చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష
November 16, 2010
అలర్జీ వ్యాధులకు చెక్‌ ఇలా…
November 16, 2010

జుట్టు రాలటమనేది ఎంతోమందిని తీవ్రంగా వేధించే సమస్యే. దీన్ని ఆపటం కోసం రకరకాల ప్రయత్నాలు చేయనివారుండరంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి జుట్టు ఎందుకు రాలుతుంది? ఏయే అంశాలు దీనికి దోహదం చేస్తాయి? వీటిపై అవగాహన పెంచుకుంటే జుట్టు రాలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, మానసిక సమస్యలు.. ఇవన్నీ జుట్టు రాలిపోవటానికి దారి తీసేవే. పైగా సహజంగా జుట్టు రాలిపోయే వయసు కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు గణనీయంగా తగ్గుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషుల్లో 20ల్లోనే మొదలైతే. స్త్రీలల్లో 30ల్లోనే ఆరంభమవుతోంది. మహిళల్లో పాపిడి మధ్యలో ఖాళీ పెద్దగా అవుతుండటం.. పురుషుల్లో నుదురు విశాలం కావటం, కణతల దగ్గర వెలితిగా కనిపిస్తుంటే జుట్టు రాలటం ఎక్కువగా ఉన్నట్టు భావించొచ్చు. రోజుకి 100 వెంట్రుకల రాలటం సాధారణమే కానీ.. అంతకు మించి కొన్ని నెలల పాటు రాలుతున్నట్టు అనుమానం వస్తే నిపుణులను సంప్రదించాల్సిందే. ముఖ్యంగా మహిళల్లో కన్నా పురుషుల్లో వెంట్రుకలు ఎక్కువ సంఖ్యలో రాలిపోతుంటాయి. కాబట్టి పురుషులు త్వరగా జాగ్రత్త పడటం మంచిది.

ఒత్తిడి

వెంట్రుకలకు సంబంధించిన వివిధ సమస్యలకు ఇప్పుడు ఒత్తిడే ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఒత్తిడి మూలంగా హర్మోన్ల మధ్య అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వెంట్రుకలు పెరగటం, రాలటం అనే క్రమం దెబ్బతింటుంది. అంటే వెంట్రుకలు పూర్తిగా పెరిగి, సహజంగా రాలిపోయే కాలం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టు ఎక్కువగా ఊడిపోవటం ప్రారంభిస్తుంది. అందుకే మలేరియా, టైఫాయిడ్‌ వంటి ఒత్తిడితో నిండిన జబ్బుల అనంతరం జుట్టు రాలిపోతుంది.

డైటింగ్‌
 
విపరీతంగా డైటింగ్‌ చేయటమూ వెంట్రుకలు రాలిపోవటానికి దోహదం చేస్తుంది. డైటింగ్‌ చేస్తున్నప్పుడు హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటారు. ఒత్తిడితో కూడిన, బాధాకర సంఘటనల మాదిరిగా ఇది కూడా శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుంది. దీంతో వెంట్రుకలు పెరగటం వంటి అత్యావశ్యకం కాని పనులు మందగిస్తాయి.

అంతర్గత సమస్యలు

పురుషుల్లో టెస్టోస్టిరాన్‌, కార్టిజోన్‌ అధిక మోతాదులో ఉండటం.. స్త్రీలల్లో పాలిసిస్టిక్‌ ఒవరీస్‌ వంటి అంతర్గత సమస్యలు కూడా జుట్టు రాలటానికి కారణమవుతాయి. వీటిని తగు పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు సమస్య నుంచి గట్టెక్కొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మహిళలు కొన్ని నెలల పాటు విటమిన్ల మాత్రలు తీసుకోవటం, పురుషులు శారీరకశ్రమ చేయటంపై దృష్టి పెట్టటం మేలు.

 జన్యు కారణాలు

 కొందరిలో జన్యు పరమైన కారణాలు కూడా వెంట్రుకలు రాలిపోవటానికి దోహదం చేస్తాయి. ఇలాంటివారిలో వెంట్రుకలు రాలటాన్ని కొద్దిగా ఆలస్యం చేయొచ్చు గానీ పూర్తిగా ఆపటం సాధ్యం కాదు. కాబట్టి వంశపారంపర్యంగా జట్టు రాలే సమస్య ఉంటే అలాంటి వారికి పెద్దగా చేయగలిగిందేమీ లేదని గుర్తించటం అవసరం. అవసరమైతే వెంట్రుకలు నాటే (హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) చికిత్స చేయించుకోవాలి.

 కాలాలు

చుండ్రు, పొడిబారటం, పొలుసులు రాలటం, చర్మ వ్యాధులు చలికాలంలో ఎక్కువ. చుండ్రు మూలంగా వెంట్రుకల కుదుళ్లకు తగినంత ఆక్సిజన్‌ అందక జట్టు రాలిపోతుంటుంది. ఇక మాడు జిడ్డుగా ఉండేవారికి ఎండకాలం, వానకాలంలో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటాయి. చర్మం కింద చమురు గ్రంథులు అధికంగా నూనె విడుదల చేయటం వల్ల వెంట్రుకల కుదుళ్లు పూడుకుపోయి జట్టు రాలటానికి దోహదం చేస్తుంది.

పొగ తాగటం

పొగ తాగేవారిలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల వెంట్రుకలు పెరగటం దెబ్బతింటుంది. 20 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగేవారికి జట్టు రాలే సమస్య అధికమని ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

నీళ్లు

 వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేందుకు స్నానానికి ఉపయోగించే నీళ్లు కూడా ప్రధానమే. ముఖ్యంగా కఠినంగా ఉండే బోరు నీటిలో కొన్ని హానికారక పదార్థాలూ ఉంటాయి. ఈ నీటితో స్నానం చేస్తే అవి మాడు మీద పేరుకుపోయి, వెంట్రుకల కుదుళ్లకు అడ్డుపడతాయి. శుద్ధిచేసిన నీటితో తలను కడుక్కోవటం ద్వారా ఈ హాని కారకాలను తొలగించుకోవచ్చు.

పాటించి చూడండి

 ఒత్తిడి నుంచి యోగా దూరంగా ఉంచుతుంది. ఇది వెంట్రుకల కుదుళ్లకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది. దీంతో వెంట్రుకలు దృఢంగా ఉంటాయి.

యోగా
 

 

టోపీ వద్దు

 తడి జుట్టుపై ఎప్పుడూ టోపీ గానీ హెల్మెట్‌ గానీ ధరించకండి. తడి వెంట్రుకలు తేలికగా చిట్లిపోయే అవకాశం ఉంది.

మర్దన

 ఉదయం, సాయంత్రం 5 నిమిషాల పాటు నెమ్మదిగా మాడుపై మర్దన చేయండి. దీంతో రక్త ప్రసరణ మెరగవుతుంది.

 షాంపూలు

 రోజూ షాంపూతో తలస్నానం చేస్తే సహజమైన నూనెలు మాయవుతాయి. వెంట్రుకలు ఎండిపోయి, చిట్లిపోతాయి. చుండ్రు సమస్య లేకపోతే వారానికి మూడుసార్లకు మించి తలస్నానం చేయకపోవటం మేలు. 

 దువ్వెన్లు

ప్లాస్టిక్‌ దువ్వెనలకు బదులు వెడల్పుగా ఉండే చెక్క దువ్వెనలను ఉపయోగించాలి. ప్లాస్టిక్‌లోని విద్యుత్‌ ప్రేరణలు వెంట్రుకలను ఉత్తేజితం చేసి, దాని మీది రక్షణ పొరను దెబ్బతీస్తాయి

కండిషనర్‌

ఎండకాలంలో తీవ్రమైన సూర్యరశ్మి ప్రభావానికి గురైతే వెంట్రుకలు దెబ్బతినొచ్చు. కాబట్టి వారానికి ఒకసారైనా కండిషనర్‌ వాడుకోవాలి.

1 Comment

  1. rameshraju says:

    చుండ్రు ఫంగస్ కాబట్టి, వేప ఆకులకు, వేప గింజలకు యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి కాబట్టి, కనీసం 30 నుండి 40 రోజులపాటూ వారానికి 1 లేక 2 సార్లు చొప్పున కర్పూరం కలిపిన వేప నూనెను తలపై మర్ధనా చోసుకొంటూ, రోజుకి 1 వేప క్యాప్సూల్ చొప్పున మ్రింగుతూ వుంటే తలలోని చుండ్రు నివారించబడుతుంది అని నా ఆలోచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.