తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు

usiri
ఉసిరితో ఎన్నో ఉపయోగాలు
July 15, 2014
instant noodles
మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!
May 31, 2015

తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు

సాధారణంగా స్ర్తిలు పరిసరాల ప్రభావాలవల్ల కొన్ని అలవాట్లకు లోనవుతారు. అవే అలవాట్లు బిడ్డ పుట్టిన తరువాత కూడా కొనసాగుతాయి. కొంతమంది తల్లులు ఒకే పక్క పడుకుని నిద్రపోతారు. రెండోపక్క పడుకుంటే వారికి నిద్రపట్టదు. బిడ్డ పుట్టిన తరువాత కూడా వారు ఎప్పుడూ ఒకేవైపు పడుకుని బిడ్డకు పాలివ్వడంవల్ల, బిడ్డ శరీరం ఒకేపక్క ఎక్కువ వత్తిడికి గురై బిడ్డ ముఖం, దవడలు ఒక్క పక్క తోసుకుపోయి రెండవ పక్క పుష్టిగా వుంటాయి. అంటే బిడ్డ ముఖం అపసవ్యంగా కన్పిస్తుంది. ఈ విషయం తల్లులకు చిన్నదైనా పిల్లలు మాత్రం జీవితకాలం మానసిక వ్యధకు లోనుకావాల్సి వస్తుంది.

కొంతమంది అమ్మమ్మలు, నాన్నమ్మలు పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ముక్కులో నూనె వేస్తారు. ఆ విధంగా చేయడంవల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోయి గాలి సరిగ్గా ముక్కు ద్వారా పీల్చుకోలేక నోటిద్వారా పీల్చుకోవడం పిల్లలకు అలవాటవుతుంది. అదేవిధంగా పిల్లలకు ఎక్కువకాలంపాటు జలుబు చేసినట్లయితే ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నోటి ద్వారా గాలి పీల్చుకోవడం అలవాటవుతుంది.

ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్యసహాయం పొందాలి. లేకుంటే బిడ్డ నోటి ద్వారా గాలి పీల్చుకున్నట్లయితే పైదవడ, పెదవిపై పళ్లు ఎత్తుగా రావడం జరుగుతుంది. చాలామంది తల్లులు బిజీగా ఉండడంవల్ల పిల్లల విషయంలో ఎక్కువ సమయం గడపటానికి వీలులేకపోవడంవల్ల పాల సీసాలను, పాలపీకలను పిల్లలకు అలవాటు చేసి వారి పనులను చక్కబెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది తల్లులు ఉద్యోగరీత్యా పిల్లలను ఆయాలకు కూడా అప్పగిస్తారు. ఆయాలుకూడా పిల్లలకు పాల సీసాలను, పాలపీకలను అలవాటు చేస్తారు.
ఎందుకంటే పిల్లలు ఏడ్చినపుడు వాళ్ళను ఊరుకోబెట్టడానికి, ఏడవకుండా చేయడానికి ఆయాలు ఎక్కువగా పాలపీకలను పిల్లల నోటికి అందిస్తారు. ఈ విధంగా మొదలైనది అలవాటుగా మారి పిల్లవాడు పాల సీసాలను నోట్లోనుంచి తీసినట్టయితే ఏడవడం మొదలుపెడతాడు. కనుక పిల్లలకు నిర్ణీత సమయంలో పాలసీసాలను అందించి పాలు తాగిన తరువాత సీసాను తీసివేయాలి. అంతేగానీ, గంటల తరబడి సీసాను నోట్లో ఉంచకూడదు. కొంతమంది తల్లులు రాత్రిళ్లు బిడ్డ నోట్లో పాల సీసాను ఉంచి హాయిగా నిద్రపోతారు. అలా చేయడంవల్ల పాపాయికి అదో అలవాటైపోతుంది. రోజూ అదేవిధంగా పాలసీసా ఇవ్వకపోతే ఏడుస్తూ రాత్రంతా తల్లిని నిద్రపోకుండా చేస్తారు. కనుక ఈ పాలసీసాలను, పాలపీకలను అలవాటు చేయడంలో చాలా జాగ్రత్త వహించాలి.
పిల్లలు గంటల తరబడి పాలసీసాలను, పాలపీకలను నోట్లో ఉంచుకుని చప్పరించడంవల్ల పైదవడ, అంగిటభాగం లోపలికిపోయి పైదవడ ఎత్తుగా కోలగా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఎత్తుపళ్లు రావడం, ముఖకవళికల్లో మార్పువచ్చి ముఖం చూడటానికి అందంగా కనిపించక ఎత్తు పళ్లు కన్పిస్తూంటాయి. ఈ ఎత్తుపళ్లవల్ల అమ్మాయికానీ, అబ్బాయికానీ భావి జీవితంలో మానసిక వ్యధకు లోనుకావడం జరుగుతుంది. కనుక, తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకొని పిల్లల మనోవికాసానికి భంగం కలుగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాలి.
తల్లిదండ్రులు, పెద్దలు వారి ప్రేమను, అనురాగాన్ని ముద్దుల ద్వారా చూపిస్తారు. కొంతమంది తల్లులు నోట్లో నోరుపెట్టి ముద్దులివ్వడం చేస్తారు. ఈ విధంగా చేయడంవల్ల తల్లికి ఉన్న నోటి వ్యాధి పిల్లలకు త్వరగా సోకే అవకాశం ఉంది. ఎందుకంటే, వారికి వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. కనుక, తల్లులైనా, పెద్దలైనా పిల్లలకు ముద్దులివ్వడంలో తగిన జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లుల అలవాట్లవల్ల పిల్లలకు నష్టం కష్టం వ్యాధి కలుగకుండా ఉండాలి కదా!

  • డా ఓ.నాగేశ్వరరావు,
  • 9849014562,
  • 10/09/2014.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.