బరువు తగ్గితే ఆరోగ్యం
October 26, 2010
డిఎన్‌ఏలో నుదుటి వ్రాత
October 26, 2010

 పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది.

సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణావల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.

గ్యాస్ తయారవటం అనేది సహజమైన శారీరక క్రియ. కనుక దానిని అడ్డుకోలేక పోయినప్పటికీ, కొన్ని చిన్న, చిన్న గృహ చికిత్సల ద్వారా ఆహార వ్యవహారాల్లో మార్పులు, చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

లక్షణాలు

గ్యాస్ సమస్య కలిగినవారికి సంకల్పంతోగాని, అసంకల్పితంగా గానీ గ్యాస్ విడుదలవుతుంటుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృతం కాకుండా త్వరిత గతిన మారుతుంటుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్లు అనిపించవచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా గాని లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా గాని భ్రమకలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్లు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

కారణాలు

*మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలిని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడుగాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం

*ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం.

*ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.

*పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలూ, ఈసబ్‌గోల్ వంటి తంతుయుత పదార్థాలూ అరగకపోవటం.

*సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.

*ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్).

*యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).

*విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గాని వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).

*మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్).

*గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం(గ్లూటెన్ ఇంటాలరెన్స్).

*ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం).

ఇవన్నీ గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణాలు. వీటిమీద అవగాహన ఉంటే గ్యాస్‌ని నిరోధించుకోవచ్చు.

ఆయుర్వేద చికిత్సలు, సూచనలుఆహార విధానం 

 గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ అందిరోనూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పినీ కలిగించవు. చాలా మందిలో గ్యాస్ కలిగించే ఆహారాలను అధ్యయనకారులు గుర్తించారు. అవి: చిక్కుళ్లు, ఉల్లిపాయ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, యాపల్స్, జల్లించని గోధుమపిండి, కోడిగుడ్డు, శనగపిండి వంటకాలు తదితరాలు.

వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడిగాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి.

పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్‌మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటిగాని, రిఫ్లక్స్ గాని ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.

జీవన విధానం

ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పడుగు గాని, గాభరాగా ఉన్నప్పుడు గాని, హడావిడిగా ఉన్నప్పుడు గాని తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.

ఔషధ విధానం

*ఉదర కండరాల మీద టర్‌పెంటైన్ ఆయిల్‌ని వేడిచేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనితో ఉదరకండరాల్లో స్తబ్దత తగ్గి ప్రేగుల కండరాలు వదులవుతాయి. ఫలితంగా గ్యాస్ తప్పించుకొని ఉపశమనం లభిస్తుంది.

* వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.

* అవసరమైతే వాముతో తయారైన అజమోదార్కం అనే ఔషధాన్ని కూడా మోతాదుకు రెండు పెద్ద చెంచాలు చొప్పున తీసుకోవచ్చు.

* ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు.

*జీలకర్ర (2 భాగాలు), శొంఠి (4 భాగాలు), ఉప్పు (1 భాగం), శంఖభస్మం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) (2 భాగాలు) వీటన్నింటినీ మెత్తగా నూరి, నిష్పత్తి ప్రకారం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి.

*ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి.

*వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయ, సాయంకాలాలు పుచ్చుకోవాలి.

*నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.

*త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసరికాయ వలుపు), త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) వీటి చూర్ణాన్ని సమ భాగాలుగా తీసుకుని కలిపి కషాయం తయారు చేసుకొని తాగాలి.

*నల్లజీలకర్ర (కలౌంజి) గింజలు (4 భాగాలు), శొంఠి (2 భాగాలు), నల్ల ఉప్పు (1 భాగం), శంఖభస్మం (1 భాగం) నిష్పత్తిలో తీసుకొని దంచి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని 3-6 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి.

* నింబూపానకం: 6 భాగాలు నిమ్మరసానికి 5 భాగాలు పంచదార కలిపి పానకం తయారు చేసుకోవాలి. దీనిని 2 చెంచాల మోతాదుగా, నీళ్ళతో కలిపి పుచ్చుకోవాలి.

 డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.