వెన్నెముక అరిగినపుడు…
August 27, 2011
మధుమేహం అత్యంత ప్రమాదకారి
September 27, 2011

ప్రొస్టేట్ కేన్సర్‌ను పసిగట్టేదెలా?

భారతదేశంలో మగవారిలో అత్యధికులలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తున్నది అని డాక్టరు బి. త్యాగి బృందము (Asian Pac J Cancer Prev. 2010;11(2):397-401) 2010;11(2):397401) తెలియ జేసింది. ప్రోస్టేటు గ్రంధి మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. వీర్యములో ఇరవై శాతము ప్రోస్టేటు గ్రంధి నుండి విడుదల అయిన ద్రవంతో పాటు మగ బీజాలు, సెమినల్ వేసైకల్సు నుండి వచ్చిన ద్రవం ఉంటాయి. ప్రోస్టేట్ కేన్సరు లక్షణాలు ఏమిటంటే ప్రయత్నించినా మూత్రం పోదు, మూత్రము పోవాలని గట్టి ప్రయత్నం చేస్తేనే మూత్రం వస్తుంది. ఒకసారి మొదలుపెడితే మూత్రం ఆగదు. రాత్రిపూట ఎక్కువసార్లు లేవటం, మూత్రపు ధార సన్నబడుట, మూత్రం పోసుకునేప్పుడు మంట లేదా రక్తము పోవటం కనిపిస్తుంది.

మగవారిలో అందులోనూ ముసలివారిలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తుంది. ప్రోస్టేటు కేన్సరు అమెరికాలో 217,730 మందికి సోకితో అందులో 32,000 మంది చనిపోతారు. భారతదేశంలో ప్రోస్టేటు కేన్సరుతో ఎంతమంది చనిపోతారో తెలియదు. కాని డాక్టరు బి. త్యాగి రిపోర్టు ప్రకారం ఎక్కువమందే చనిపోతారు అని ఊహించవచ్చు. ప్రోస్టేటు కేన్సరును ప్రాథమిక దశలో కనుగొనలేమా? ప్రోస్టేటు కేన్సరును మూడు రకాలుగా కనుగొనవచ్చును.

 

శరీర పరీక్షను చేసినప్పుడు గ్రుధము ద్వారా గ్లవు వేసుకొన్న వేలితో ప్రోస్టేటును పరీక్ష చేసి కాయ ఉందో లేదో తెలుసుకోవచ్చును. ఆ కాయ నుండి సూదితో ముక్కతీసి (బయాప్సి) ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకోవచ్చును. లేదా రక్త పరీక్ష చేసి ‘‘ప్రోస్టేట్ స్పెసిఫిక్కు ఏంజిజెన్’’ పి.ఎస్.ఎ. ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకుని ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకోవచ్చును. అంతకన్నా సులువుగా ప్రోస్టేటు కేన్సరు ఉందో లేదో తెలుసుకొనుటకు మూత్ర పరీక్ష చేసి ఆ మూత్రములో ‘‘ఇ యన్ 1’’ అనే ప్రోటీను ఉంటే ఆ పురుషుడికి ప్రోస్టేటు కేన్సరు ఉందని చెప్పవచ్చు అని యూనివర్శిటీ ఆఫ్ సర్రీ (ఇంగ్లాండు)లో పని చేస్తున్న డాక్టరు ఆర్ మోర్గను ‘‘క్లినికల్ కేన్సర్ రిసెర్చ్’’ అనే పత్రికలో తెలియజేశారు.

ఏదైనా కేన్సరు వస్తే శస్త్ర చికిత్స లేదా రేడియో ధార్మిక చికిత్స చేయవచ్చును. కాని ప్రోస్టేటు కేన్సరు వచ్చిన వారు ఎక్కువ కాలం బ్రతకరు కాబట్టి ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చు. (వాచ్పుల్ వెయిటింగ్) అంటున్నారు కొందరు వైద్యులు. వేచి చూడవచ్చునో (వాచ్పుల్ వెయిటింగ్) లేదో రోగి తేల్చుకోవాలి. ‘‘ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చును అన్నవారు కేన్సరు వల్లన ఏమవుతుందో అని భయపడలేదు’’ అని డాక్టరు బి.జె. డేవిసన్ (BJU Int. 2011 Apr 20) 2011Apr 20) కెనడా దేశంలో పరిశోధన చేసి చెప్పారు. డాక్టరు ఆనాబిల్ ఏక్సల్ బృందం (N Engl J Med. 2011 May 5;364(18):1708-17) వారు స్వీఢన్ దేశంలో పరిశోధన చేసి ‘‘వాచ్పుల్ వెయిటింగ్’’ కన్న ఆపరేషను చేస్తేనే ఎక్కువమంది బ్రతికారు అని చెపుతున్నారు.

రేడియో ధార్మిక కిరణాలతో కూడా ప్రోస్టేటు కేన్సరుకి చికిత్స చేయవచ్చును. రేడియో ధార్మిక చికిత్స కోసం రోగి ఆసుపత్రిలో చేరవలసిన అవసరము లేదు ‘‘రేడియో ఎక్టివు సీడ్లు’’ను ఉపయోగించి కేన్సరు ఉన్న ప్రోస్టేటు గ్రంధిలో ఉన్న కేన్సరుకు చికిత్స చేయవచ్చు. ప్రోస్టేటు కేన్సరు ముదిరిపోతే హార్మోనులు ఇచ్చి చికిత్స చేయవచ్చు.
ఏ రకమైన చికిత్స చేసినా కాంప్లికేషన్లు వస్తాయి. ప్రోస్టేటు కేన్సరుకి చికిత్స చేసినప్పుడు నీరుడు పోకుండా ఆపలేక పోవటం, లేపన శక్తిని కోల్పోవటం మొదలుగు కాంప్లికేషన్లు వస్తాయి. అందువల్లనే ఆపరేషను లేకుండా వేచి చూడవచ్చు.

భారత దేశంలో జనాభా పెరిగిపోతున్నది. ప్రజలు మునపటివలె కాక ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు. జనాభాలో సగం మంది మగవారు కాబట్టి వారిలో కొందరికి ప్రోస్టేటు కేన్సరు రావచ్చును. ఏ రకమైన వైద్యం చేసినా కాంప్లికేషన్లు వస్తాయి కాబట్టి ప్రాథమిక దశలోనే కేన్సరును కనుగొంటే ప్రాణానికి అపాయం లేకుండా చికిత్స చేయవచ్చును. అందుకే ప్రోస్టేటు కేన్సర్‌ను ప్రాథమిక దశలోనో కనుగొనుటకు పరీక్షలు చేసే ప్రోగ్రామును చేపట్టాలి.

– డా. గవరసాన సత్యనారాయణ

[email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక, 13 july 2011)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.