నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం
April 26, 2014
usiri
ఉసిరితో ఎన్నో ఉపయోగాలు
July 15, 2014

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు రెట్లు అధికం. వైద్య పరిభాషలో ఈ రాళ్లను ‘రీనల్‌ కాల్సిక్‌’ అంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో మూత్రనాళంలోగానీ, మూత్రాశయంలోగానీ ఏర్పడవచ్చు.

కారణాలు

రక్తంలో కాల్షియం, ఫాస్పరస్‌, యూరిక్‌ యాసిడ్‌ లవణాలు, అధికంగా ఉండటంవల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. శరీరానికి సరిపోను నీళ్లు తాగకపోవడం, తాగిన నీరు కూడా ఎక్కువగా చెమట రూపంలో బయటకు వెళ్లడం, లవణాల శాతం అధికం అవడం కూడా సమస్యకు దారితీస్తుంది. ఇలాంటప్పుడు సాంద్రత పెరిగి అవి క్రిస్టల్స్‌గా మారి రాళ్లుగా మారతాయి. ఇవి కిడ్నీలో లోపలి భాగంలో నిల్వ ఉంటాయి. మనం తినే ఆహారంలోని రాళ్లకు, కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదు.

రాళ్ల రకాలు

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు ఐదు రకాలుగా ఉంటాయి. కాల్షియం ఆక్సలైట్‌ రాళ్లు, కాల్షియం ఫాస్పేట్‌ రాళ్లు, యూరేట్‌ రాళ్లు, ట్రిపుల్‌ ఫాస్ఫేట్‌ రాళ్లు. సిస్టిన్‌ రాళ్లు. ఈ రాళ్లు చిన్న గింజ సైజు మొదలుకొని, చిన్న పండు సైజు దాకా ఏర్పడవచ్చు. ఇవి కిడ్నీలోగానీ, మూత్రాశయంలోగానీ కదలకుండా ఉంటే బాధకలిగించవు.

ఆక్సిలైట్‌ కాల్షియం రాళ్లు : మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉండటం, మూత్ర విసర్జనలో అవరోధం ఏర్పడటం, ప్రొస్టేట్‌ గ్రంథి (పురుషుల్లో) పెద్దదైనప్పుడు మంచం మీద చాలా కాలంగా ఉండే వారిలో, శారీరక శ్రమలేని వారిలో, వ్యాయామం లేని వారిలో, బద్ధకంగా ఒకే చోట కూర్చునే వారిలో ఈ రాళ్లు ఏర్పడతాయి.

సిస్టన్‌ రాళ్లు : నీళ్లు తక్కువగా తాగే వారిలో, అతిగా చెమటలు పోసేవారిలో, రక్తంలో లవణాల సాంద్రత పెరిగి ఈ రాళ్లుఏర్పడతాయి. విటమిన్‌-సి, విటమిన్‌-డి అధికంగా తీసుకునే వారిలో, ఎక్కువ గా చెమట పోసే ఉష్ణమండలంలో ఉండే వారిలో, రాళ్లు ఏర్పడే శరీర తత్వం గలవారిలో ఇవి ఏర్పడతాయి.

లక్షణాలు

kidney-stonesనడుము పైభాగాన నొప్పి మొదలవుతుంది. పొత్తికడుపు దాకా వ్యాపించి, అక్కడి నుంచి వృషణాల దాకగానీ, పురుషాంగం దాకగానీ వ్యాపిస్తుంది. స్త్రీలలో జననేంద్రియాల దాకా కూడా వ్యాపిస్తుంది. మూత్రపిండం నుండి, మూత్రనాళం ద్వారా మూత్రాశయం వరకు వెళ్లేటప్పుడు అలలు, అలలుగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. నొప్పితోపాటు వాంతులవుతాయి. చెమటలుపోస్తాయి. మూత్ర విసర్జనలో మంటగా ఉంటుంది. వణుకుతో కూడిన జ్వరం, మూత్రంలో రక్తం, మాటిమాటికీ మూత్రం రావడం వంటివి ప్రధాన లక్షణాలు. చిన్న సైజు రాళ్లు ఏర్పడటానికి నెల, రెండు నెలలు పడితే, పెద్దసైజు రాళ్లకు సంవత్సరాలు పట్టవచ్చు.
నిర్ధారణ: మూత్రపరీక్ష, మూత్రంలో రక్తంలో, చీము, క్రిస్టల్స్‌ కనిపించడం, ఎక్స్‌రే, కె.యు.బి., సి.టి స్కాన్‌, ఎంఆర్‌ఐ ద్వారా నిర్ధారించవచ్చు.

అనర్ధాలు: మూత్రపిండంలో చీము చేరి కిడ్నీలు పాడవుతాయి.

చికిత్స

కిడ్నీరాళ్లు 5 మిల్లీమీటర్ల సైజులో ఉంటే గనుక, ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవి బయటికి వెళ్తాయి. 5 నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటే బయటికి వెళ్లడం కష్టం. శస్త్రచికిత్స ద్వారా వీటిని బయటికి తీస్తారు.

శస్త్రచికిత్స

లితోట్రిప్సి, యురిటిరో స్కోపి ద్వారా పర్‌కుటేనియస్‌ నెఫ్రొలిథాటమి ద్వారా, ఎక్స్‌ట్రా కార్పొరియల్‌, షాక్‌వేవ్‌ లిథొట్రిప్సి ద్వారా లేదా ఓపెన్‌ సర్జరీ ద్వారా రాళ్లను తొలగిస్తారు. ఇప్పుడు లేజర్‌ చికిత్స కూడా అందుబాటులో ఉంది. ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు సూచించిన యాంటీ బయాటిక్స్‌ వాడాలి.

జాగ్రత్తలు

రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి.వ్యాయామం అవసరం. కాల్షియం పదార్థాలు పాలు, వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులు, టమాట, పాలకూర, క్యాబేజి వాడకం తగ్గించాలి. కిడ్నీ ఫెయిల్యూర్‌లో పొటాషియం ఎక్కువ ఉంటే కొబ్బరి నీళ్లు తాగకూడదు.

– డాక్టర్‌ హోసూరు కృష్ణమూర్తి
సీనియర్‌ ఫిజీషియన్‌
ఎం.వి.ఎన్‌.ఎం.ఆర్‌. ప్రజావైద్యశాల
హైదరాబాద్‌.

(ప్రజాశక్తి దినపత్రిక, 20 మే)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.