డిఎన్‌ఏలో నుదుటి వ్రాత

పొట్ట ఉబ్బరించిందా?
October 26, 2010
పీచులో ఉందిలే మజా
October 26, 2010

డిఎన్‌ఏలో నుదుటి వ్రాత

మనం పుట్టినప్పుడే బ్రహ్మరాత మన నుదుటిమీద ఉంటుందట. రాబోయే ఘటనలు, మనం చేసే నటనలు ఆ బ్రహ్మరాత ప్రకారమే జరుగుతాయట. ఆ రాతను చదివే వారు లేరు. రాబోయే కాలంలో జరిగే విషయాలను తెలుసుకొనుటకు ఉత్సాహ వంతులు జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు. ఇదీ మన పద్ధతి, ప్రాశ్చ పద్ధతి. పాశ్చాత్య దేశాలలో కూడా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే వారు కోకొల్లలు ఉన్నారు. శాస్త్ర పరిశోధనలు చేసి జన్యువులు (జీన్సు) శరీరకణాలలో ఉన్నాయని, వాటి క్రియాశక్తి వల్లనే అవయవాలలోని కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి అని చెప్పారు. మనిషి ఎంత ఎత్తు ఎదుగగలడు? లేదా అతని/ఆమె చర్మపు రంగు ఎలా ఉంటుంది? రాబోయే కాలంలో మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయా? అన్న విషయాలు డిఎన్‌ఎలో ఉన్న జీన్సులో సమాచారం భద్రంగా ఉంటుంది. అంటే డిఎన్‌ఎ వల్లనే మనిషి ఆకృతి, ఆరోగ్యం ఉంటాయి అని శాస్తజ్ఞ్రులు చెపుతున్నారు.ప్రకృతిలో సంభవించే మార్పుల వలన మానవుల జీన్సులో మార్పులు వస్తాయా? అన్న ప్రశ్న మేథావులను పట్టి పీడించిన విషయం. జంతువులలో, మానవులలో మార్పులు క్రమేపి జరుగుతాయని ఛార్లెస్ డార్విన్ మహాశయుడు సిద్ధాంతం చేసాడు. అన్ని విధాలా అంటే మానసిక, శారీరక ధారుడ్యం కలవారే బ్రతకగలరు (సర్పెవల్ ఆఫ్ ది ఫిట్టెస్టు) అన్న సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. జన్యు శాస్తజ్ఞ్రులు చేసిన పరిశోధనల వలన జీన్సులో మార్పు మ్యూటేషన్ వల్ల వస్తుందని, ఆ మార్పు జీన్సులోనే జరుగుతుందని చెప్పారు.

జీన్సు నిర్మాణంలో మార్పు లేకుండా, జీన్సుపై అంటే డిఎన్‌పై అదనంగా మిథైల్ (సిహెచ్-3) అనే అణువును సంధిస్తే జీన్సు తయారు చేసే మాంసకృత్తుల (ప్రొటీన్సు)లో మార్పు వస్తుందని, ఆ మార్పునే ఉపరి జన్యుశాస్త్రం విశదీకరిస్తుందని తెలిసింది. మనం నివసించే విధానం, మనల్ని ఆవరించి ఉన్న వాతావరణం మన ‘డిఎన్‌ఎ’లో మార్పును తీసుకుని వస్తుందా? మార్పులు వస్తే ఏ విధంగా మార్పు వస్తోంది? అన్న ప్రశ్నలకు లభించిన సమాధానాలే ఉపరిజన్యు (ఎపిజెనిటిక్సు) శాస్త్రానికి నాంది అయ్యాయి. స్వీడన్ దేశంలో, ఉత్తర భాగంలో గత శతాబ్దాలలో వచ్చిన కరువు కాటకాల వల్ల ప్రజలలో ఏయే మార్పులు వచ్చాయో తెలుసుకొనుటకు డాక్టరు లార్స్ ఓలేవ్ బిగ్రెన్ 1980 సంవత్సరంలో పరిశోధనలు మొదలు పెట్టాడు. వ్వవసాయ శాస్తజ్ఞ్రుల సహకారంతో స్వీడన్ 1800, 1812, 1836, 1856 సంవత్సరాలలో పంటలు పండలేదని కరవు వచ్చిందని, 1801, 1822, 1828, 1844, 1863 సంవత్సరాలలో పంటలు పుష్కలంగా పండాయని తేల్చారు. కరువు వచ్చిన సంవత్సరాలలో కడుపు కాల్చుకుని, పంటలు బాగుగా పండిన సంవత్సరాలలో కడుపునిండా తిన్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో ఏయే మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని డాక్టర్ బిగ్రెన్ పరిశోధన చేసాడు. ఏ పిల్లలయితే అధిక ఆహారాన్ని తిన్నారో వారి పిల్లల్లో, మనుమలలో జన్యువుల మార్పు కలిగిందని, ఆ మార్పు వలన వారి పిల్లల, మనుమల ఆయుష్షు తగ్గిపోయిందని తేలింది. ఈ పరిశోధన ఫలితాలు 150 సంవత్సరాల క్రితం డాల్విన్ గారు వ్రాసిన ‘‘అన్ ది ఆరిజిన్ ఆఫ్ స్వీషీస్’’ అన్న పుస్తకంలో వివరించిన సిద్ధాంతానికి వ్యతిరేకతను వెల్లడించాయి. అయితే ఈ మార్పు ఎలా జరిగింది? జరిగిన మార్పును తెలియజేసే శాస్తమ్రే ఉపరిజన్యు శాస్త్రం (ఎపిజెనిటిక్సు). జన్యువుల నిర్మాణ క్రమంలో మార్పు ఉండదు కాని ‘‘మిథైల్’ (సిహెచ్-3) అనే బణువు ‘(మాలిక్యూల్)ను ‘డిఎన్‌ఎ’పై సంధిస్తే ఆ జీన్సు ఎలా పని చేయ్యాలో, లేక ఎలా పని చెయ్యకూడదో చెప్తాయి.ఉపరి జన్యు శాస్త్రం వల్ల రెండు విషయాలు తెలిసాయి. మొదటిది సిగరెట్టు కాల్చేవారు, అతిగా తిన్న స్థూలకాయలైన వారు తెలుసుకోవల్సినది ఏమిటంటే వారి ఆయుష్షు ఎలా అయినా క్షీణించింది కాని వారికి పుట్టిన పిల్లలకు కూడా ఆయుక్షీణం కలుగుతుంది. రెండోది ఉపరి జన్యువులలో మార్పును తీసుకుని వచ్చి మందుల సహకారంతో కొన్ని జబ్బులు రాకుండా చేయవచ్చును. మందుల తయారీకి మార్గదర్శక సూత్రాలను చెప్పే అమెరికాదేశపు సంస్థ (ఎఫ్‌డిఎ) వారు మూడు రకాల మందుల తయారీకి అనుమతి ఇచ్చారు. ఆ మందులు ట్యూమర్ సప్‌రెస్సార్ జీన్సు (కేన్సరు కణతులు పెరగకుండా పనిచేసే జన్యువులను) ఉపరి జన్యు సిద్ధాంతంతో తయారు చేసినవి కాబట్టి కేన్సరు కణుతులు పెరగకుండా పనిచేస్తాయి.ఉపరి జన్యువులు మానవ శరీర నిర్మాణానికి, కణాలు చేయవలసిన కార్యాలకు అవసరం. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ ఎసోసియేషన్‌లో జనవరి 20, 2010 తేదీని వెలువడిన పత్రిక లో డాక్టర్. ఎం.జె. ప్రెడరిక్ వారు ఉపరిజన్యువులు కేన్సరు వ్యాధిని ఎలా అదుపులోనికి తేగలవో వివరిస్తూ వ్యాసాన్ని రాశారు. ఏయే రసాయనాలు మిథైల్ బణువును సరఫరా చేసి, ‘డిఎన్‌ఎ’కు అతికించగలవో, లేదా ‘హిస్పోన్’కు సంధించగలవో తెలుసుకొనుటకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఉపరిజన్యు శాస్త్రంలో తయారు చేసిన మందులతో పాటు కీమో థెరఫి మందులను కూడా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. మన భవిష్యత్తు బ్రహ్మరాతగా పిలువదగ్గ ‘డిఎన్‌ఎ’తో ముడిపడి ఉందని భావించాము. కాని జీన్సులో మార్పు తీసుకుని రాకుండా జీన్సుపై మిథైల్ అణువును ఉంచితే కలిగే మార్పులవల్ల మానవజాతికి మేలు కలుగవచ్చును.

 డాక్టర్ గవరసాన సత్యనారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.