కంప్యూటర్‌ తరచుగా ఉపయోగిస్తున్నారా ?
June 23, 2011
రేబిస్ గురించి కొన్ని విషయాలు…
July 2, 2011

కండరాలతో నిర్మితమయిన గర్భాశయం (యుటెరస్) 3-5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల మందం ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైన లిగమెంట్లు, కనెక్టివ్ టిష్యూతో… వెన్నుపూసకు, పెల్విక్ ఎముకలకు అతుక్కుని పొత్తి కడుపులో ఉంటుంది. గర్భాశయ గోడలో బయటినుండి లోపలికి సీరస్ పొర, మయొమెట్రియమ్ అనే కండరాల పొర, ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఉంటాయి. కండరాల పొరలో సాగే గుణాన్నిచ్చే ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది.

గర్భాశయంలో గడ్డలు

 

fibroids

fibroids

కొందరు స్త్రీలలో గర్భాశయానికి గడ్డలు వస్తాయి. కొన్ని తెలియని కారణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవడం, జన్యుపరమైన కారణాలు, గర్భాశయంలో కండరాల కణజాలం, కనెక్టివ్ ఫైబ్రస్ టిష్యూ పెరిగి, గడ్డలాగా తయారవుతాయి. వీటిని ఫైబ్రాయిడ్స్, మయోమ అని అంటారు. ఇవి చిన్నవిగా మొదలై, మెల్లమెల్లగా పెరుగుతాయి.

ఇవి 20-40 శాతం స్త్రీలలో ఉంటాయి. 20 నుంచి 45 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా వస్తుంటాయి. ఈ గడ్డలు క్యాన్సర్‌కు సంబంధించినవి కావు. మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ సైజు తగ్గిపోతుంది.

పెరిగే ప్రదేశాన్ని బట్టి ఫైబ్రాయిడ్లను మూడు రకాలుగా విభజిస్తారు. అలాగే అవి ఉండే ప్రదేశాన్ని బట్టి ఒక్కోరకం ఫైబ్రాయిడ్ ఒక్కోరకం అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

సబ్‌సీరస్ ఫైబ్రాయిడ్ (10 శాతం): ఇవి గర్భాశయం పైన పొరలో తయారవుతాయి. మెల్లగా గర్భాశయం బయటివైపుకి సైజు పెరుగుతూ ఉంటాయి.

ఇంట్రామ్యురల్ ఫైబ్రాయిడ్ (75 శాతం): ఇవి గర్భాశయంలోని మయోమెట్రియమ్ కండరాల పొరలో పెరుగుతాయి. మెల్లగా గర్భాశయం లోపలి వైపునకు పెరుగుతూ, ఎండోమెట్రియల్ క్యావిటీని నొక్కుతుంటాయి.

సబ్‌మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ (15 శాతం): ఇవి ఎండోమెట్రియమ్ పొరలో తయారవుతాయి. అతి చిన్నగా ఉన్నా కూడా, వీటివల్ల బ్లీడింగ్ ఎక్కువగా కావడం, పిల్లలు పుట్టకపోవడం వంటివి జరుగుతాయి.

కొంతమందిలో గర్భాశయ ముఖద్వారంలో గడ్డలు పెరుగుతుంటాయి. వీటిని సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.

లక్షణాలు: ఉండే ప్రదేశం, సైజు, సంఖ్యను బట్టి లక్షణాలు ఉంటాయి.

పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువ కావడం, ఎక్కువ రోజులు కావడం, తొందర తొందరగా పీరియడ్స్ రావడం, నెల మధ్యలో కొంచెం కొంచెం బ్లీడింగ్ అవ్వడం.
బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల రక్తహీనత, నీరసం, ఆయాసం వస్తాయి.

పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి

మిగతా సమయాల్లో కూడా కొందరికి పొత్తికడుపులో నొప్పి, పొత్తి కడుపు బరువుగా ఉండటం జరుగుతుంది.

గర్భాశయంలో గడ్డ బాగా పెద్దదిగా పెరిగేకొద్దీ పొత్తి కడుపులో ఎత్తుగా, గట్టిగా గడ్డలాగా తగులుతుంది.

ఫైబ్రాయిడ్ సైజు కిందికి పెరిగి, మూత్రాశయం పైన ఒత్తిడి కలిగించడం వల్ల, మూత్రం మాటిమాటికీ రావడం జరుగుతుంది. ఒక్కోసారి మూత్రం రావడమే ఆగిపోతుంది. మూత్రం మూత్రనాళాల్లోంచి కిడ్నీలోకి వెనక్కి వెళ్లడం వల్ల కిడ్నీల వాపు రావచ్చు.

ఫైబ్రాయిడ్ సైజు పెరిగి, మూత్రాశయం పైన ఒత్తిడి పడటం వల్ల మలబద్ధకం ఏర్పడవచ్చు.

కొందరికి కలయికలో నొప్పి ఉండవచ్చు.

కొందరికి వాసన, దురద లేని తెల్లబట్ట ఎక్కువగా ఉంటుంది.

ఉండే ప్రదేశం, సైజును బట్టి కొందరిలో (3 శాతం) అండవాహికలు మూసుకుపోవడం, రక్త సరఫరా సరిగ్గా లేక పిండం గర్భాశయంలో ఇంప్లాంట్ అవ్వలేకపోవడం వల్ల గర్భం రాకపోవచ్చు. వచ్చినా అబార్షన్లు అవ్వడం, మధ్యలో కడుపునొప్పి, నెలలు నిండకముందే కాన్పు జరగడం వంటివి కొందరికి సంభవించవచ్చు.

మరికొందరికి నెలలు నిండినా, కాన్పు సమయంలో నొప్పులు సరిగ్గా రాకపోవడమే కాక, బిడ్డ బయటకు రావడానికి అడ్డం పడవచ్చు. కాన్పు తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవ్వవచ్చు. అలాంటప్పుడు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది.

ఆపరేషన్ చేసేటప్పుడు కూడా బ్లీడింగ్ సమస్యలు ఎక్కువగా ఉండొచ్చు. 50 శాతం మందిలో ఎలాంటి సమస్యా ఉండదు. అలాంటి వారికి వేరే ఏదైనా సమస్య కారణంగా స్కాన్ చేసినప్పుడే ఇవి బయటపడతాయి.

ఫైబ్రాయిడ్‌లో మార్పులు:

కొన్నిసార్లు ఫైబ్రాయిడ్‌లో బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, కుళ్లడం (నెర్రోసిస్), రాయిలాగా గడ్డిపడటం (క్యాల్సిఫికేషన్), మెత్తబడటం (సిస్టిక్), మెలికపడటం, అరుదుగా గర్భాశయం నుండి విడిపోయి కడుపులో విడిగా పెరగడం వంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి.

డా॥వేనాటి శోభ
గైనకాలజిస్ట్

(సాక్షి దినపత్రిక, 26 జులై 2011)

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.