క్షయ నిర్ధారణకు కొత్త పరీక్ష

ఒంటి బరువు… వదిలించుకోండిలా
October 5, 2010
విషజ్వరాలను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా ?
October 5, 2010

క్షయ నిర్ధారణకు కొత్త పరీక్ష

క్షయవ్యాధిని వేగంగా, తేలికగా గుర్తించటానికి ఇప్పుడొక కొత్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ అనే ఇది మందులకు లొంగని క్షయ రకాన్ని కూడా పసిగడుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా క్షయను.. ముఖ్యంగా మందులకు లొంగని, హెచ్‌ఐవీ బాధితుల్లో వచ్చే రకాలను అరికట్టటంలో సఫలం కాలేకపోవటానికి నెమ్మదిగా, బండ పద్ధతుల్లో సాగుతున్న పరీక్షలూ దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం శిక్షణ పొందిన నిపుణులు సూక్ష్మదర్శిని ద్వారా చేసే ఈ పరీక్షలకు ఎంతో సమయం పడుతోంది. ఎప్పుడో 125 ఏళ్ల క్రితం కనుగొన్న పద్ధతుల్లో ఇప్పటికీ పెద్దగా మార్పులేవీ రాలేదు.

ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమయ్యే 10 ప్రధాన వ్యాధుల్లో క్షయ కూడా ఒకటి. ఇది సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, భారత్‌, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలకు ఎక్కువగా సోకుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లోనూ కనబడుతోంది. హెచ్‌ఐవీ బాధితుల్లో కూడా చాలామంది క్షయ బారినపడుతున్నారు. మందులకు లొంగని క్షయను గుర్తించటానికి నెలల సమయం పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. అందుకే దీనిని మరింత కచ్చితంగా, వేగంగా గుర్తించే కొత్త పరీక్షలు రావాల్సిన అవసరం ఉందని వైద్యులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు.

ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. మందులకు లొంగని క్షయ ఉండే అవకాశం గల మొత్తం 1,730 మంది నుంచి కళ్లె నమూనాలు సేకరించి పాత, కొత్త పద్ధతుల్లో పరీక్షించారు. వీటిల్లో ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ పరీక్ష 98 శాతం వరకు కచ్చితమైన ఫలితాన్ని అందించింది. క్షయ నివారణకు ఇచ్చే శక్తిమంతమైన మందు రిఫామైసిన్‌కు లొంగని జబ్బురకాన్ని కూడా ఇది గుర్తించింది. అదీ కేవలం 2 గంటల్లోనే. ఈ పరీక్ష త్వరగా పూర్తికావటమే కాకుండా ఎలాంటి మందులు వాడాలో అనేదానిపైనా ఒక అవగాహన కలిగిస్తుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.