కీళ్ల అరుగుదలలో దశల వారీగా లక్షణాలు కనిపిస్తాయి. మొదటి దశలో మెట్లు ఎక్కడం, దిగడం కష్టంగాను, నేలమీద పద్మాసనం వేసుకుని కూర్చోవడం కష్టంగా ఉంటుంది. రెండో దశలో నడవడంలో నొప్పి కలుగుతుంది. మూడు, నాలుగో దశల్లో నడవడం చాలా కష్టమవుతుంది. కీళ్ల వ్యాధుల గురించి తెలిపే వ్యాధి నిర్ధారణ పరీక్షలు గురించి తెలుసు కుందాం….
ఎక్స్ రే : ఇది అతిముఖ్యమైన, చవకైన పరీక్ష. చాలా వరకు అరుగుదలను, వాటి దశలను ఎక్స్‌రేల ద్వారా నిర్ధారించొచ్చు. ఎక్స్‌రేలో మొదటి దశలో ఎముకల మధ్య గల సందు తగ్గిపోతుంది. రెండో దశలో ఎముకల పొరలలో మార్పులు, స్క్లిరోసిస్ గుర్తించొచ్చు. ఆస్టియోఫైట్స్ను కూడా గుర్తించొచ్చు.
ఆర్థ్రోస్కొపి : కడుపులో ఏదైనా అల్సర్ లేక గడ్డలు ఏర్పడినప్పుడు కార్బన్ ఫైబర్ పరికరాల ద్వారా లోపలి జబ్బును పరిశీలించే ఎండోస్కోపి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కీళ్లలోకి ప్రత్యేక కార్బన్ ఫైబర్ సహిత దృశ్యపరికరాన్ని ప్రవేశపెడతారు. దీని వల్ల కీళ్లలోని అరుగుదలను, కార్టిలేజ్‌లోని మార్పులను, దెబ్బతిన్న లిగమెంట్లను పరీశీలించొచ్చు. ఆర్థ్రోస్కోపి ద్వారా వ్యాధి నిర్ధారణనే కాక, అవసరమైన చోట లోపలి పదార్థాలను, ‘లూజ్ బాడీలను’ లాపేజ్ ప్రక్రియ ద్వారా, షేవింగ్ ప్రక్రియ ద్వారా శుభ్రపరచొచ్చు. సర్జరీ ద్వారా గ్రాఫ్టును ఉపయోగించి తెగిన లిగమెంట్లను సరిచేయొచ్చు.
సైనోవియల్ బయాప్సీ, ఆస్పిరేషన్ : సైనోవియల్ పొరను, ద్రవపదార్థాన్ని ప్రత్యేక సూదుల ద్వారా బయటకు తీసి పరీక్షిస్తారు. దీని వల్ల అరుగుదల, దానిలోని మూల కారణాలను విశ్లేషించొచ్చు.
ఆధునిక పరీక్షలు : సిటి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, రేడియో ఐసోటోప్ టెక్నీషియం, బోన్ స్కాన్ ద్వారా కూడా కీళ్ల అరుగుదల, ఇతర అనేక రకాలైన ఎముకల వ్యాధులను నిర్ధారించొచ్చు. ముఖ్యంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు ముందు అవగాహన కోసం ఈ స్కానింగ్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి.
డాక్టర్ జె. భాను కిరణ్
ఆర్థొపెడిక్ సర్జన్
డాక్టర్ వెంకట రామప్ప హాస్పిటల్
సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ
బెంగళూరురోడ్డు, అనంతపురం.
ఫోన్ : 08854272881
(మూలం – ప్రజాశక్తి, 18 అక్టోబర్)