పొత్తి కడుపు నొప్పి
పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు
April 24, 2014
నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం
April 26, 2014

సర్వైకల్ కేన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. గణనీయంగా ముందుగానే నిరోధించగల వ్యాధి ఇది అని నిపుణులు చెబుతున్నారు.

నిరోధక టీకాలు

కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల మంది దీనితో పోరాటంలో చనువు చాలిస్తున్నట్టు సర్వైకల్ కేన్సర్ ప్రీ కొలియేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని పూర్తిగా నిరోధించలేనప్పటికీ చక్కటి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా దీనివల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

దేశంలో ఏటా 7 లక్షల మేరకు కేన్సర్ నూతన కేసులు బయటపడుతుండగా 3.5 లక్షలమంది కేన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ఈ 7 లక్షల నూతన కేసుల్లో 2.3 లక్షలకుపైగా కేసులు (33 శాతం) పొగాకు వినియోగానికి సంబంధించినవి.

Cervical Cancerగర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే సెర్విక్స్ (గర్భాశయ ముఖద్వారం) యొక్క కణజాలంలో చోటుచేసుకునే కేన్సర్‌ను సర్వైకల్ కేన్సర్ అని అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. క్రమం తప్పని పాప్ టెస్ట్‌ల (సెర్విక్స్ నుంచి కణ జాలాన్ని సేకరించి మైక్రోస్కోప్ కింద పరీక్షించడం) ద్వారా దీన్ని గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్ దీనికి ప్రధాన కారణం.

సర్వైకల్ కేన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలకు కారణం కాకపోవచ్చు కానీ జననాంగంనుంచి అసాధారణ బ్లీడింగ్ వంటి లక్షణాలు కన్పించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో కేన్సర్ బాగా ముదిరిపోయే వరకు కూడా ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. ఆ తరువాత మాత్రం పొత్తికడుపు నొప్పి, బ్లీడింగ్ లాంటివి చోటుచేసుకుంటాయి. కలయిక అనంతరం పరిశుభ్రం చేసుకునేటప్పుడు, పెల్విక్ ఎగ్జామ్‌లో సాధారణ రుతుచక్రంలో కనిపించే మాదిరిగా బ్లీడింగ్ కనిపిస్తుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు కొనసాగుతాయి. గతంలో కన్నా పరిస్థితి భారంగా వుంటుంది.

ఈ హెచ్‌పివి ట్రాన్స్‌మిషన్‌కు ప్రధాన కారణం లైంగిక సంపర్కం కారణంగా వ్యాప్తి చెందే వైరస్. సాధారణంగా మహిళలు ఈ హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే శక్తిని కలిగి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ కేన్సర్‌కు దారి తీస్తుంది. పొగ తాగే మహిళలకు, ఎక్కువమంది పిల్లలు వున్న స్ర్తిలకు, దీర్ఘకాలంపాటు కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించే వారు లేదా హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి సర్వైకల్ కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా వుంటాయి.

ఈ వ్యాధి కొంతమంది మహిళలకు మాత్రమే ఎందుకు వస్తుంది, ఇతరులకెందుకు రాదు అన్న విషయాన్ని వైద్యులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిర్దిష్ట ముప్పు అవకాశాలు గల మహిళలు మిగతావారికన్నా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు వున్నాయని మాత్రమే మనం చెప్పగలం. ముప్పు అవకాశం అనేది ఒక వ్యాధి వచ్చే అవకాశాన్ని అధికం చేసేది. హెచ్‌పీవీ అనే వైరస్‌తో వచ్చే ఇన్‌ఫెక్షన్ దాదాపుగా అన్నిరకాల సర్వైకల్ కేన్సర్‌లకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో వెల్లడైంది. పలువురు వయోజనులు తమ జీవితంలో ఏదో ఒక దశలో హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతునే వున్నా చాలా ఇన్‌ఫెక్షన్లను తమకు తాముగానే వారు నిరోధించుకోగలుగుతారు. ఈ విధంగా తొలగిపోని హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్ కొంతమంది మహిళల్లో సెర్వికల్ కేన్సర్‌కు కారణమవుతుంది.

సర్వైకల్ కేన్సర్‌ను నిర్ధారించేందుకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

ల్యాబ్ టెస్టులు: సెర్విక్స్‌నుంచి డాక్టర్ లేదా నర్స్ నమూనా కణజాలాన్ని సేకరిస్తారు. పాప్‌టెస్ట్ కోసం, ఈ నమూనాలో సర్వైకల్ కేన్సర్ కణాలు లేదా అసాధారణ కణాల ఉనికి కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ కణాలు తరువాతి కాలంలో కేన్సర్‌గా మారుతాయి.

సర్వైకల్ ఎగ్జామ్: సెర్విక్స్‌ను చూసేందుకు డాక్టర్ కొలోస్కోప్ వినియోగిస్తారు. ఈ కొలోస్కోప్‌లో ప్రకాశవంతమైన కాంతిని అందించే లైట్‌తో కూడిన మాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటాయి. దీంతో కణజాలాన్ని సులభంగా చూడవచ్చు.

టిష్యూ శాంపిల్: కేన్సర్ కణాల కోసం టిష్యూలను తొలగించి చూడడాన్ని బయోప్సీ అంటారు. దీనికి తొలిదశలో చికిత్స సాధారణంగా సర్జరీ (లోకల్ ఎగ్జిషన్‌తో సహా) మరియు వ్యాధి ముదిరిన దశలో కేమోథెరపీ మ రియు రేడియో థెరపీ అయి వుంటుంది. ఇది సర్జరీ, రేడియేషన్ థెరపీ, కేమో థెరపీ లేదా వాటి సమ్మేళనంగా ఉంటుంది. చికిత్స ఎంపిక అవకాశం ట్యూమర్ పరిమాణంపై, కేన్సర్ విస్తరణ మరియు గర్భం దాల్చాలనుకోవడం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

దీర్ఘకాలికంగా గర్భ నిరోధక మాత్రలు వాడుతున్న వారిలో సర్వైకల్ కేన్సర్ ముప్పు అవకాశం అధికంగా ఉంటుంది. ఈ మాత్రలు వాడుతున్న కాలంలో ముప్పు అవకాశం అధికంగా వున్నప్పటికీ, అవి వాడడం మానేసిన తరువాత ఈ ముప్పు అవకాశం తగ్గుతూ వస్తుందని అధ్యయనాల్లో తేలింది.
పూర్తిగా నిరోధించ దగిన ఈ వ్యాధి దిగువ, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు చెందిన దేశాల మహిళలకు సంబంధించి రెండో అతి పెద్ద కేన్సర్ కిల్లర్‌గా మారింది. జీవితంలో కీలక దశలో వీరు మరణిస్తున్నారు.

-డా.ఎం.బాబయ్య

అమెరికన్ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్

(ఆంధ్రభూమి దినపత్రిక, 29/01/2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.