గుండెనొప్పి – ఇసిజి

గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే కనీసం ఇ.సి.జి. అయినా తీయించడం మంచి పద్ధతి.

విద్యుత్‌ తరంగాల ద్వారా గుండె దెబ్బ తిన్నదా? లేదా? అన్న ప్రాథమిక సమాచారం అందించే ఇ.సి.జి. కొన్ని వేల ప్రాణాల రక్షణతో సమర్ధవంతంగా తనదైన పాత్ర నిర్వహిస్తోంది మరి! అయితే – ఎన్నో వేల ప్రాణాలను కాపాడు తున్న ఇ.సి.జి. గుండె జబ్బులకు సంబం ధించి కలిగే మరికొన్ని సందేహాలకు సరైన సమాధానం చెప్పలేదు. గుండె ఎంత భాగం దెబ్బతిన్నది? గుండె రక్తనాళాలలో కొవ్వు ఎంతశాతం చేరింది? మళ్ళీ గుండెపోటు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? వంటి ప్రశ్నలకు ఇ.సి.జి. సమా ధానం ఇవ్వలేదు. అందుకే ఇ.సి.జి.లో పైకి గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు ప్రతిబింబిం చినా లోపల జబ్బేమీ ఉండకపోవచ్చు. ఇ.సి.జి. ఫలితాలు మాత్రమే కొలమానంగా భావించే అనేక మంది అనవ సరంగా సంవత్సరాల తరబడి మందులు ఉపయోగించడం కూడా కద్దు! ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు -గుండెవ్యాధుల నిర్ధారణలో మరిన్ని పరీక్షలు అంటే గుండె స్కానింగ్‌, ట్రేడ్‌మిల్‌, స్ట్రెస్‌ థాలియమ్‌ వంటి పరీక్షలు అవసరమౌతున్నాయి. ఈ పరీక్షలన్నీ ఒక ఎత్తు అయితే – గుండె పనితీరు గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గుండె జబ్బుల ప్రమాదస్థాయిని, రాబోయే గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే తెలియజేసి హెచ్చరించే అత్యాధునిక వ్యాధి నిర్ధారణా పరికరం యాంజియోగ్రాం ఇటీవలకాలంలో సామాన్య మానవునికి లభించిన అత్యద్భుతం!

గుండె గదులలోని రక్తపీడనం ఖచ్చితంగా తెలుసుకోవడంతోబాటు 0.56 శాతం రక్తనాళంతో రక్తప్రసరణకు విఘాతం ఏర్పడుతున్న ప్రమాదాన్ని కూడా ఈ పరికరం ద్వారా ఖచ్చితంగా తెలుసు కోవచ్చు. గుండెజబ్బు ప్రమాదాన్ని నిర్ధిష్టంగా తెలుసుకోవడంతో బాటు అత్యాధునిక వైద్య చికిత్సలైన ఆధునిక ఇంజక్షన్స్‌, బెలూన్‌ యాంజియోప్లాస్టీ, స్టెంట్స్‌, బైపాస్‌ సర్జరీ వంటి చికిత్సలు ఏ రోగికి ఎంతవరకూ అవసరం అన్నది కూడా ఈ పరికరం ద్వారా నిర్ధారించవచ్చు! గుండె జబ్బుల వైద్య విధానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ అనేక మంది గుండెపోటు ప్రమాదంతో మరణి స్తూండటం గుండెజబ్బుల పట్ల ప్రజలలో ఉన్న అవగాహనాలేమికి నిదర్శనం!

రాబోయే గుండెజబ్బు ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోగల అత్యాధునిక వైద్య పరీక్షా విధానాలు ప్రస్తుతం మనకు అందుబాటులోనే వున్నాయి. 40 సంవత్స రాలు దాటిన వ్యక్తి కనీసం ఏడాదికోసారి జనరల్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. గుండె పనితీరును మెరుగు పరచుకోవచ్చు!

మల్లాది కామేశ్వరరావు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*