాలు: