మొబైల్‌ఫోన్స్‌లో బ్యాక్టీరియా
December 14, 2010
అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు
December 14, 2010

చిన్నపిల్లలకు అదనపు ఆహారం

చిన్న పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు అన్ని ఆహార అవసరాలు తీరుస్తుంది.చిన్నారులు బాగా పెరుగుతూ,రోజుకు ఐదారుసార్లు మూత్రవిసర్జన చేస్తుంటే వారికి తల్లిపాలు సరిపోతున్నట్లు. అన్ని ఆహార అవసరాలు తీరుస్తున్నట్లు.

చిన్న పిల్లలకు అదనపు ఆహారం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఏ ఆహారంతో మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి అనే అంశాల గురించి చాలామంది తల్లులకు సరైన అవగాహన లేదు.

నాలుగు నెలలు పూర్తి కాకముందు అదనపు ఆహారం మొదలు పెట్టరాదు.ఆరు నెలలు పూర్తి అయిన తర్వాత అదనపు ఆహారం మొదలు పెడితే చిన్నారులు ఆహార లోపానికి గురవుతారు. అంతేగాక ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం మొదలు పెడితే చిన్నారులు ఇష్టపడరు. వారు తల్లిపాలే కావాలంటారు.

మన దేశంలో తరతరాలుగా చాలా ప్రాంతాలలో అదనపు ఆహారం ఇచ్చుటకు ‘అన్నప్రసాన’ అనే కార్యక్రమంతో జరుపుతారు. సాధారణంగా అన్నప్రసాన ఆరవ నెలలో చేస్తారు. ఇది మంచి పద్ధతి. శాస్ర్తియం కూడా!

మన సమాజంలో పట్టణాలలోని తల్లులలో ఎక్కువమంది నాలుగు నెలలోపల చిన్నారులకు ఘనాహారం ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇందువల్ల ఆ పిల్లలకు తల్లిపాలతో సమకూరే ప్రయోజనాలు లభించవు. మన సమాజంలో గ్రామాలలోని తల్లులు ఆరు నెలలు దాటిన తర్వాత అదనపు ఆహారం మొదలు పెడుతున్నారు. ఇందువల్ల చిన్నారులు ఆహార లోపానికి గురవుతారు.

చిన్నపిల్లలకు మొదట పెట్టే ఆహారం సులభంగా ఇంటిలో తయారు చేయగలిగాలి. ఇంటిలో సాధారణంగా అందరూ తినే ఆహారమే మంచిది. ప్రత్యేకంగా తయారు చేయాల్సిన పని లేదు. అయితే చిన్నారులకు పెట్టే ఆహారం బాగా ఉడికించి, మెత్తగా చేయాలి. కారం, పులుపు, మసాలాలు ఉండరాదు.మార్కెట్‌లో డబ్బాలలో లభించే ముందే తయారు చేసిన ఆహారంవల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఏమీ లేవు. ‘‘అరటిపండు పెడితే దగ్గు, నూనె పదార్థాలు, తీపి పదార్థాలు దగ్గు కలిగిస్తాయి. మామిడి పండు వేడి చేస్తుంది. నిమ్మరసం తాగిస్తే జలుబు’’ అనేది శుద్ధ అబద్ధం. అశాస్ర్తియ ఆలోచనలు.

చాలామంది తల్లులు డాక్టర్లతో చిన్నారుల వ్యాధుల గురించి మాట్లాడతారే కానీ, వారిని ఆరోగ్యంగా ఎలా పెంచాలి? ఎలాంటి ఆహారం పెట్టాలి అనే అంశాలు మాట్లాడరు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇలాంటి విషయాలపై డాక్టర్లు తల్లులతో ఓపికతో మాట్లాడాలి.

మన వాతావరణంలో ఆహార పదార్థాలు తొందరగా పాడయిపోతాయి. చిన్నారుల ఆహార పదార్థాలు ఎప్పటికీ తాజాగా పెట్టాలి. ఆహారం పెట్టే పాత్రలు శుభ్రంగా ఉంచాలి. వారికి ఆహారం పెట్టే ముందు చేతులు శుభ్రంగా కడుగుకోవాలి.చిన్నారులకు కడుపు చిన్నగా ఉంటుంది. అందువల్ల వారు ఎక్కువ ఆహారం తినలేరు. కనుక రోజుకు ఐదారుసార్లు ఆహారం పెడితే మంచిది.

చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు కొద్దిగా ఇవ్వడం ప్రారంభించాలి. క్రమేపి పెంచుతూ పోవాలి. ఒక ఆహారాన్ని అలవాటు చేసి, కొన్ని రోజులు అదే ఆహారం ఇవ్వాలి. మరలా కొత్త ఆహారం మొదలు పెట్టాలి. ఏ ఆహారమైనా ఇష్టపడకపోతే, ఆ ఆహారాన్ని ఇచ్చుట తాత్కాలికంగా వాయిదా వేయాలి. మళ్లీ మొదలు పెట్టాలి.తల్లిపాలు మాత్రమే తాగుతున్నంతకాలం చిన్నారులకు నీరు పట్టే అవసరం లేదు. అదనపు ఆహారంతో పాటే చిన్నారులకు నీరు తాగించడం మొదలు పెట్టాలి. అయితే చిన్నపిల్లలకు ఎప్పటికీ బాగా కాచి చల్లార్చిన నీరు తాగించడం మంచిది.

అదనపు ఆహారం తినిపించడం మొదలు పెట్టినప్పుడు అదనపు ఆహారంగా అన్నం, ఉడికించిన బంగాళ దుంప, నెయ్యితో మెత్తగా ఆహారం మొదలు పెడితే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ వయస్సులో అరటిపండు బాగా ఇష్టపడతారు. గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిబేడలు, నెయ్యి లేదా నూనెతో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా కూడా మొదలు పెట్టండి.

ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం పప్పుతో ప్రయత్నం చేయండి. ఈ వయస్సులో బాగా ఉడికించిన మెత్తని కూరగాయలు ఇవ్వవచ్చు. మెత్తని చపాతి తినిపించవచ్చు. నెయ్యి, నూనెలు ఆహారానికి కలిపితే మంచిది. తల్లిపాలు పడుతూ ఉండండి. తొమ్మిది నుండి పనె్నండు నెలల చిన్నారులకు ఇడ్లి, ఉప్మా, పొంగలి, మజ్జిగ, అన్నం, పాయసం, బ్రెడ్ మొదలు పెట్టండి. తల్లిపాలు ఇస్తూ ఉంటుంది.

ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం ఆ తర్వాత చిన్నారులకు ఇంటిలో అందరూ తినే ఆహార పదార్థాలు అలవాటు చేయండి. కొద్ది నెలలపాటు పండ్లపై చర్మం, పండ్లలో గింజలు ఇవ్వరాదు. తల్లిపాలు పడుతూ ఉండండి. రోజుకు ఐదారు సార్లు ఆహారం పెట్టండి. ఈ వయస్సు పిల్లలు అమ్మతినే ఆహారంలో కనీసం సగం తింటారు.

చిన్నారులకు వీలైనంత వరకు ఆహారం ప్రత్యేక గినె్నలో కానీ, కంచంలో కానీ పెట్టాలి. ఇందువల్ల చిన్నారులు ఎంత ఆహారం తింటారో తెలుస్తుంది. అంతేగాక చిన్నారులు తామె ఆహారం తినటం నేర్చుకుంటారు. మనలాగే చిన్నారులకు కూడా ఆహార పదార్థాలపై ఇష్టం, అయిష్టం ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో బలవంతంగా చిన్నారులకు ఆహారం పెట్టకండి.

చిన్నారులు వారెంత ఆహారం తినాలో వారి ఇష్టం. మీరు నిర్ణయించకండి. ఆహారం పెట్టే ప్రయత్నం చేయడమే మీ బాధ్యత. పెట్టే ఆహార పదార్థాలలో వెరైటీ ఉంటే మంచిది. రకరాల ఆహార పదార్థాలు అలవాటు చేస్తే ఆహార అవసరాలు బాగా తీర్చవచ్చు.మరో ముఖ్య విషయం. అదనపు ఆహారం పాలుపట్టుటకు ముందా, తర్వాతనా అనేది కూడా చాలామంది తల్లుల కొచ్చే సంశయం.

ఆకలితో ఉన్న పసిపిల్లలు టకాటకా తల్లిపాలు ఉషారుగా తాగుతారు. అయితే కొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత ఆహారం సరిగా తినరు. ఇలాంటి చిన్నారులకు పాలు పట్టక ముందే ఆహారం తినిపించండి. కొందరు పిల్లలు పాలు తాగి కూడా బాగా ఆహారం తింటారు. వీరికి ముందే పాలు పట్టి తర్వాత ఆహారం పెట్టండి.

చిన్నారులకు గోరుముద్దలు పెట్టడంలో ఇవి సాధారణ సలహాలు మాత్రమే. అన్నిటికన్నా మీకున్న ప్రత్యేక పరిస్థితులు అవసరాలను బట్టి తగిన మార్పులు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రతి చిన్నారి వేరు. ప్రతి అమ్మవేరు. ప్రతి గృహం వేరు. చందమామను చూపెట్టి పెడతారో, కథలు చెప్పి పెడతారో మీ ఇష్టం. టివి చూపెట్టి మాత్రం ఆహారం పెట్టే అలవాటు చేయకండి. బూచాడ్ని. దొంగాడ్ని మాత్రం పిలవకండి. చిన్నారికి అన్నం పెట్టడం అనేది ఒక యజ్ఞం మాత్రం చేయకండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.