నిద్రలేమి
January 3, 2011
వెన్నెముక సమస్యలు.. చికిత్స
January 3, 2011

నిద్ర అంటే రీఛార్జ్‌

ఎందుకో నిద్రపట్టడం లేదు ! చక్కగా వేసిన పక్క క్రికెట్‌ ఆడినట్లు, కుస్తీపట్టినట్లు నలిగి తుక్కుతుక్కు అయ్యిందిగానీ, కంటి రెప్పలు మాత్రం కలవలేదు. కునుకుపట్టలేదు. తల్లిగర్భంలోపడినప్పటి నుంచి నిద్రిస్తూ పెరుగుతారు. పుట్టాక వేళకి పాలిస్తే తాగి మళ్లీ నిద్రలోకి జారిపోతారు. బాలానాం, వృద్దానాం అన్నారుగదా ! వృద్ధాప్యం వచ్చేసరికి నిద్ర తగ్గిపోతుంది. వయసులో మార్పులు, వృత్తిలో ఒత్తిళ్లు, మానసిక సమస్యలు వెరసి మనకు నిద్ర కరువైపోతోంది. చిన్న పిల్లలకైతే అమ్మ ఉయ్యాలలో వేసి చిచ్చికొట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. బంగారం లాంటి నిద్ర కావాలంటే ఏం చేయాలి? అసలు నిద్ర ఎందుకు పట్టదు? ఎంతసేపు నిద్రపోవాలి? సుఖంగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలిపే ప్రత్యేక కథనం …
ఇవి పాటిస్తే సుఖనిద్ర మీ వశం
* ప్రతీరోజూ క్రమంగా తగినంతా శారీరక వ్యాయామం చేయాలి.
నిద్రకు ముందు అతిగా భుజించకూడదు. మితంగా ఆహారం తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. నీళ్లు ఎక్కువ తాగకూడదు.
* పడుకోబోయే ముందు కాఫీలు, టీలు, శీతలపానీయాలు తీసుకోకూడదు. మద్యపానం, ధూమపానం చేయకూడదు.
* నిద్రపోయే ముందు చదవడం, టీవీ చూడడం, సెల్‌ఫోన్లు వాడడం, ఇంటర్నెట్‌ ఉపయోగించడం చేయరాదు.
* నిద్రపోయే ప్రదేశం నిశ్శబ్దంగా ఉండాలి. చీకటిగా ఉండాలి. బెడ్‌లైటు కూడా ఉండకూడదు. నిద్రకు సహకరిచే ‘మెలటోనిన్‌’ హార్మోను చీకటిలోనే ఉత్పత్తి అవుతుంది. వెలుతురు తగ్గినప్పుడు దీని ఉత్పత్తి ఆగిపోతుంది. ఒక వేళ పగలు నిద్రపోవాల్సి వస్తే రాత్రపూలాగే గదంతా చీకటిగా ఉండే వాతావరణం సృష్టించుకోవాలి.
రాత్రవగానే మనం నిద్రపోతాం. ఆలోచనలు ఎక్కువైనా నిద్రపట్టదు. నిద్రపోవాలని కొందరు నిద్రమాత్రలు వాడుతుంటారు. ఆకలి చెరుగదు, నిద్ర సుఖమెరుగదు కదా ! బాగా పనిచేశాక గాఢ నిద్రపడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకుని పడుకున్నా మనకు ఒక్కోసారి నిద్రరానే రాదు. కానీ, ఆరుబయట కాయకష్టం చేసుకునేవాళ్లు రోడ్డుపక్కన్ను ఇసుక మీద,కంకరరాళ్లమీద హాయిగా నిద్రపోతుంటారు.
కొంతమంది ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లో నిద్రపోతుంటారు. మనిషి తన జీవితకాలంలో మూడోవంతు నిద్రలోనే గడుపుతాడు. నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైందని, పౌరులప్రాథమిక హక్కని, ఆరోగ్యవంతమైన జీవనానికి చాలా అవసరమని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది.
నిద్ర అవసరం
రోజంతా పనిచేయడం వల్ల కలిగే అలసట, వృత్తిపరంగాను, ఇతరత్రా మనం ఎదుర్కొనే సమస్యల కారణంగా కలిగే మానసిక ఒత్తిడి నుండి కోలుకోవడానికి నిద్ర అవసరం. ప్రతీ ఉదయం మనల్ని చక్కగా రిఫ్రెష్‌ చేసి ఆరోజు మన కార్యక్రమాల కోసం ఉత్సాహంగా ఉండేలా సన్నద్ధం చేసేదే నిద్ర. సెల్‌ఫోన్‌ బ్యాటరీని ఎలా రీచార్జ్‌ చేస్తామో, అలసిపోయిన మన శరీరానికి రీచార్జ్‌ చేయడమే నిద్ర.
నిద్రలో రకాలు
నిద్రలోనూ రెండు రకాలున్నాయి. అవి సుఖ నిద్ర, కలత నిద్ర. నిద్రలో సుఖనిద్ర 75 శాతం, కలత నిద్ర 25 శాతం ఉంటుంది. కలత నిద్రలో కలలు ఎక్కువగా వస్తాయి. మెదడు, శరీరం పనితీరు అధికంగా ఉంటుంది. మనిషి 8 గంటలు నిద్రపోవాలి. ఇందులో ఆరు నుంచి ఆరున్నర గంటలు సుఖనిద్ర ఉంటుంది. మిగతా ఒకటిన్నర నుంచి రెండు గంటలు కలత నిద్ర ఉంటుంది.
చాలా మందికి నిద్రాభంగం జరిగితే నిద్రరాకపోవడమే కాక, కలత నిద్ర ఎక్కువైతుంది. బయటి వారికి నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ నిద్రపోతున్నట్టు తృప్తి ఉండదు.తొమ్మిదిగంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిని అతి నిద్రాపరులం టారు.ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిని కొద్దిగా నిద్ర పోయేవారంటారు.
షిఫ్ట్‌ ఉద్యోగస్తుల్లో
పగలు నిద్రపోయి, రాత్రి మేల్కోనేవారు రకరకాల జబ్బులతో బాధప డతారు. మనిషిలో ‘బయో లాజికల్‌ క్లాక్‌’ ఉంటుంది. అంటే మనం పగలు పనిచేయడం, రాత్రి పడు కోవ డానికి అలవాటుపడ్డాం. దీనికి విరుద్ధంగా ఉంటే సమస్యలు ఉత్పన్న మవు తాయి. షిఫ్ట్‌ ఉద్యోగాలు, నైట్‌ డ్యూటీలు చేసేవారు మూడు నెలలపాటు ఒకే డ్యూటీ చేయాలి. ఒకే సమాయానికి పడుకోవడం అవాటు చేసుకోవాలి.
ఎంత నిద్ర అవసరం?
కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.ఇలా చేస్తే మనిషి శారీరక,మానసిక జబ్బుల బారినపడే అవకాశం తక్కువ.నిద్ర సమయం వయసుతోపాటు మారుతుంది. 0 నుంచి ఒక సంవత్సరం వయసున్న నవజాత శిశువులు 18 నుండి 20 గంటలు నిద్రపోతారు. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలు 12 నుండి 18 గంటలు, 3 నుండి 12 సంవత్సరాలు 10 గంటలు, 12 నుండి 50 సంవత్సరాలు, 7 ఉండి 9 గంటలు నిద్రపోవాలివృద్ధాప్యంలో ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోతారు.
అతినిద్ర
ప్రతీరోజూ అవసరానికి మించి కనీసం నెలరోజులపాటు, పగలు- రాత్రి నిద్రపోవడాన్ని అతినిద్ర అంటారు. చాలా మంది ఎక్కువ రోజులు బలవంతంగా మేల్కొనే ఉంటారు. కొన్ని రకాల రుతుస్రావ సమస్యలున్న వారిలో అతినిద్ర ఉంటుంది. గురక సమస్యతో బాధపడేవారు. దీర్ఘకాల సమస్యలున్నవారు. తలకు బలమైన గాయాలైనవారికి. చిన్న మెదడులో కణితులు ఏర్పడినప్పుడు, స్థూలకాయుల్లో అతినిద్ర సమస్య ఉంటుంది.
తూలుతూ…..
నాక్రొలెప్సీ సమస్య ఉన్నవారు అతినిద్ర జబ్బుతో ఉంటారు. చదువు తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కునుకు తీస్తుంటారు. పదివేల మందిలో నలుగురికి ఈ సమస్య ఉంటుంది. 15 నుంచి 20 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య అధికం. నడుస్తున్నప్పుడు ఉన్నట్టుండి పడిపోతారు. నడుస్తూ కలలుకంటారు. పరిసరాలను పట్టించుకోరు. ఏంచేస్తున్నారో మరచిపోతారు.
డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌,
మానసిక వైద్యనిపుణులు,

ప్రశాంతి మైండ్‌కేర్‌ హాస్పిటల్‌ అనంతపురం.
ఫోన్‌ : 9848316994

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.