మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు

నడుమునొప్పి నిర్లక్ష్యం చేయొద్దు
May 17, 2011
మగవారిలో సంతానలేమికి ఎన్నెన్నో కారణాలు
May 31, 2011

మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు

మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో వివరించిన అర్ధావభేదం (తల సగభాగంలో నొప్పి), అనంతవాతం (తరచూ తలనొప్పి తిరగబెడుతుండటం) అనే వ్యాధుల వర్ణన మైగ్రెయిన్ వ్యాధి లక్షణాలతో సరిపోతుంది.

కారణాలు

మైగ్రెయిన్ తలనొప్పికి స్పష్టమైన కారణాలు తెలియవు. అయితే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు మొదలైనవాటిని కొన్నిటిని వైద్య శాస్తవ్రేత్తలు కారణాలుగా భావిస్తున్నారు. ఆయుర్వేదంలో ‘అసాత్మేంద్రియార్థ సంయోగం’ అనేదాన్ని ఒక ప్రధాన హేతువుగా చెప్పారు. చూపు, రుచి, వాసన, స్పర్శ వంటి జ్ఞానేంద్రియ విధులు అసహజమైన రీతిలో జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది. వీటిని గమనించి తగినచర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ తగ్గించుకోవచ్చు’.

మైగ్రెయిన్ బయటపడడానికి ముందు తలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ముందుగా శరీరాంతర్గతమైన లేదా వాతావరణపరమైన అంశం ప్రేరకంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ దీనికి ప్రతిస్పందించి విద్యుదావేశాన్ని మెదడంతా పరుచుకునేలా చేస్తుంది. విద్యుత్ చర్యవల్ల మెదడులోని కణజాలాలు కొన్నిరకాల జీవరసాయనాలను విడుదల చేస్తాయి. వీటివల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి పటిష్టతను కోల్పోతాయి. వీటి గోడల నుండి ప్రేరకపదార్థాలు తప్పించుకొని మెదడు అడుగుకు చేరుకొని అక్కడ ఉండే నొప్పిగ్రాహక కేంద్రాలను చేరుకొని తలనొప్పికి కారణమవుతాయి. ఇది మైగ్రెయిన్ ప్రాప్తించే విధానాన్ని తెలిపే ఒక ప్రతిపాదిత సిద్ధాంతం (హైపోథిసిస్).

లక్షణాలు

మైగ్రెయిన్ తలనొప్పి సాధారణంగా మూడు దశలుగా వస్తుంటుంది. మొదటిది హెచ్చరిక దశ. రెండవది ఆరా లేక పూర్వరూపదశ. మూడవది పూర్తిస్థాయి రూపదశ.

మొదటిదశ మైగ్రెయిన్‌కు ముందు హెచ్చరికపూర్వకమైన లక్షణాలతో మొదలవుతుంది. మానసిక స్థితిలోను, మూడ్‌లోను మార్పు రావటం, నీరసం, కడుపుబ్బరింపు, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ఆవలింతలు, ఆహారపదార్థాలపట్ల మితిమీరిన వ్యామోహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పికి కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

రెండవ దశ ఆరా. ఇది మైగ్రెయిన్‌కు ముందు పూర్వరూపాలతో కనిపించే స్థితి. దీని లక్షణాలు పావుగంట నుంచి అరగంట వరకూ కొనసాగుతాయి. కళ్ళముందు మెరుపులు మెరిసినట్లు ఉండటం, తాత్కాలికంగాను, పాక్షికంగాను చూపు కోల్పోవటం, మాట్లాడలేకపోవటం, కాళ్ళూ చేతుల్లో బలహీనత ప్రాప్తించటం, ముఖంలోనూ, చేతుల్లోనూ తిమ్మిర్లుగానూ అవిశ్రాంతంగానూ, ఆరాటంగాను అనిపించటం, అయోమయం ఆవహించటం ఇవన్నీ మైగ్రెయిన్‌కు ముందు కనిపించే లక్షణాలు.

అలా కనిపించడం మొదలైన తరువాత, దాదాపు గంట వ్యవధిలో అసలైన మైగ్రెయిన్ లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. మైగ్రెయిన్‌లో సాధారణంగా తలలో ఒక పక్కనే నొప్పి వస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అర్ధావభేదం అంటారు. కొన్ని సందర్భాల్లో రెండు పక్కలా రావచ్చు. తలనొప్పి తీవ్రాతి తీవ్రంగా వస్తుంది. నొప్పి లక్షణం పొడుస్తున్నట్లూ (థ్రాబింగ్) ఉబుకుతున్నట్లూ (పల్లేటింగ్) ఉంటుంది. కదలికతో తలనొప్పి ఎక్కువవుతుంది. అనుబంధ లక్షణాలుగా వాంతులు, వికారం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీళ్ల విరేచనాలు కూడా కావచ్చు. కాంతినీ శబ్దాలనూ సహించలేకపోవటం మైగ్రెయిన్ ప్రధాన లక్షణం. కండరాల నొప్పులు, సలుపులు ఉంటాయి. తల తిరుగుతున్నట్లూ కళ్లు తిరిగి పడిపోతున్నట్లూ అనిపిస్తుంది.

ఉపశయ, అనుపశయాలు

కొన్నిరకాల ఆహార పదార్థాలు. మైగ్రెయిన్ ఎక్కువ చేస్తాయి. వీటిని ఎవరికి వారు గుర్తించుకుని వాటికి దూరంగా ఉండాలి. మెడిటేషన్, మొక్కలను పెంచటం, వ్యాయామం, నడక, మసాజ్, ఆటలు, సంగీతం, పెంపుడు జంతువులతో గడపటం, లలితకళలు – ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహకరిస్తాయి. కొంతమంది నిద్రలో పళ్ళు నూరటం, దవడకండరాలను బిగించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటంవల్ల కండరాలు బిగుసుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది. రిలాక్సేషన్ ప్రక్రియల ద్వారా ఈ అలవాటు నుంచి క్రమంగా బయటపడాలి. గాఢమైన వాసనలను పీల్చకూడదు. ముఖ్యంగా పర్‌ఫ్యూమ్స్, సెంట్లు, అత్తర్లు వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాల నుంచీ దూరంగా ఉండాలి.

సాధారణంగా మైగ్రెయిన్ వచ్చి తగ్గిన తరువాత రక్తంలో చక్కెర మోతాదు తగ్గిపోయి నీరసం వస్తుంటుంది.

ఆయుర్వేద చికిత్స, సూచనలు

తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో ఐస్ నీళ్ళతో తడిపిన చల్లని గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటను ప్రయోగించాలి. దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. తలనొప్పి మొదలైన వెంటనే ఒక చీకటి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మహాచందనాది తైలం వంటివాటితో తలను, కణతలను, అరికాళ్ళను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నిద్రపోవటానికి ప్రయత్నించాలి.

మైగ్రెయిన్‌లో నస్యకర్మవల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది. లక్షణ తీవ్రత, ప్రాబల్యాలను బట్టి సరైన ఔషధ సిద్ధతైలాన్ని నిర్ణయించి ముక్కుద్వారా ప్రయోగించటం నస్యకర్మలోని ప్రధాన ప్రక్రియ. దీనివల్ల తలలోని దోషాలు సమస్థితిలోకి వచ్చి నొప్పి తగ్గుతుంది.

ధార చికిత్స కూడా తలనొప్పి తగ్గుతుంది. మానసిక వత్తిడి ఎదురైనప్పుడు చాలా మందికి నుదురు ప్రాంతంలో చెమట పడుతుంది. కొంతమంది టెన్షన్ తగ్గించుకోవడానికి గాని, ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి గాని నుదురు రుద్దుకుంటారు. దీనినిబట్టి నుదురు అనేది టెన్షన్‌ని బయట పడేసేందుకు తోడ్పడే ముఖ్యమైన ప్రదేశమని మనకు అర్థమవుతుంది. ఆయుర్వేద ‘ధరా చికిత్స’తో ఈ ప్రదేశాన్ని శక్తివంతం చేయవచ్చు. ఔషధ సిద్ధ తైలాన్ని నుదురుమీద ధారగా పడేలా చేయటం దీనిలో ప్రధాన ప్రక్రియ. ఈ చికిత్స మైగ్రెయిన్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా వచ్చే సైకోసొమాటిక్ వ్యాధుల్లో అత్యంత ఉపయోగకారి.

మైగ్రెయిన్‌లో సువర్ణ సూర్తావర్తి, సూతశేకరరసం, దశమూలారిష్టం, గోదంతి భస్మం, ప్రవాళపిష్టి, గుడూచి సత్వం వంటి ఔషధాలు అనేకం నమ్మకంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాను అనుసరించి వాడుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

గృహచికిత్సలు:

తిప్పతీగ స్వరసాన్ని రెండు చెంచాలు మోతాదుగా, తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. అలాగే, ఆవు నెయ్యిలో కుంకుమ పువ్వును వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చాలి. నుదురుకు, కణతలకు చందన లేపాన్ని (మంచి గంధం పేస్టును) రాసుకోవాలి.

– డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

[email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.