పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?

పిల్లలకు పాలివ్వకపోవడం వల్ల క్యాన్సర్‌ రావచ్చు
February 15, 2014
డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు
February 22, 2014

పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?

ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతోపాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మానవుల్లో సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. ఇవేగాక వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురిచేసే సమస్యలవల్ల, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది.

Infertilityసంతానలేమి సమస్యకు కారణమేమిటి? అంటే భార్యా భర్తల్లో ఎవరిలోనైనా లోపం ఉండవచ్చు.ప్రస్తుతం సంతానలేమి సమస్య కేవలం 30 శాతం మంది మహిళల్లో లోపాలవల్ల అయితే, మరో 30 శాతం వరకు పురుషుల్లో లోపాలవల్ల ఏర్పడుతోంది. 40 శాతం వరకూ స్త్రీ, పురుషులిద్దరిలోనూ కొద్దిపాటి లోపాలవల్ల సంతానలేమి సమస్య ఏర్పడుతోంది. పూర్వకాలంలో సంతానం కలుగకపోతే కేవలం భార్యదే తప్పు అనే అపోహ ఉండేది. కానీ ఆధునిక వైద్య విధానంలో అలాంటి అపోహలకు తావులేకుండా ఎవరిలో లోపం ఉందనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. చాలా వరకు 70 శాతం మందిలో భార్యల్లో ఎలాంటి లోపమూ ఉండకపోవచ్చు. లేకపోతే కొద్దిపాటి సమస్య ఉండవచ్చు. సరైన వైద్య చికిత్సలతో ఆ లోపాన్ని సరిచేసే అవకాశం ఉంది.

పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి? ఎవరికి ఈ సమస్య తలెత్తుతుంది? అనేది గమనిస్తే ఒకటి వయసు మీరిన తర్వాత అంటే 40 ఏళ్లు పైబడిన తర్వాత సమస్య ఏర్పడవచ్చు. రెండోది పుట్టుకతోనే అవయవాలలోపంవల్ల, జననేంద్రియాల్లోగానీ, పిట్యూటరీ గ్రంథిలో సమస్యవల్లగానీ, అవయవాల పెరుగుదల సరిగ్గా లేకపోవడంవల్లగానీ సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. కొందరిలో క్షయవ్యాధి (ట్యుబర్‌ క్లోసిస్‌) రావడం, ముఖ్యంగా జననేంద్రియాల్లో క్షయ వ్యాధి రావడం వల్ల వీర్యం ఇన్‌ఫెక్షన్‌ అయ్యి, అది సరఫరా అయ్యే నాళాలు దెబ్బతినిగానీ, మూసుకుపోయిగానీ సమస్య ఏర్పడవచ్చు. ఇదీగాక అధిక మానసిక ఒత్తిడివల్ల, దీర్ఘకాలిక వ్యాధులవల్ల, పొల్యూషన్‌వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతానలేమికి కారణం అవుతాయి.

సంతానలేమి అని ఎప్పుడు అంటాం?

దంపతులిద్దరూ ఒక సంవత్సరంపాటు సహజ లైంగిక చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ సంతానం కలుగకపోతే దానిని సంతానలేమి సమస్య అంటారు. కొన్నిసార్లు భార్యా భర్త కలిసున్నప్పటికీ సంతానాన్ని నిరోధించడానికి కండోమ్స్‌, కాపర్‌ టీ, నిరోధ్‌, మందులు వాడితే దానిని సంతానలేమిగా పరిగణించ కూడదు. ఉద్యోగ రీత్యానో, మరే కారణంగానో భార్య భర్త దూరంగా ఉన్నప్పుడు సంతానం కలుగకపోతే దానిని సంతానలేమి సమస్య అనలేం.

భార్యా భర్తల మధ్య రెగ్యులర్‌గా లైంగిక చర్య జరుగుతున్నప్పటికీ సంవత్సరం అయినా పిల్లలు కలుగనప్పుడే సంతానలేమి సమస్యగా అనుమానించాలి. అప్పుడు చికిత్స కోసం గైనకాలజిస్టునుగానీ, ఆండ్రాలజిస్టునుగానీ సంప్రదించాలి. ముఖ్యంగా పురుషుల్లో సంతానలేమి సమస్యను గుర్తించి, చికిత్స చేసే డాక్టర్‌ను ఆండ్రాలజిస్టు అంటారు. యూరాలజిస్టుల్లోనే కొందరు ఆండ్రాలజిస్టులుగా కూడా ఉంటారు. వీరిని సంప్రదిస్తే సంతానలేమి సమస్యకు కారణాలేమిటో, ఎలాంటి చికిత్స అవసరమో అన్నీ తెలుస్తాయి.

నిర్ధారణ పరీక్ష

పురుషుల్లో సంతానలేమికి ఆండ్రాలజిస్టు వివిధ నిర్ధారణ పరీక్షలు సూచిస్తారు. వ్యక్తిలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థ (రీ ప్రొడక్టివ్‌ సిస్టమ్‌) ఎలా పనిచేస్తుంది. వృషణాల సైజు సరిగ్గానే ఉందా? నాళాలేమైనా మూసుకుపోయాయా? అనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ లోపాలేమైనా ఉంటే అవి పుట్టుకతో ఉన్నాయా? మధ్యలో వచ్చాయా? చికిత్స ద్వారా నయం చేసే అవకాశాలున్నాయా? అనేది పరిశీలిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత పురుష పునరుత్పత్తిలో అత్యంత కీలకమైన ‘కంప్లీట్‌ సెమెన్‌ ఎనాలసిస్‌’ (పూర్తిస్థాయి వీర్య కణాల సామర్థ్య పరీక్ష) చేస్తారు. ఇందులో చాలా రకాల రిపోర్ట్స్‌, స్టాండర్డ్స్‌ ఉంటాయి. అయితే ఇవి ప్రతిఏడాదీ మారుతూ ఉండవచ్చు. 40 ఏళ్లక్రితం వీర్య కణాల సంఖ్య (స్పెర్మ్‌ కౌంట్‌) అనేది ఒక మి.లీ.కు 50 మిలియన్లు ఉంటే నార్మల్‌గా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నిర్వచనం ప్రకారం అది మారింది. ఒక మి.లీ. వీర్యంలో 20 మిలియన్ల వీర్య కణాలు ఉంటే దానిని నార్మల్‌గా గుర్తించింది. అంటే ఒక పురుషుడిలో వీర్య కణాల సంఖ్య 20 మిలియన్లుంటే సంతాన సామర్థ్యం కలిగి ఉన్నట్లు లెక్క. అంతకంటే తక్కువుంటే వైద్యుని సలహా ప్రకారం చికిత్స తీసుకోవాలి.

ఇతర కారణాలు-చికిత్స

వృషణాల నుండి వచ్చే రక్త సిర ఏదైతే రక్తాన్ని గుండెకు తీసుకెళ్తుందో ఆ సిరలో వాపు రావడంవల్ల వెరికోసిల్‌ అనే సమస్య ప్రారంభమవుతుంది. టెస్టిస్‌లో సాధారణంగా శరీరంలోకంటే వేడి తక్కువగా ఉండాలి. వెరికోసిల్‌ సమస్యవల్ల ఆ వేడి పెరిగి, వీర్యోత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల కూడా సంతానలేమి ఏర్పడుతుంది. వెరికోసిల్‌ ఉందా? లేదా? అనేది డాక్టర్‌ పరీక్షించడం ద్వారా గానీ, డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారాగానీ తెలుసుకోవచ్చు.

ఇవేగాక పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు వాడటం, మద్యం సేవించడం, వేడి ఎక్కువగా ఉండే చోట పనిచేసేవాళ్లల్లో, ఇంజిన్ల దగ్గర, రైల్వే ఇంజిన్లో పనిచేసే వారు వేడికి ఎక్స్‌పోజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో వీర్యోత్పత్తి తగ్గితే వృత్తిని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. వీటితోపాటు దీర్ఘ కాలిక వ్యాధులున్నా సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా టిబి, ఇతర వ్యాధులేమైనా ఉంటే వాటికి చికిత్స ఇస్తూనే సంతానలేమి సమస్యకు కూడా చికిత్స అందించవచ్చు. అందుకోసం ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల మెడిసిన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

వీర్య కణాల సంఖ్య, ఉత్పత్తి పెంచడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వాడినా ఫలితం లేదన్నప్పుడు ఇతర చికిత్సలు ప్రారంభించాల్సి ఉంటుంది. అసలు వీర్య కణాలు ఉన్నాయా లేవా? అనేది టెస్టికల్‌ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి టెస్టిస్‌లో వీర్యం నమూనా తీసి పరిశీలించి, చికిత్స అందించాల్సి ఉంటుంది.

వెరికోసిల్‌ సమస్యవల్ల సంతానం కలగకపోతే మైక్రోస్కోపిక్‌ వెరికోసిలెక్టమీ అనే ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేసి, సంతానలేమిని నివారించవచ్చు. ఈ చికిత్స చేశాక కూడా కొందరిలో వీర్యోత్పత్తి జరగక, సంతానం కలుగకపోతే ఐయుఐ పద్ధతిద్వారా వీర్యాన్ని టెస్టిస్‌ నుంచి ఇంజెక్షన్‌ ద్వారా తీసి, మైక్రోస్కోప్‌లో చూసి, వాటిని భార్య యొక్క యుట్రెస్‌లో ఇంజెక్ట్‌ చేస్తారు. నిపుణులైన వైద్యులే దీనిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సంతాన సాఫల్యం పొందవచ్చు. ఇది కూడా సక్సెస్‌ కానప్పుడు చివరగా ఐవిఎఫ్‌ చికిత్స (‘టెస్ట్‌ ట్యూబ్‌ బేబి’)తో బిడ్డలను పొందవచ్చు.

ఏ చికిత్సవల్లా సంతానం కలగనప్పుడు చివరగా 4, 5 వీర్య కణాలను తీసుకొని, భార్య అండాశయం నుంచి అండాలను తీసుకొని మైక్రోస్కోప్‌లో చూస్తూ వీర్య కణాలను అండంలోకి ఇంజెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్‌లో, నిపుణులైన డాక్టర్లు చేయాల్సి ఉంటుంది.

అసలు భర్తలో వీర్యం, వీర్య కణాలే లేనప్పుడు, మందులు, చికిత్స ద్వారా కూడా ఫలితం లేనప్పుడు’ స్పెర్మ్‌ డోనార్స్‌’ ద్వారా ల్యాబ్‌లో సేకరించిన వీర్యాన్ని భార్య గర్భంలోకి ప్రవేశపెట్టి సంతాన సాఫల్యం చేకూర్చవచ్చు. ఇక్కడ వీర్యం ఎవరి ద్వారా స్వీకరించింది కూడా తెలియదు. దాదాపుగా వీర్యాన్ని ప్రవేశపెట్టినప్పుడు కలిగిన సంతానంలో 50 శాతం వారి వారి ఫ్యామిలీ జీన్స్‌ మాత్రమే వస్తాయి.

– డాక్టర్‌ వంశీకృష్ణ

యూరాలజిస్టు అండ్‌ ఆండ్రాలజిస్టు,

డా|| రామయ్య ప్రమీల యూరాలజీ సెంటర్‌, హైదరాబాద్‌.
ఫోన్‌: 9490190102

(ప్రజాశక్తి దినపత్రిక, ౨౧ జనవరి ౧౪)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.