జ్వరాలతో నా అనుభవాలు

పైల్స్‌తో బాధపడుతున్నారా?
October 28, 2010
గట్టిపడ్డ కాలేయానికి చికిత్స
November 1, 2010

జ్వరాలతో నా అనుభవాలు

గత రెండున్నర నెలలుగా రాష్ట్రం ‘జ్వరాంధ్రప్రదేశ్‌’గా వేడెక్కిపోయిందనడంలో సందేహం లేదు. అయితే జ్వరాలు తగ్గించే పేరుతో ఆసుపత్రుల్లో తయారవుతున్న బిల్లులు కూడా వేలల్లో, లక్షల్లో పలకడం వినడానికి అతిశయోక్తిగా ఉన్నా నమ్మక తప్పదు. నేను 30 సంవత్సరాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో డాక్టరు ఉద్యోగం చేశాను. ఇందులో 20 ఏళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, చిన్న చిన్న తాలుకా ఆసుపత్రుల్లో, జిల్లా స్థాయి ఆసుపత్రిలో పనిచేశాను. ప్రత్యక్షంగా ఇటు పెద్దల్లోనూ, అటు పిల్లల్లోనూ జ్వరాలకు వైద్యం చేసిన అనుభవంతో కొన్ని విషయాలు పాఠకులతో పంచుకోవడం వ్యాసం ముఖ్య ఉద్దేశం. ఇటీవల వింటున్న, చూస్తున్న కొన్ని సంఘటనలు వ్యాసం రాయడానికి ప్రేరేపించాయి.

ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా జ్వరం రానివారు బహుశా ఉండరేమో ! జ్వరం వ్యాధి కాదు. జ్వరం వ్యాధి లక్షణం. ప్రతి జ్వరం వెనకా ఏదో ఒక కారణం ఉంటుంది. బహుశా ఆ కారణం వ్యాధి అయి ఉంటుంది. జ్వరం శరీరంలో రక్షణ చర్య. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 98 డిగ్రీల నుండి 100 డిగ్రీల పారిన్‌ హీట్‌లో ఉండొచ్చు. సాధారణంగా జ్వర లక్షణాలు ఎక్కువ మందిలో శరీరంలో సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు కనిపిస్తాయి. ఎండల్లో శరీరం వేడెక్కడం వడదెబ్బ అంటాం. మందులతో కూడా శరీరం ఎక్కువ జ్వరంగా భావించొచ్చు. మనకు వచ్చే చాలా జ్వరాలు వైరల్‌ జ్వరాలు.

జ్వరానికి వేలల్లో బిల్లులా?

నాకు తెలిసిన ఒక పల్లెటూరు మిత్రుడు ఇటీవల జ్వరంతో హైదరాబాద్‌ వచ్చాడు. తను జ్వరం తగ్గించుకోవడానికి దాదాపు 30వేల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు. అప్పులపాలయ్యాడు. ఈ జ్వరం మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌లాంటి జ్వరం కాదు ! నేను ఎప్పుడూ వేళ్లే హేయిర్‌ కంటింగ్‌ సెలూన్‌ యజమాని కూడా నాలుగు సంవత్సరాలు దాటని వాళ్ల అబ్బాయికి జ్వరం వస్తే ఆసుపత్రిలో చాలా పరీక్షలు నిర్వహించి, ఒక్కోక్కటీ 450 రూపాయల ఖరీదు చేసే సూదులు వేశారని, సెలైన్‌ ఎక్కించారని సెలూన్‌ యజమాని చెప్పాడు. దాదాపు పది వేల రూపాయలు ఖర్చు అయ్యిందట. మొత్తానికి గండం గడిచి పిల్లాడికి జ్వరం తగ్గిపోయిందని సంతోషం వ్యక్తం చేశాడు. అతను సాధారణ స్థాయిలోని సెలూన్‌కు యజమాని. అది అంత గొప్పగా నడిచే షాపు కూడా కాదు. మరో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు జ్వరం వచ్చి గుంటూరు ఆసుపత్రిలో చేరితే 50 వేల రూపాయలు ఖర్చు అయ్యిందట. మూడు వారాల క్రితం పేపర్లో చదివాను. అనంతపురం జిల్లాలో ఒక గ్రామీణుడి భార్య బెంగళూరులో డెంగీ వ్యాధితో చనిపోయింది. 40 వేల రూపాయలు చెల్లిస్తే శవమిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పారు. ఊరికొచ్చి ఇల్లు అమ్మి ఆ డబ్బు చెల్లించడం ఎంతో బాధ కలిగించింది. నెలన్నర క్రితం నాకూ జ్వరం వచ్చింది. నాలుగు రోజుల్లో జ్వరం తగ్గింది. నేను వాడింది 8 పారసిటమాల్‌ మాత్రలు మాత్రమే ! అందులో 4 మాత్రలు అనవసరంగా వాడాను. పనులతో, ప్రయాణం చేయడానికి సౌకర్యం కోసం వాడాను.

వాటి ఖర్చు 10 రూపాయలకన్నా తక్కువే !. అదే సమయంలో మూడున్నర సంవత్సరాల వయసున్న మా మనవడికి కూడా జ్వరం వచ్చింది. వాడికి ద్రవరూపంలో ఉన్న పారసిటమాల్‌ వాడాము. దాని ఖర్చు 28 రూపాయలు. మా కుటుంబంలో జ్వరాలు ఎవరికి వచ్చినా, వారికి కూడా అవే మందులతో, అదే ఖర్చుతో తగ్గిపోవాలి. అదనంగా వారికి డాక్టరు ఫీజు ఉంటుంది. పై సంఘటనలన్నింటిలో జరిగిన వైద్యం శాస్త్రీయం కావొచ్చు. లేదా అశాస్త్రీయం కావొచ్చు. శాస్త్రీయమైనదేతై ఎలాంటి అభ్యంతరం లేదు. అశాస్త్రీయమైనదైతే నిర్ధారించే వ్యవస్థ, యంత్రాంగం లేదు. వైద్యం శాస్త్రీయమైన పద్ధతుల్లో నేర్చుకునే ప్రక్రియ. ఇది నిరంతరం నేర్చుకోవాల్సిన శాస్త్రం. జ్వరం ఎలాంటి మందులు వాడకున్నా తగ్గిపోవచ్చు. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా తగ్గకపోవచ్చు. జ్వరాలతో అరుదుగా ప్రాణాలు కూడా పోవచ్చు. దీనిమీద ఎలాంటి వాదనలేదు.

వ్యక్తిగత అనుభవాలు

దాదాపు 20 ఏళ్లు పిల్లలకు, పెద్దలకు జ్వరాలకు వైద్యం చేశాను. దాదాపు 95 శాతం పరీక్షలు చేయకుండా సాధారణ మందులతోనే తగ్గిపోయాయి. ఈ సుదీర్ఘ కాలంలో కొన్ని మరచిపోలేని సంఘటనలు ప్రస్తావిస్తాను.

నర్సుగారి పిల్లాడి జ్వరం

అప్పుడు నేను కడప జిల్లా, ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిగా పనిచేసేవాడిని. అక్కడ నాతోపాటు పనిచేసే ఒక స్టాఫ్‌నర్సుకు నెల్లూరులో డెలివరీ అయ్యింది. కొన్ని నెలలు నెల్లూరులోనే ఉందామే. ఆమె నర్సు కాబట్టి పిల్లాడిని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే అలవాటు ఉండేది. ఒక రోజు అనుకోకుండా పిల్లాడి ఉష్ణోగ్రత చూసింది. 100 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉంది. ఎప్పుడు చూసినా అంతే ఉండేది. 98.4 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ సాధారణ ఉష్ణోగ్రత అని మా పాఠాల్లో సాధారణంగా బోధిస్తారు. ఆమెకు ఒకటే ఆందోళనట. చాలా మంది డాక్టర్లకు చూపించింది. చాలా పరీక్షలు చేయించింది. చాలా మందులు వాడింది. ఉష్ణోగ్రత ఎప్పుడూ 100 డిగ్రీలు ఉండేది. ఆమె ఆ పిల్లాడిని 6 నెలల వయసులో ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి నాకు చూపెట్టింది. బాబు బాగున్నాడు. తింటున్నాడు. తిరుగుతున్నాడు. ఆడుతున్నాడు. కొన్ని రోజులు ఎలాంటి పరీక్షలు చేయకుండా, ఎలాంటి మందులు వాడకుండా గమనించాను. ఉష్ణోగ్రతా 100 డిగ్రీలే ఉండేది. ఆరోజుల్లో నేను కూడా 98.4 డిగ్రీలు మించితే జ్వరం అనుకునే వాడిని. చివరగా ఆ నర్సుకు నేనిచ్చిన సలహా ఏమంటే.. తరచూ ఉష్ణోగ్రత చూడొద్దని. ఆ బాబు సాధారణ ఉష్ణోగ్రత 100 డిగ్రీలు ఉండొచ్చని. అది జ్వరం కాకపోవచ్చు అని. అంతటితో వదిలిపెట్టాం. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గమనించాము. కొన్నేళ్ల తర్వాత చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేశాను. అప్పుడు నర్సు కూడా అక్కడికి బదిలీ అయ్యింది. అప్పుడు ఆ బాబును గమనించాను. ఎలాంటి సమస్యలు లేకుండా బాగా పెరుగుతున్నాడు.

పల్లెవాసుల్లో జ్వరాలు

1979 నుండి 1981 వరకు, 1985 నుండి కడప జిల్లాలోని కల్లూరు, రాజుపాలేం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేశాను. మాకు అప్పుడు చాలా తక్కువ మందులు ఉండేవి. 10 రకాల లోపు మాత్రలు, 3 లేదా 4 రకాల సూది మందులు. నూటికి 95 శాతం జ్వరాలు ఆ మందులతోనే తగ్గేవి. మలేరియా పరీక్షలు మాత్రమే చేసేవాళ్లం. మలేరియా నిర్ధారణ అయితే దాదాపు అందరికీ మా ఆరోగ్య కార్యకర్తలే విజయవంతంగా వైద్యం చేసేవారు. మేం మందులు కొరతగా ఉన్నాయని భావించేవారం కాదు. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దాదాపు 20 రెట్లు మందులు పెరిగాయి. అయినా అందరూ మందుల కొరత అంటున్నారు !!

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.