డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు

పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?
February 17, 2014
ఒత్తిడిని పెంచే సెల్‌ఫోన్‌..!
March 22, 2014

డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు

శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. దీని గురించి తెలుసుకుందాం.

dyslipidemiaధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో ఎక్కడైనా పెరగడంవల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయని, గుండెపోటు, పక్షవాతం వస్తాయని, కాలి దిగువ భాగంలో గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుందని మనలో చాలా మందికి తెలియదు. ఇవన్నీ గుండె రక్త నాళాల జబ్బుకు దారి తీస్తాయని వైద్యులు చెబుతు న్నారు. గుండె రక్తనాళాల జబ్బులకు చాలా కారణా లున్నాయి. వీటిలో ముఖ్యమైనవి మధు మేహం, అధిక రక్తపోటు, ధూమపానం, కొవ్వు అసాధారణ స్థాయిలో ఉండటం (డిస్‌లిపిడిమియ) వంటివి.

శరీరంలో ఉండే రకరకాల కొవ్వులను లిపిడ్స్‌ అంటారు. కానీ ప్రధానమైన కొవ్వు రూపాల్లో ఒకటి కొలెస్ట్రాల్‌, రెండోది ట్రై గ్లిజరాయిడ్స్‌. ఇవీ రెండు లైపోప్రోటీన్‌ రూపంలో రక్తంలో ప్రవహిస్తుంటాయి. లైపో ప్రోటీన్లు మూడు రకాలులో డెన్సిటీ లైపో ప్రోటీన్‌ (ఎల్‌డిఎల్‌) మొత్తం కొలెస్ట్రాల్‌లో ఇది 10 నుంచి 15% ఉంటుంది. వీటిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు కలిగే పరిస్థితిని డిస్‌లిపిడిమియ అంటారు.

డిస్‌లిపిడిమియ జన్యుపరమైన కారణాలవల్ల రావచ్చు. జీవనశైలి కారణాలు… మధుమేహం, ధూమపానం, కదలికలేని జీవన విధానం (సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌), స్థూలకాయంవల్ల డిస్‌లిపిడిమియ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అంతేగాక కొన్ని ప్రత్యేక మందులు (స్టెరాయిడ్లు, హార్మోన్లు), వ్యాధులు (థైరాయిడ్‌ సమస్యలు) కూడా డిస్‌లిపిడిమియాకు కారణం కావచ్చు .

ఎల్‌డిఎల్‌: ఎల్‌డిఎల్‌ను చెడ్డ కొలెస్ట్రాల్‌ అంటారు. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతీ ఒక మిల్లీ గ్రాము/డిఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే  పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒక శాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డిఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీగ్రాము/డిఎల్‌కు పెరిగి నప్పుడు గుండెపోటు ప్రమాదం అధికం అవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము /డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

యుక్త వయసు నుంచే ఎల్‌డిఎల్‌ను తగ్గించుకోవడాన్ని ప్రారంభిం చాలి. ఎల్‌డిఎల్‌ స్థాయిని 10 మిల్లీ గ్రాము/డిఎల్‌కు తగ్గించుకుంటే, 40 ఏళ్ళు వచ్చేసరికి, జీవితకాలంలో వచ్చే గుండెపోటు ప్రమాదం 50 శాతం తగ్గుతుంది. ఇదే స్థాయిని కొనసాగిస్తే, 70 ఏళ్ల వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం తగ్గుతుంది. ఎల్‌డిఎల్‌ స్థాయి 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంటే సురక్షితమైన స్థితిలో ఉన్నామని అర్థం. కుటుంబంలో ఇంతకు ముందు తాతయ్య, నానమ్మలు, తల్లితండ్రు లకు గుండెజబ్బు ఉన్న చరిత్ర ఉండే వారు తమ ఎల్‌డిఎల్‌ స్థాయిని 40 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఉంచు కోవడం ఎంతో సురక్షితం, ఆరోగ్యకరం కూడా.

హెచ్‌డిఎల్‌: దీన్ని మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. అథిరొస్ల్కెరొసిస్‌ అనే సమస్య ఉత్పన్నం గాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువ ఉందంటే, గుండె రక్త నాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండెపోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురుషుల్లో 40 ఎంజి/డిఎల్‌, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా చూసుకోవాలి.

ట్రైగ్లిజరైడ్స్‌: ఇవి పెరుగుతున్నాయంటే, గుండె రక్తనాళాల వ్యాధి అధికమవుతున్న సంకే తాలు వెలువడతాయి. ట్రైగ్లిజరైడ్‌ స్తాయి పెరిగితే, గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని కొత్త ఆధారాలు వెల్లడించాయి. ట్రైగ్లిజరైడ్‌ స్థాయి 150 ఎంజి/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలి.

డిస్‌లిపిడిమియాను సులభంగా నిర్వహిం చొచ్చు. స్తబ్దుగా ఉండకుండా ఏదైనా క్రియాశీల చర్యలు చేపట్టడం అవసరం. ఇష్టమైన వ్యాయామం చేయాలి. ఉదయం పూట కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. నడకేగాక, జాగింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ చేయవచ్చు.

మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలి.

ధూమపానం అలవాటు ఉంటే మానుకోవాలి. మధుమేహం ఉంటే, నియంత్రణలో ఉంచుకోవాలి.

మీ ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే మీకు మరిన్ని సూచనలు, సలహాలు ఇస్తారు.

డాక్టర్‌ ఉషశ్రీ,
కేర్‌ హాస్పిటల్‌,
బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌

(ప్రజాశక్తి దినపత్రిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.