చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు

ఆరోగ్య రక్షణలో అయోడిన్‌
October 18, 2010
కడుపులో గ్యాస్‌ ఉంటుందా ?
October 18, 2010

చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు

వర్షాకాలం తగ్గి క్రమేణా శీతాకాలం వస్తోంది. ఈ వాతావరణంలో ఆస్తమా ప్రకోపించడం పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా గురించి తల్లిదండ్రుల్లో అనేక అపోహలున్నాయి. వీటిని నివృత్తి చేసే ప్రశ్నలు-జవాబులు…

ఆస్తమా అంటే ఆయాసమేనా ?

అవును ఆయాసమే. కానీ దగ్గు రూపంలో కూడా ఆస్తమా ఉండొచ్చు. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే దగ్గు, అదేవిధంగా ఎదలో బిగపట్టినట్టు ఉండడం, వ్యాయామం తర్వాత దగ్గు రావడం కూడా ఆస్తమాకు తొలి లక్షణాలుగా భావించొచ్చు.

చిన్న వయసులోనే ప్రారంభమవుతుందా ?

ఆస్తమా ఎప్పుడైనా రావొచ్చు. ఇది శ్వాసకోశాల వాపు వల్ల వస్తుంది కాబట్టి చిన్న వయసులోనైనా రావొచ్చు, మధ్యలోనైనా రావొచ్చు.

అంటువ్యాధా ?

కాదు. పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం వల్ల కానీ, కలిసి చదువుకోవడం వల్లకానీ, కలిసి తినడం వల్లకానీ, ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు.

వంశపారంపర్యమా ?

కాదు. కానీ ఆస్తమాలేని తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకంటే ఆస్తమా ఉన్న తల్లి దండ్రులకు పుట్టిన బిడ్డల్లో ఇది రెండు మూడింతలు ఎక్కువగా ఉండడం చూస్తాం.

ఆస్తమా, క్షయ ఒకటేనా ?

కాదు. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఆస్తమాకు కారణం శరీరంలో ఉండే అలర్జీ లాంటి గుణం.

ఎక్స్‌రేలో ఎటువంటి దోషం లేకపోతే ఆస్తమా లేదనుకోవచ్చా ?

అన్ని సందర్భాలలో ఆస్తమ ఉందని ఎక్స్‌రేలో నిర్ధారించలేం.

ఇస్నోఫీలియా, అలర్జీక్‌ బ్రాంకైటీస్‌ అన్నా, ఆస్తమా అన్నా ఒకటేనా ?

ఈ పదాలను సాధారణంగా ఒకే అర్థంలో వాడుతున్నారు. కొన్ని తేడాలతో ఇవన్నీ ఒకటే అనుకోవచ్చు.

ఆస్తమాలో ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు ?

ఫలానాది తినకూడదని నిర్ధారణగా చెప్పలేం. కానీ ఏదైనా ఒక పదార్థం తిన్న తర్వాత పదే పదే ఆయాసం వస్తుంటే దాన్ని మానెయ్యాలి.

మా అబ్బాయి స్కూలులో చేరిన తర్వాత ఆయాసం వస్తోంది. ఏం చేయాలి ?

ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే స్కూళ్లల్లో రద్దీ ఉంటుంది కాబట్టి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి ఇంకొకరికి సులభంగా సోకుతాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఆస్తమా బయటపడుతుంది. ఎక్కువైతుంది.

ఇన్‌హేలర్‌ లాంటి అత్యంత శక్తివంతమైన మందులు మొదట్లోనే వాడడం సబబా?

ఇన్‌హేలర్లు ఆస్తమాలో మొదటి నుంచి వాడడం అవసరం. అవి మనం అనుకున్న విధంగా ప్రమాదకరమైనవి కావు. అలవాటు కూడా కావు. పైగా మాత్రల కంటే కూడా చాలా చాలా తక్కువ మోతాదు మందు మాత్రమే అందులో ఉంటుంది. నోటి ద్వారా తీసుకునే మాత్రలు, ఇంజక్షన్లు శరీరమంతటా ప్రభావం చూపితే, ఇన్‌హేలర్లు ఊపిరితిత్తుల్లో మాత్రమే వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఆ రిత్యా ఇన్‌హేలర్లు మంచివి. అవసరమైనవి కూడా.

మా పిల్లవాడికి ఆస్తమ కోసం స్టెరాయిడ్స్‌ వాడాలంటే భయం అవుతుంది. ఏం చేయాలి ?

స్టెరాయిడ్స్‌లో అనేక రకాలుంటాయి. ఇన్‌హే లర్‌ ద్వారా

ఆస్త మా కోసం వాడే స్టెరా యిడ్స్‌ సరైన వైద్య పర్య వేక్ష ణ లో తీసుకు న్నప్పుడు ఎటువంటి భయం అవసరం లేదు. ఇతర మందుల్లాగే అది కూ డా సురక్షితమే.

ఆస్తమాలో యాంటి బయా టిక్స్‌ ఉపయోగమా?

ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు యాంటి బయాటిక్స్‌ అవసరం అవుతాయి. లేనప్పుడు అవసరం లేదు.

ఇన్‌ హేలర్లలో ఖరీదైనవి, చౌకమం దులు లేవా?

ఇన్‌హేలర్లు ఖరీదైనవిగా కనిపించినా దీర్ఘకాలిక దృష్టితో చూడాలి. ఇన్‌హేలర్ల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యవసర పరిస్థితులు కూడా తగ్గుతాయి. ఇతరత్రా ఖర్చులు కూడా పరిగణలోకి తీసుకుంటే ఇన్‌హేలర్ల వల్ల లాభమే కానీ నష్టం లేదు.

ఒకే ఇన్‌హేలర్‌ను ఇద్దరు వాడొచ్చా?

వాడకపోవడం మంచిది.

ఇన్‌హేలర్లు జీవితాంతం తీసుకోవల్సిందేనా ?

అది జబ్బు తీవ్రతను బట్టి, మందుల వల్ల వచ్చే ఫలితంపైఆధారపడి ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఆస్తమా ఉన్నవారంతా జీవితాంతం ఇన్‌హేలర్లు వాడి తీరాల్సి ఉంటుందన్నదేమీ లేదు.

ఆయాసం లేనప్పుడు కూడా మందులు వాడాలా?

ఆస్తమ దీర్ఘకాలిక సమస్య. అప్పుడప్పుడు ఆయాసం వస్తూ, తగ్గుతూ ఉండొచ్చు. కాలం గడిచేకొద్దీ శ్వాసనాళాల్లో శాశ్వతమైన మార్పులు వస్తాయి. ఈ మార్పులను నిరోధించాలంటే తగిన మందులను నిరంతరం వాడాల్సి ఉంటుంది.

కిటోటిఫెన్‌ అనే మందు ఆస్తమాకు అవసరమా?

ఈ మందు ఆస్తమాను నియంత్రిస్తుందని కానీ, ఉపశమనం కలిగిస్తుందని కానీ నిర్ధారణ కాలేదు.

పిల్లలు ఆడుకున్న తర్వాత ఆస్తమా వస్తున్నది. వాళ్లను ఆడుకోవడానికి అనుమతించడం సరైనదేనా?

బహుశ ఈ కారణం వల్ల పిల్లలను ఆడుకోనివ్వకపోవడం, సముచితం కాదేమో. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆడుకోనివ్వొచ్చు. చల్లటి గాలిలో తిరగకపోవడం, తేలికైన ఆటలు ఆడడం, ఆటల సందర్భంగా నిదానంగా, గాఢంగా గాలి తీసుకుని వదలడం అలవాటు చేసుకోవడంలాంటి జాగ్రత్తల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆటలకు ముందు ఇన్‌హేలర్‌ను వాడడం వల్ల కూడా నిరోధించొచ్చు.

పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా?

ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తగ్గే అవకాశ ముంది. అయితే చిన్నతనంలో వచ్చే ఆస్తమా అటాక్‌లను నివారించడానికి, నయం చేయడానికి తగిన వైద్యం జరగకుంటే పెద్ద అయిన తర్వాత తగ్గకపోవచ్చు. కాబట్టి చిన్న వయసులో వచ్చే ఆస్తమాకు శ్రద్ధగా వైద్యం చేయించుకోవాలి.

ఆస్తమా నయం కాదా?

ఆస్తమా ఒక ఇన్‌ఫ్లమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్‌ అనేది శరీరంలో ఒక సహజమైన రక్షణ గుణం. ఇది ఎక్కువకావడం, తక్కువ కావడం ఉంటుంది కానీ, అంటే బాగా నియంత్రించొచ్చు. సాధారణంగా చూసినప్పుడు ఈ నియంత్రణనే నయం కావడంగా కూడా అనుకోవచ్చు.

ఆస్తమా ఉన్న పిల్లలు సాధారణ జీవితం గడపగలరా? పెరుగుదల ఉంటుందా ?

ఆస్తమా నియంత్రణలో ఉన్న పిల్లవాడు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్లే లెక్క. పెరుగుదలలో కూడా తేడా ఉండదు.

ఆస్తమాలో ఏ దగ్గు మందు మంచిది?

ఆస్తమాలో దగ్గు మందుల అవసరం లేదు. బ్రాంకో డైలేటర్‌ మందులే దగ్గును కూడా తగ్గిస్తాయి.

ఆస్తమాకు వ్యాక్సిన్‌ ఉందా?

లేదు. కానీ ఫ్లూ వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది. చిన్న పిల్లల్లో ఫ్లూ ఎక్కువగా వస్తుంటుంది. ఆ విధంగా ఫ్లూ వ్యాక్సిన్‌ వాడితే మంచిది. కానీ ఆస్తమాకు వ్యాక్సిన్‌ లేదు.

(ఈ నెలలో మద్రాసులో జరిగిన సుందరం మెడికల్‌ ఫౌండేషన్‌ అకడమిక్‌ సెషన్‌లో శిశువైద్య నిపుణులు, పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ శివబాలన్‌ ప్రవేశపెట్టిన పత్రం ఆధారంగా)

(మూలం – ప్రజాశక్తి, 18 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.