రోగాసుర మర్దనం
August 23, 2011
ప్రొస్టేట్ కేన్సర్‌ను పసిగట్టేదెలా?
August 28, 2011

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ తరహా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్నును తిప్పుతూ లేదా వంచుతూ ఏదైనా పని చేసినప్పుడు ఈ రకం నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడుములో కేంద్రీకృతమైనప్పటికీ పిరుదులు, తొడలు, తుంటి భాగాల్లో కూడా నొప్పిగా అనిపించవచ్చు. ఈ తరహా నొప్పి మోకాళ్ళకు మీంచి కిందకు ప్రసరించదు. అలాగే దీనిలో నరంమీద ఒత్తిడి పడదు. కనుక, పాదాల్లో తిమ్మిరిగాని, కాళ్ళు బలహీనపడటం గాని జరగదు.

 

నరాలకు సంబంధించిన న్యూరోజెనిక్ నొప్పి నరం ఇరుక్కుపోవటంవల్ల వస్తుంది. వెన్నునుంచి బయటకు వచ్చే నరాల్లో వాపు ఏర్పడినా, ఒరుసుకుపోయినా, లేదా నలిగినా ఈ తరహా నొప్పి వస్తుంది. ఒక్కోసారి నరాలమీద ఏ రకమైన ఒత్తిడీ లేకపోయినప్పటికీ డిస్కులో పగుళ్ళు ఏర్పడినప్పుడు విడుదలైన రసాయనాలు నరాలను రేగేలా చేసి నొప్పికి కారణమవుతుంటాయి. జాయింట్లు అరిగిపోవడంవల్ల ఏర్పడే మెకానికల్ నొప్పి కంటే నరాలు నలిగినప్పుడు ఉత్పన్నమయ్యే న్యూరోజెనిక్ నొప్పి ప్రమాదకరమైనది. ఈ రకం నొప్పిలో నడుమునొప్పి అంతగా ఉండదు. అయితే నరం ప్రయాణించినంత మేరా లక్షణాలు కనిపిస్తాయి. నరంమీద పడే ఒత్తిడికి కండరాలు ప్రభావితమవటం దీనికి కారణం. దీనివల్ల కండరాలు బలహీన పడటమే కాకుండా ప్రతిచర్యలు ఆలస్యమవుతాయి. నరం ప్రయాణించే మార్గంలో సూదులు గుచ్చినట్లు నొప్పి, మంట, తిమ్మిరి, స్పర్శహాని వంటివి కనిపిస్తాయి. కాళ్ళు బలహీనపడి పక్షవాతం కూడా సంభవించవచ్చు.

వెన్నునొప్పి సంభవించే తీరు

వెన్నెముకలు అరిగిపోయి శిథిలమవటంవల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి నడుమునొప్పి వస్తుంది. అవి: –

(1) డిస్క్ అంచులో పగుళ్ళు ఏర్పడంవల్ల

(2) డిస్క్ శుష్కించిపోవడం (ఇంటర్నల్ డిస్క్ డిస్ప్రప్షన్) వల్ల

(3) డిస్క్ మధ్య భాగం వెలుపలకు చొచ్చుకు రావడంవల్ల

(4) ఫ్యాసెట్ జాయింట్లు వ్యాధి గ్రస్థమై అరిగిపోవడంవల్ల

(5) వెన్నెముకలు ముందుకు జారటంవల్ల

(6) వెన్నెముక లోపలి నాళం మూసుకుపోవడంవల్ల.

ఇంకా… ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవటంవల్ల, వాహనాలు సరిగ్గా నడపకపోవడంవల్ల, అలవికాని బరువులను లేపడంవల్ల, ముందుకు వంగొని పని చేయడంవల్ల. సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామాలు (జనరల్ ఎక్సర్ సైజులు)

గృహ చికిత్సలు:

(1) శొంటి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.

(2) వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి.

(3) పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఆయుర్వేద చికిత్స

నడుమునొప్పిని ఆయుర్వేదంలో కటిశూల అంటారు. ఇదొక వాత ప్రధాన వ్యాధి. దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం, వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

[email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక, 16 ఆగస్టు 2011)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.