పైసా ఖర్చు లేని మందు ఇది………..
July 30, 2011
రోగాసుర మర్దనం
August 23, 2011

పోత పాలు వద్దు.. తల్లి పాలే మేలు

తల్లిపాలు ప్రకృతి ప్రసాదించినవరం. మహిళల జీవితంలో ‘గర్భధారణ – కాన్పు – బిడ్డలకు పాలు పట్టుట’. ఆమె నిర్వహించే ప్రాకృతిక ధర్మాలలో కొన్ని దశలు. గర్భధారణ – కాన్పు నుండి పాలు పట్టుటను వేరు చేయలేము!

చిన్నారి పుట్టినప్పటి నుండి తనతో మాట్లాడాలని తనను తాకాలని, తనను ఆడించాలని తల్లి నుండి ఇతరుల నుండి కోరుకుంటుంది. ఈ చర్యలన్నీ శిశు ఆరోగ్యానికి, శారీరక మానసికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ చర్యలన్నీ అమ్మబిడ్డకు పాలు పట్టడం ద్వారా ఇవ్వగలుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, అంతరించిపోతున్న తల్లిపాల సంస్కృతివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక జబ్బులతో లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు.

సమస్యంతా పారిశ్రామికీకరణ తీవ్ర దశలో (దాదాపు క్రీ.శ. 1850 ప్రాంతం నుండి) మొదలయింది. చాలామంది మహిళలు ఉద్యోగినులుగా పరిశ్రమలలో చేరారు. బిడ్డలకు పాలుపట్టడం కష్టమయింది. పారిశ్రామిక వేత్తలలో ‘పని గంటలు వృథా’ అనే భావం ఏర్పడింది. వ్యాపార దృక్పథం పెరుగుట మొదలయింది.

తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా పాలపొడులొచ్చాయి. పాలపొడుల ఉత్పత్తి ఎక్కువగా బహుళజాతి సంస్థల చేతుల్లో ఉన్నది. ప్రకటనలతో, ప్రోత్సాహకాలతో ఉత్పత్తి మరియు వాడకం పెంచారు. పోతపాల సంస్కృతి ఆధునికతకు చిహ్నంగా మారింది. సహాయం రూపంలో, సబ్సిడీల రూపంలో పారిశ్రామిక దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చినవి. పట్టణాల నుండి పలెల్లకు విస్తరించినవి. ధనవంతులే గాకుండా బీదవారు కూడా ఆకర్షితులయ్యారు. డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తమవంతు సహాయం చేశారు.

మనకు పరిశుభ్రమైన నీరు లేదు. పాలసీసాలు, పాలపీకలు స్టెరిలయిజ చేసే వసతులు లేవు. పాలపొడులను వాడే విధానాన్ని తెలుసుకునే చదువులేదు. పాలపొడులు కొనుటకు డబ్బులేదు. ఫలితంగా పోతపాల వాడకంవల్ల పిల్లలు సూక్ష్మజీవుల బారిన పడుట వ్యాధులు, మరణం దాపురించుట జరిగింది.

చిన్నపిల్లల రక్షణకు పనిచేసే అనేకమంది వ్యక్తులు, సంస్థలు ఈ సమస్యను గుర్తించాయి. ఎన్నో ఉద్యమాలు చేపట్టాయి. ఈ ఉద్యమాల స్థాయి అనేక ఆటు పోట్లతో ఒక దశకు చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసిఫ్ గుర్తించాయి.

1981లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాలపొడుల పంపిణీకి కొన్నిమార్గదర్శక సూత్రాలు ప్రకటించింది. పాలపొడి ఉత్పత్తిదారులు ఎలాంటి ప్రకటనలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, బహుమతులు, పాలడబ్బాలపై ఆకర్షణీయమైన బొమ్మలు, స్కాలర్‌షిప్స్, మీటింగులకు సహకారం లాంటివి ఇవ్వరాదని సూచించింది. ఈ మార్గదర్శక సూత్రాలను చాలా దేశాలు అంగీకరించాలి. ఈ మార్గదర్శక సూత్రాలను చివరిగా అంగీకరించిన దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు.

అంతర్జాతీయ పాలపొడుల ఉత్పత్తిదారుల సమాఖ్య 1990 నాటికి ఆసుపత్రులకు ఉచితంగా పాలపొడులు ఇచ్చుట, సబ్సిడీలతో పాలపొడులు అమ్ముట స్వచ్ఛందంగా విరమించుటకు అంగీకరించినవి. పైమార్గదర్శక సూత్రాల ననుసరించి కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. మన దేశంలో 1992లో మన పార్లమెంట్‌లో ‘శిశు ఆహార చట్టం చేశారు’. ఈ చట్టం ఆగస్టు 1, 1993 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని గురించి సమాజంలో తగినంత అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత, చిత్తశుద్ధితో అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పుడు చాలామంది మహిళలు వస్తుత్పత్తిలో పాలుపంచుకొనుచున్నారు. ఇందువల్ల పిల్లలకు పాలు పట్టుటలో మన మహిళలు కొన్ని సమస్యల నెదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు 6 నెలల ప్రసూతి సెలవు, పిల్లల పెంపకం సెలవు ఎంతో వెసులుబాటు కలిగిస్తున్నవి. అసంఘటిత రంగంలోని మహిళలకు ఎలాంటి సహకారం లేదు. పాలిచ్చే తల్లులకు కుటుంబ సభ్యులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, సమాజం, ప్రభుత్వాలు ఎంతో సహకారం అందించాలి.

వైద్యవిద్యార్థుల నర్సింగు విద్యార్థుల పాఠ్యాంశాల్లో తల్లిపాల సంస్కృతి గురించి బోధన తగినంత జరగటం లేదు. బోధనాంశాల్లో గణనీయమైన మార్పు చేసి, వారిలో అవగాహన పెంచాలి.

ప్రత్యామ్నాయాలు వాడకుండా ఉండే తలుల్లందరూ విజయవంతంగా పిల్లలను తమ పాలతోనే పెంచవచ్చు. ఈ వాస్తవంపై మునుపెన్నడూ లేనంత శాస్ర్తియ ఏకాభిప్రాయం ఇప్పుడు ఉంది. బిడ్డపుట్టిన మొదటి గంటలోనే పిల్లలకు పాలు పట్టుట మొదలు పెట్టాలి. పాలు పట్టుటలో ఎలాంటి టైమింగ్స్ పాటించరాదు. పిల్లలకు ఎప్పుడు అవసరమయితే అప్పుడు పాలు పట్టాలి. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలే పట్టాలి. సంతృప్తికరమైన పెరుగుదల, రోజుకు ఆరుసార్ల కన్నా ఎక్కువగా మూత్రవిసర్జన పిల్లలో ఉండే వారికి తల్లిపాలు సరిపోతున్నట్లే. ఆరవ నెలలో ఇంటిలో తయారుచేసిన అదనపు ఆహారం మొదలు పెట్టండి. 2 సంవత్సరాలు, ఆ పైబడి అదనపు ఆహారంతో తల్లిపాలు పడుతూ ఉండండి. చిన్న పిల్లల ఆరోగ్యం, ఆహారం, అభివృద్ధి మానవ హక్కుల సమస్యగా అనేక అంతర్జాతీయ ఒప్పందాలలో పొందుపరిచారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందేశం. ‘‘యాక్ టుమి! బ్రెస్ట్ ఫీడింగ్ – ఎత్రీడి ఎక్సీపిరియన్స్?’’ తల్లిపాలను గురించి అందరూ, అన్ని రకాలుగా మాట్లాడండి. సార్వత్రిక తల్లిపాల సంస్కృతికి మరోసారి అవకాశమిద్దాం. మనమందరమూ తల్లిపాల గురించే మాట్లాడుదాం! పోతపాల గురించి అందరము దశలవారీగా మరచిపోదాము!

– డాక్టర్ ఆరవీటి రామయోగయ్య

E-mail: [email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక, 2 ఆగస్టు 2011)

2 Comments

  1. rameshraju says:

    ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో బాలింతలు పొంగాపు నీళ్ళు సేవిస్తారు. మట్టి పొయ్యి లేదా గ్యాస్ స్టౌ మీద అన్నం ఉడికే సమయంలో పొంగే నురగను గ్లాసు నిండా సేకరించి మద్యాహ్నం భోజన సమయంలో సేవిస్తారు. ఈ విధంగా సేకరించిన నురగను పొంగాపు నీళ్ళు అని అంటారు. ఇలా సేవిస్తే తల్లిపాలు అమోఘంగా అతి తక్కువ సమయంలో తయారవుతాయి. ఈ నీళ్ళలో చిటికెడు ఉప్పు లేదా పాలు లేదా మజ్జిగ కలుపుని సేవించవచ్చు. ఈ అవకాశం లేని వారు రెడ్డివారి నానుబాలు (యూఫోర్బియా హిర్తా) మొక్కల ఆకులను కూరగా చేసుకొని తినాలి, లేదా పొన్నగంటి కూర ఆకులను లేదా పచ్చి బొప్పాయి కూర తినాలి. బాలింతలు ఎక్కువగా మసాలాలు, వాతం చేసే పదార్ధాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

  2. rameshraju says:

    సాధారణంగా బియ్యం ఉడికించాలంటే 1 ఒంతు బియ్యానికి 2 వంతులు నీళ్ళు పోస్తాం. అలా కాకుండా 1 వంతు బియ్యానికి 4 వంతుల నీళ్ళు పోసి బియ్యాన్ని కొద్దిగా బుడగలు వచ్చేలా ఉడికించి , అందులోంచి 2 వంతుల నీళ్ళను గిన్నెలో సేకరించాలి. ఈ నీళ్ళలో కొద్దిగా మజ్జిగ లేదా కొద్దిగా పాలు కలిపి బాలింతలు సేవిస్తే అద్భుతరీతిలో కొద్ది గంటల్లోనే తల్లిపాలు తయారవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.