గర్భ నిరోధక మాత్రలు
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా!
March 26, 2014
జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?
March 30, 2014

మన శరీరం పూర్తిగా జీవ కణజాలంతో నిర్మితమైంది. ప్రతి ఒక్క జీవకణానికి ప్రాణం ఉంటుంది. ఈ జీవకణాలకు ఎప్పుడు ఫ్లూయిడ్స్ (జీవజలం) సాంద్రత శాతం నిర్దిష్టంగా ఉండాలి. వేసవిలో ఎండ వేడిమికి శరీరంలో జీవజలం శాతం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలోని జీవకణాలు దెబ్బతిని ఆయా అవయవాలు విధి నిర్వహణ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తించలేక శరీరంలో శక్తి తక్కువైపోయి శరీరం కదలలేని పరిస్థితి ఏర్పడి కూలబడిపోతుంది. ఈ పరిస్థితినే ‘డిహైడ్రేషన్’ అని అంటాం. ఈ స్థితిలో ఉన్న వ్యక్తికి చల్లని నీళ్ళు పానీయం తాగిస్తే ఆ వ్యక్తి మళ్ళీ యధాస్థితికి వచ్చే అవకాశాలుంటాయి. ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పువాటిల్లే ప్రమాదముంది. కనుక వేసవిలో తరచూ నీళ్ళు తాగడం మంచిది. ఇట్లా చేయడంవల్ల నోరు ఎప్పుడూ పొడి ఆరిపోకుండా ఉంటుంది. చిన్న పిల్లల విషయంలో ప్రతి గంటకు నీళ్ళు తాగిస్తే మంచిది.

కూల్‌డ్రింక్స్

కూల్‌డ్రింక్స్ సాధారణంగా తియ్యగా వుండి తాగటానికి మంచి చల్లగా రుచిగా అనువుగా ఉంటాయి. ఈ కూల్‌డ్రింక్స్ చెడిపోకుండా నిల్వ వుంచడానికి ఉపయోగించే కొన్ని రసాయనిక పదార్థాలు సిట్రిక్ ఏసిడ్ (ఆమ్లాలు), రకరకాల రుచి, వాసనల కొరకు వాడే పదార్థాలు, రంగులు వాడడంవల్ల చాలా ఆకర్షణీయంగా ఉండి వాటిని చల్లబరచి తాగడంవల్ల, చల్లగా ఉండి వాటి యొక్క రుచి మరికొంత పెరిగి తాగటానికి మరింత హాయిగా ఉత్తేజాన్ని కలిగించేవిగా ఉంటాయి. బజారులో దొరికే కూల్‌డ్రింక్స్ అన్ని కూడ వేరువేరు కంపెనీ పేర్లతో వేరువేరు రూపాల్లో లభ్యమవుతాయి. అన్ని కూల్‌డ్రింక్స్‌కు వాడే (బేసిక్ ఇన్‌గ్రేడియంట్స్) ముడి పదార్థాలు మాత్రం ఇంచుమించు ఒకటేలా ఉంటాయి.

పళ్ళపై కూల్‌డ్రింక్స్ ప్రభావం

drinking_cooldrinkకూల్‌డ్రింక్స్ తాగిన తరువాత కాని లేక తాగుతున్నప్పుడు కాని మనం పరిశీలించినట్లైతే మన పళ్ళు కొంచెం బ్రిటిల్‌గా అంటే నున్నగా జిగురుగా లేకుండా కొంచెం బిరుసుగా (రఫ్) ఉన్నట్లు గమనించవచ్చు. మనం పై పళ్ళను క్రింది పళ్ళను కలిపి నూరినట్లైతే రాపిడి చేస్తే ఆ పళ్ళు కదలిక సున్నితంగా లేకుండా వత్తిడితో కూడిన శబ్దం (కిర్‌కిర్) మని వస్తుంది. అదే సమయంలో నాలుగు, ఐదు (4,5) సార్లు మన పళ్ళను ఆ విధంగా నూరినా, కదిపినా, నమిలినా పై పళ్ళు క్రింది పళ్ళు రాపిడివల్ల పళ్ళు అరిగిపోతాయి. అంటే పంటిపై భాగమైన ఎనామిల్ (పింగాణి) పొర నున్నగా ఉండి జారుతున్నట్లు (స్మూత్)గా ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉన్న రసాయనాలు సిట్రిక్ ఆమ్లాల తాకిడికి ఎనామిల్ (పంటిపై భాగం) మెత్తబడి, చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడి ఎనామిల్ పొర హరించుకు పోయినట్లు ఏర్పడుతుంది.

ఉదాహరణకు మనం బట్టలు ఉతకడానికి కాస్టిక్ సోడాని ఉపయోగిస్తాం. బట్టలకు ఎక్కువ సోడా వేసి, ఎక్కువ సమయం ఉంచినట్లైతే ఆ బట్టలకు చిన్న చిన్న రంథ్రాలు ఏర్పడతాయి. బట్టలు చాలా పలుచగా ఏర్పడి తొందరగా చిరిగిపోతాయి. అదే విధంగా ఎక్కువ పర్యాయాలు కూల్‌డ్రింక్స్ ఎవరైతే తాగుతారో వారి పళ్ళు పై భాగం ఎనామిల్ హరించుకుపోయి, పంటి యొక్క రెండవ భాగమైన ‘డెంటిన్’ బయటపడుతుంది. ఈ డెంటిన్ భాగంలో జీవకణాలుంటాయి. కనుక ఈ భాగం నరాలతో సంబంధం ఉండడంవల్ల నరాలు స్పందించి, అనుసంధానించబడి నొప్పి రావడం, పళ్ళు జివ్వున లాగటం జరుగుతుంది. అందువల్ల మనం చల్లని పదార్థాలు కాని, తీపి పదార్థాలు కాని, పులుపు పదార్థాలు, శీతల పానీయాలు తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వున లాగటం జరుగుతుంది. కొంత కాలానికి పళ్ళు పాడైపోయి, మామూలుగా మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి, ఏమి తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు గాలి తగిలినా పళ్ళు జివ్వున గుంజడం జరుగుతుంది. కొంతమంది పెద్దపెద్ద కూల్‌డ్రింక్ బాటిల్స్ తీసుకొని రోజుకు పదిసార్లు తాగుతూ ఆదాచేసినట్లుగా తృప్తి చెందుతుంటారు. కాని ఆ విధంగా చేయడంవల్ల కూల్‌డ్రింక్స్‌లోని ఆమ్లాలు (సిట్రిక్ ఆమ్లాలు) ప్రభావం రోజంతా నోట్లో పళ్ళు మీదనే ఉండి పళ్ళపై ఉన్న ఎనామిల్ త్వరగా అంతరించిపోతుంది. దీనివల్ల పళ్ళ యొక్క రంగు మారిపోయి పసుపురంగుగా తయారవుతాయి.

పళ్ళు చూడటానికి అసహ్యంగా ఉంటాయి. అట్లాగే నోట్లో కూల్‌డ్రింక్‌లోని తీపి పదార్థం ఎక్కువ సమయంవల్ల ఉండటం బాక్టీరియా (రోగ పూరిత సూక్ష్మజీవులు)కు అనుకూల పరిస్థితులు ఏర్పడి బాక్టీరియా చర్యవలన పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ళ వ్యాధులు కూడా సంక్రమించే అవకాశముంటుంది.

కూల్‌డ్రింక్స్ ఎట్లా తాగాలి?

కూల్‌డ్రింక్స్ తాగేటప్పుడు ‘స్ట్రా’ను ఉపయోగించి తాగినట్లైతే కొంతవరకు పళ్ళకు కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. స్ట్రాను ఉపయోగించేముందు స్ట్రాను గాలిలోకి ఊదాలి. ఆ తరువాత ఉపయోగించాలి. ఈ విధంగా చేయటంవల్ల కొంతవరకు స్ట్రాలో ఉన్న దుమ్ముధూళి శుభ్రపడుతుంది. స్ట్రాను ఉపయోగించి కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కూల్‌డ్రింక్ పళ్ళకు తగలకుండా సరాసరి అంగిటకు తగిలి గొంతులోకి పోయే అవకాశం వుంది. ఈ విధంగా తాగటంవల్ల కూల్‌డ్రింక్స్ ప్రభావం ఎక్కువగా పళ్ళపై ఉండవచ్చు. కనుక పళ్ళు, చిగుళ్ళకు హాని కలుగదు. ‘‘స్ట్రా’’తో కాకుండా బాటిల్‌తో తాగటంవల్ల కూల్‌డ్రింక్స్ నోట్లో నిండుగా ఉండి ఎక్కువ సమయం నోట్లో నిలువ ఉండటంవల్ల పళ్ళన్నీ కూడా కూల్‌డ్రింక్‌తో మునిగి ఉండటంవల్ల కూల్‌డ్రింక్‌లో ఉన్న సిట్రిక్ ఏసిడ్ యొక్క ఆమ్ల ప్రభావం ఎక్కువై పళ్ళ పై భాగం మెత్తబడిపోయి, అరిగిపోతాయి. తద్వారా పళ్ళు వ్యాధిగ్రస్థమవుతాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

కూల్‌డ్రింక్ తాగుతున్నప్పుడు కొంత ఆనందాన్ని రుచి హాయి పొందాలనుకుంటూ ఎక్కువ సమయం తాగుతారు. అట్లా కాకుండా కూల్‌డ్రింక్ తాగిన వెంటనే నోటిలో నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇట్లా చేయడంవల్ల కూల్‌డ్రింక్‌లోని సిట్రిక్ ఆమ్లం ప్రభావం తగ్గిపోతుంది. పళ్ళు జివ్వున లాగితే పొటాషియం నైట్రేట్ టూట్‌పేస్టును ఉపయోగించి బ్రెష్ చేయాలి. అదే పేస్టుతో చూపుతు వేలుతో చిగుళ్ళు పళ్ళు బాగా రుద్దాలి.

– డా ఓ.నాగేశ్వరరావు

డా. రావూస్ డెంటల్ హాస్పిటల్

Phone: 98490 14562

Email: [email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక,26/02/2014)

1 Comment

  1. javed says:

    article chala bagudi sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.