నడుమునొప్పి నిర్లక్ష్యం చేయొద్దు

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య నడుమునొప్పి. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కన్పించే నడుమునొప్పి (‘లంబార్ స్పాడండైలోసిస్’) ఇప్పుడు వయసుతో నిమిత్తము లేకుండా ఇటీవల యుక్తవయసులో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి విధానమే. నడుమునొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా సమస్య తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులే తోడ్పడుతాయి.నడుము ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవటం వలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటం వలన నడుమునొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది.ఈ ఎముక ఒక్కోసారి పెరిగి అస్టియోఫైట్స్ ఏర్పడుతాయి.అలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన తీవ్రమైన నడుమునొప్పితో వేధించబడతారు. ఇలాంటి సమస్యనే ‘లంబార్ స్పాండైలోసిస్’ అంటారు.

నడుమునొప్పికి కారణాలు

ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటం వలన వస్తుంది. స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో, అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం, ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బ తినడం లేదా ప్రక్కకు తొలగటం, కంప్యూటర్స్ ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పని చేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్ లోపించడం వలన నడుము నొప్పి వస్తుంది.

లక్షణాలు

నడుమునొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చిన వంగినా, కూర్చున్నా, నడిచినా నొప్పి తీవ్రత పెరుగును. నాడులు ఒత్తిడికి గురికావడంవల్ల నొప్పి ఎడమకాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధిస్తాయ. నడుము కింది భాగం మరియు ఎడమకాలు లేదా కుడి కాలుకు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయ. హఠాత్తుగా వంగినా, బరువులు ఎత్తినా, నడుము వంచినా తీవ్రమైన నడుంనొప్పితో బాధపడుతుంటారు.

జాగ్రత్తలు

నడుమునొప్పితో వేదనకు గురైనవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. వాహనము నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి.
బరువులు ఎక్కువగా లేపకూడదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్టు తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగాని, నేలమీదగాని పడుకోవాలి. ముఖ్యంగా స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలలో సరియైన స్థితిలో కూర్చోవాలి.

అసంబద్ధ భంగిములలో కూర్చోవడం మానుకోవాలి. నడుమును ఒకేసారి అకస్మాత్తుగా తిప్పడం, వంచడం చేయకూడదు. నడుమునొప్పి రాకుండా ఉండటానికి పౌష్ఠిక ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి. స్థూల కాయం ఉన్నవారు వెంటనే బరువు తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్ళు, ఫాస్ట్ఫుడ్స్, జింక్‌ఫుండ్స్ తీసుకోవడం మానుకోవాలి. నడుమునొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పాదరక్షలు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి.

చికిత్స

హోమియో వైద్యంలో నడుమునొప్పికి మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన నడుంనొప్పి నుండి విముక్తి లభిస్తుంది.

మందులు

బ్రయోనియా:

నడుమును కదిలించినా, వంగినా, నడిచినా నొప్పి అధికంగాఉంటుంది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్దకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతుంటారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికల వలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించ దగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
రస్టాక్స్:

నడుంనొప్పి ఉదయం నిద్ర లేచినమొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించ దగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణుకుట వలన వచ్చే నడుమునొప్పికి ఈ మందు బాగా పని చేయును. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
హైపరికం:

వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే నడుము నొప్పికి, అలాగే ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.
ఆర్నికా:

పడటంవలన నడుము ప్రాంతంలో ఎముకకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం నడుమునొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.

ఈ మందులే కాకుండా, రూటా, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింత్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయమును పరిగణలోకి తీసుకొని వైద్యం చేయంచుకొంటే నడుంనొప్పిని నివారించవచ్చు.

– డా॥ పావుశెట్టి శ్రిధర్

E-mail: [email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*