అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్ వడ్డించేస్తుంది. టు మినిట్స్ ఫుడ్ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్ ఫుడ్ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు అంటున్నారు ఆహార, ఆరోగ్య నిపుణులు, అధికారులు.
మ్యాగీలో అనారోగ్య కారకాలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంతో, లక్నోలోని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) సంస్థ మ్యాగీ నూడుల్స్ శాంపిల్ తీసుకుని వాటిని పరీక్షల నిమిత్తం కోల్‌కతాకు పంపింది. ఈ పరీక్షల్లో మ్యాగీలో మోనో సోడియం గ్లూటమేట్, (ఎమ్‌ఎస్‌జి), లెడ్, వాటికి అనుమతి ఉన్న పాళ్లను దాటి ఉన్నట్టుగా కనుగొన్నారు. ఎఫ్‌ఎస్‌డిఎ వారు చెబుతున్న దాన్ని బట్టి ఆహార పదార్థాల్లో లెడ్, పది లక్షల పాళ్లు ఆహారానికి 0.01వంతు నుండి 2.5 వంతుల వరకు ఉండవచ్చు. కానీ ఇది మ్యాగీలో ఏకంగా పదిలక్షల పాళ్ల ఆహారంలో 17.2 పాళ్లుగా ఉంది.
లెడ్ మనిషి శరీరంలో ప్రతి అవయవానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ రూపాలీ అనే పోషకాహార నిపుణురాలు ఆహారం, నీరు, మట్టి వీటి ద్వారా మనిషి శరీరంలో లెడ్ చేరే అవకాశం ఉందంటున్నారు. ఇది శరీరంలో కొద్దికొద్దిగా చేరుతూ ఉంటుందని, వెనువెంటనే ప్రమాదం లేకపోయినా కొంతకాలం తరువాత ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. రక్త పరీక్షలో మాత్రమే దీని ఉనికి తెలుస్తుందంటున్నారు. పిల్లలు పెరుగుతుంటారు కనుక ఇది వారికి మరింత ప్రమాదకారకమని రూపాలీ చెబుతున్నారు. పెద్దల్లో కంటే పిల్లల్లో ఇది మరింత వేగంగా జీర్ణం కావడం వల్ల కూడా హానిని కలిగిస్తుందని చెబుతున్నారు.
మ్యాక్స్ ఆసుపత్రిలో డైటీషియన్‌గా ఉన్న డాక్టర్ రితిక చెబుతున్న దాన్ని బట్టి లెడ్ అనే విష పదార్థం కొంతకాలం పాటు శరీరంలో పేరుకుని పోతే
అది మెదడు, లివర్, కిడ్నీ, ఎముకలకు చేరుతుంది. అలాగే శరీరంలో మరిన్ని భాగాల్లో సమస్యలు సృష్టిస్తుందని డాక్టర్ శిఖా శర్మ అంటున్నారు. మ్యాగీ తయారీలో సురక్షిత పద్ధతులను పాటించకపోవడంతో కాలుష్యం వలన కూడా లెడ్ చేరవచ్చని శిఖా చెబుతున్నారు.
ఇక మోనో సోడియం గ్లూటమేట్, (ఎమ్‌ఎస్‌జి) విషయానికి వస్తే ఇది ఈ పేరుతో కాకుండా ప్యాకెట్‌మీద హైడ్రోలైజ్డ్ ప్రొటీన్స్, ఈస్ట్ భాగాలు, లేదా ప్రొటీన్లు ఇలాంటి పేర్లతో ఉంటుంది. అందువలన దీన్ని ప్యాకెట్‌మీద ప్రత్యేకంగా పేర్కొనరు. ఎమ్‌ఎస్‌జి సాధారణంగా టమాటా ఉత్పత్తులు, చీజ్, సోయాబీన్స్, పుట్ట గొడుగులు లాంటి వాటిల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఈ సహజ పదార్థాల్లో కంటే పదార్థాలను నిల్వ ఉంచే ప్రక్రియలో భాగంగా వాటిలో చేరుతోంది. సహజంగా పదార్థాల ద్వారా ఆహారంలో చేరే ఎమ్‌ఎస్‌జి వలన ఎలాంటి హానీ ఉండదని, దీన్ని కృత్రిమంగా తయారుచేసే సింథటిక్ విధానమే హానికరమని డాక్టర్ శిఖా శర్మ చెబుతున్నారు. సింథటిక్ ఎమ్‌ఎస్‌జి గర్భిణులకు, చిన్న పిల్లలకు మరింత హాని చేస్తుందని శిఖా చెబుతున్నారు. సింథటిక్ ఎమ్‌ఎస్‌జి ప్లాసెంటాలోంచి పొట్టలోని చిన్నారికి చేరి సమస్యలు కలిగిస్తుందని శిఖా హెచ్చరిస్తున్నారు. ఎమ్‌ఎస్‌జి కారణంగా తలనొప్పులు, చెమటలు, తలతిరగటం తదితరాలు ఉంటాయని డాక్టర్ రూపాలీ చెబుతుండగా, పరిశోధకులు మాత్రం ఈ విషయాన్ని కచ్ఛితంగా నిర్దారించలేమంటున్నారు.
మాధురీ దీక్షిత్‌కి నోటీసులు
ఇదిలా ఉంటే మ్యాగీకి ప్రచారకర్తగా ఉన్న మాధురీ దీక్షిత్‌కి ఉత్తరా ఖండ్‌లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు నోటీసులు పంపారు. మ్యాగీ అనారోగ్య కారకంగా తేలిన నేపథ్యంలో ఆమె మ్యాగీ ప్రచారం చేయడం, అందులోని పోషక విలువలపై మాట్లాడడంపై 15రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. నియమిత వ్యవధిలో వివరణ ఇవ్వని పక్షంలో ఆమెపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ సెక్యురిటీ అధికారి మహిమానంద్ జోషి తెలిపారు. అలాగే ఉత్తర ప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మ్యాగీ తయారీ కంపెనీ నెస్టెల్ ఇండియాపై త్వరలో కోర్టులో కేసు నమోదు చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మొట్టమొదట మ్యాగీపై పరీక్షలు జరిపింది యుపిలోనే. తరువాత మహారాష్ట్ర, గుజరాత్‌ల్లోనూ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
(సౌజన్యం : ప్రజాశక్తి దినపత్రిక, 31 మే 2015)