జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?

కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని
March 29, 2014
పొత్తి కడుపు నొప్పి
పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు
April 24, 2014

జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?

సాధారణంగా మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజింపవచ్చు.

బాల్యం: ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పటినుండి 13 సంవత్సరాల లోపు పిల్లలను బాల్య దశగా పరిగణిస్తారు. ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశను ‘అగ్లిడక్లంగ్’ దశ అని అంటారు. ఎందుకంటే పాలపళ్లు కొన్ని ఊడిపోతుంటే కొన్ని వస్తుంటాయి. ఇట్లా పళ్లన్ని కూడ అస్తవ్యస్తంగా వికారంగా చూడడానికి అందవికారంగా వుంటాయి.

యుక్త వయసు: సాధారణంగా ఈ వయసుని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ దశ అంటే 13 సం. నుండి 18 సం.వరకు వుంటుంది. అంటే ఇటు బాల్యానికి అటు ప్రౌఢ దశకు మధ్య వయసులో వుంటారు. అంటే తెలిసీ తెలియని వయసుగా పరిగణిస్తారు. ఈ వయసు వారికి రెండు దవడలలో మొత్త 28 పళ్లు వచ్చేస్తాయి. పూర్తిస్థాయిలో నమల గలుగుతారు. బ్రెయిన్, మేధస్సు తెలివితేటలు మాత్రం పూర్తిగా పరిపక్వతకు రావు.

ప్రౌఢ దశ లేదా పరిపక్వ దశ: సాధారణంగా ప్రౌఢ దశ అంటే 18 సం.నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వున్నవారిని ప్రౌఢ దశ లేదా పెద్దవారు అంటారు. వారికి మెదడు పూర్తిగా పరిపక్వం చెంది, వారిలో తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుంది. విషయాలను పూర్తిగా అర్ధం చేసుకుని ఆలోచనా శక్తిని కలిగివుంటారు. ఈ వయసులో అంటే 18 నుండి 25 సం.మధ్యలో మూడవ పెద్ద దంతం అంటే దవడకు చివరి భాగంలో వస్తుంది. దీనినే జ్ఞానదంతము అంటారు. అంటే మనకు జ్ఞానం వచ్చే వయసు. బ్రెయిన్ పరిపక్వం చెందే సమయం, వయసులో వస్తుంది కనక దీనిని జ్ఞానదంతం అని పరిగణించడం జరిగింది.

వృద్ధాప్యం: 50 సంవత్సరాలు పైబడిన వారిని వయసు మళ్లిన వారుగా వృద్ధాప్యంగా పరిగణిస్తారు. ఈ వయసులో దంతాలు అరిగిపోవడం, వూడిపోవడం, చిగుళ్లు మెత్తబడిపోయి పంటికి పంటికి మధ్య ఖాళీలు పెరగడం, పళ్లు వంకరలు పోవడం, పళ్ల వయసు ముదిరిపోయి పళ్ల రంగు పసుపు రంగుగా మారడం జరుగుతుంది.

wisdom-toothజ్ఞానదంతం: దవడ భాగంలో 3వ పెద్ద దంతాన్ని జ్ఞాన దంతం అంటారు. ఈ జ్ఞాన దంతాలు పూర్తిగా వచ్చినట్టయితే మనిషికి 32 పళ్లుంటాయి. లేదంటే 28 పళ్లు మాత్రమే ఉంటాయి. కొంతమందికి వస్తాయి మరి కొంతమందికి రావు. అట్లాగా కొంతమందికి కింది దవడకు రెండు వైపులా రావచ్చు లేక ఒకవైపు రావచ్చు. అట్లాగే పై దవడకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో ఈ జ్ఞానదంతం కొంచెం పైకి కబడుతుంది. మిగిలిన భాగం చిగురుతో కప్పబడి ఉంటుంది. ఈ జ్ఞాన దంతాలు అన్ని పళ్లకంటే ఆలస్యంగా రావడం వలన దవడ ఎముకలో స్థలం లేక కొన్ని దంతాలు సగంపైవచ్చి అలాగే ఆగిపోతాయి. ఆదేవిధంగా వంకరగా కూడా వస్తాయి. మరికొన్నిపరిస్థితుల్లో అడ్డంగా (హారిజాంటల్)కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితి 3వ దంతం అసలు పైకి కనిపించదు. ఇటువంటి దంతాలను ‘ఇంపాక్టెడ్’ దంతాలు అంటారు. ఇవి సాధారణంగా మిగతా అన్ని పళ్లకంటే తక్కువ ఎత్తులో వుండడంవలన పై పళ్లకు కింది పళ్లకు తగలకుండా ఉంటాయి. అంటే మనం ఆహారం నమిలినపుడు ఈ పళ్లకింద పడి నలిగే అవకాశం లేదన్నమాట. కనుక ఈ జ్ఞాన దంతాలవల్ల మనకు ఏమాత్రం ఉపయోగాలు లేవు. పైగా వీటివలన నొప్పి రావడం మరియు ఇతర వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.

పెరికోర్నెటిస్ వ్యాధి: కొంతమందికి జ్ఞాన దంతం వంకరగా వస్తుంది. ఇట్లా వచ్చిన పంటిని ఇంపాక్టెడ్ దంతం అంటారు. ఇది వంకరగా రావడం వలన అంటే పన్ను సగభాగం బయటికి కనిపిస్తుంది. మిగతా సగభాగం చిగురులో కప్పబడి వుంటుంది. ఈ విధంగా కప్పబడి వుండడంతో మనం ఆహారం నమిలినపుడు ఆ ఆహారంతోపాటు చిగురు కూడా నలిగిపోవడం వలన ఆ చిగురుకు గాయం అవుతుంది. ఈ విధంగా గాయపడిన చిగురుకి బాక్టీరియా చర్య వలన ఇన్‌ఫెక్షన్ వచ్చి ఆ చిగురు వాపు, దవడ వాపు వస్తుంది. అట్లాగే ఈ పన్ను గొంతుకు దగ్గరలో వుండడం వలన గొంతు వాపుతో ఆహారం నమలలేకపోవడం, మింగలేకపోవడం, విపరీతమైన నొప్పి, నిద్ర పట్టకపోవడం, మాట్లాడలేకపోవడం, చిరాకుతో ఏమి చేయాలో తెలీక అవస్థలు పడడం జరుగుతుంది. ఆ పంటి భాగంలో వున్న చిగురు, బుగ్గ, చర్మం వాపు రావడం వలన నోరు మూసుకుపోవడం తెరవడం కూడా కష్టంగా వుంటుంది. దీనితోపాటు జ్వరం, తలనొప్పి, మెడనెప్పి, గొంతు నెప్పి రావడం జరుగుతుంది. అశ్రద్ధ చేసినట్టయితే దవడ భాగమంతా చీము ఏర్పడి ప్రమాదస్థాయికి కూడా చేరుతుంది. సుగర్ వ్యాధి ఉన్నట్టయితే చాలా జాగ్రత్త వహించాలి.

పెరికోర్నైటిస్ వ్యాధి-చికిత్స: జ్ఞానదంతం మూలంగా ఏర్పడిన ఈ పుండు (అల్సర్) తగ్గాలంటే తప్పనిసరిగా దంత వైద్యుని సంప్రదించాలి. ప్రత్యేకమైన మందులు, ఏంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మందులను వాడవలసి వుంటుంది. దీంతోపాటు ఆయింట్‌మెంట్‌ను కూడా పంటి దగ్గర అప్లయి చేయాల్సి వుంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ పుండు తగ్గుతుంది. కానీ మరలా వస్తుంది. చాలామంది అవే మందులను వాడడంవలన చాలాకాలంపాటు తగ్గుతుంది. మరలా వస్తుంది. అశ్రద్ధ చేయడం వలన ఆ పుండు అల్సర్ కేన్సర్‌గా మారే అవకాశం వుంది కనుక జ్ఞాన దంతం నొప్పి వచ్చిందంటే ఆ పంటిని తీయించుకుంటే మంచిది. ఈ పంటిని శస్త్ర చికిత్స చేసి తీయవలసి వుంటుంది. ఈ పంటిని ఎంత త్వరగా తీయించుకుంటే అంత మంచిది. దీనివలన మనకు ఉపయోగం లేదు సరికదా దీనివలన మనకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

జ్ఞాన దంతం తీయించుకోవడంవల్ల జ్ఞానం పోదు: చాలామంది జ్ఞాన దంతం తీయించుకుంటే జ్ఞానం పోతుంది అని అపోహ పడుతుంటారు. జ్ఞానానికి దంతానికీ ఏమీ సంబంధం లేదు. అలాగే చాలామంది పన్ను తీయించుకుంటే కన్ను పోతుంది, చూపు తగ్గుతుంది అని అపోహపడుతుంటారు. ఇవి కేవలం మూఢనమ్మకాలే తప్ప ఎటువంటి నిజం లేదు. ఇటువంటి అపోహలతో కాలయాపన చేసి అశ్రద్ధ చేయడం వలన వ్యాధి ముదిరిపోయి ప్రమాదస్థాయికి చేరుతుంది. కంటికి పంటికి ఏమాత్రం సంబంధం లేదు.

– డా ఓ.నాగేశ్వరరావు

డా. రావూస్ డెంటల్ హాస్పిటల్

Phone: 98490 14562

Email: [email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక,19/03/2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.