సొరియాసిస్‌కు.. శాశ్వత పరిష్కారమా?

అమ్మ కడుపులోనే ఆపరేషన్‌
November 16, 2010
చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష
November 16, 2010

సొరియాసిస్‌కు.. శాశ్వత పరిష్కారమా?

దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సొరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచ జనాభాలో మూడు శాతం! వయోభేదం లేకుండా, స్ర్తి, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సొరియాసిస్ వ్యక్తిగతంనూ, సామాజికంగానూ ఉల్కాపాతాలను సృష్టిస్తోంది.

ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగా ఇబ్బంది పడుతూ, మానసికంగా నలిగిపోతూ ఏదో ఒక అద్భుతం జరిగి కొత్త ఔషధం రాకపోతుందా? తమ సమస్య శాశ్వతంగా తగ్గకపోతుందా అనే ఆశతో.. అంతలోనే ఇనే్నళ్ల నుంచీ లేనిది ముందు రోజుల్లో మాత్రం ఏం జరుగుతుందనే నిరాశతో… పరస్పర విరుద్ధ భావాల సంఘర్షణతో నలిగిపోతున్నారు.

 అయితే ఆయుర్వేద శాస్త్రం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని సాధిస్తే సొరియాసిస్‌ని తేలికాగా నియంత్రించవచ్చు. సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత సాంత్వన చర్యలు చేపట్టి సొరియాసిస్‌తో జీవించటం అలవర్చుకుంటే ఈ వ్యాధి మీద అంతిమ విజయం సాధించవచ్చు.

psoriasis

సొరియాసిస్

సొరియాసిస్ అనేది దీర్ఘకాలంపాటు కొనసాగే చర్మ వ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలసులు కనిపిస్తాయి. ఈ పొడలు ఎరుపుదనాన్నీ, వాపునీ కలిగి ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల తదితర శారీరక భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవ్వచ్చు. మొదట్లో సొరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచేకొద్దీ ఈ మచ్చలపైన చేప పొలసులను పోలిన తెల్లని పొలసులు మందంగా పేరుకుపోతాయి. మచ్చలమీద గీరితే కొవ్వొత్తి తాలికలను పోలిన పొట్టు రాలుతుంది. పొలుసులను తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి.

దురద ప్రధాన లక్షణం కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండి తేమ తగ్గిపోయినప్పడు గాని, ఇనె్ఫక్షన్ల వంటివి తోడైనప్పుడు గాని, తీరుబడిగా ఉన్నప్పుడు గానీ దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-30 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా ప్రాప్తిస్తాయి. సొరియాసిస్ సాధారణంగా కుడి, ఎడమల సమాతను ప్రదర్శిస్తుంది.

ఆయుర్వేద దృక్పథం

సరిగ్గా సోరియాసిస్ వ్యాధిని పోలిన లక్షణాలను ఆయుర్వేద శాస్త్రం వర్ణించింది. చర్మదళం, ఏకకుష్ఠం, సిద్మకుష్ఠం, కిటిభకుష్ఠం అనే వ్యాధుల వర్ణన సొరియాసిస్ తాలూకు వివిధ అవస్థలను పోలి ఉంటుంది. ఆయుర్వేద వైద్య విధానంతో సొరియాసిస్‌ను సమర్థవంతంగా నియంత్రిచవచ్చు. చికిత్సాఫలితాలు ఆహార, వ్యవహార, ఔషధాల సమిష్ఠి ప్రయోగాన్ని బట్టీ, ట్రీట్‌మెంట్ తీసుకునే వారి నైజాన్ని బట్టి, వ్యాధి ఉధృతిని బట్టి ఉంటాయి.

కొంతమందికి ఇరవై రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది. మరికొంత మందిలో ఫలితాలు కనిపించడానికి కనీసం మూడు, నాలుగు నెలలు పడుతుంది. మార్పు కనిపించగానే మందుల వాడకాన్ని నిలిపివేకూడదు. ఒకవేళ వెంటనే ఫలితం కనిపించకపోతే నిరాశ పడకూడదు. నిలకడగా చికిత్స తీసుకోవాలి.

అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది?

మామూలుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్త కణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పై పొరగా ఏర్పడినవి క్రమంగా నిర్జీవమై పొలసులుగా ఊడిపోయి కింద కణాలను బహిర్గతపరుస్తాయి. సొరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపల పొరకు చేరుకుంటాయి. అదనపు కణసముదాయానికి పోషకతత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీనితో చర్మం మీద ఎర్రని పొడ తయారవటమూ, పొలుసులు ఏర్పడటమూ జరుగుతాయి. పాతపొర ఊడిపోవడానికి ముందే కొత్తపొర తయారవ్వటంతో మందపాటి పొరలు తయారవుతాయి.

ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?

వ్యాధినిరోధక శక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వల్ల సొరియాసిస్ వస్తుందని ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి గురించి కొంత తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షణ పొందటానికి, అవి ఏర్పరిచిన అపశృతులను సరిచేయడానికి మన శరీరంలో తెల్ల కర్తకణాలనే ప్రత్యేకమైన కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి ఇనె్ఫక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలను మానేలా చేస్తాయి. దీనినే వ్యాధి నిరోధక శక్తి అంటున్నాం.

ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్‌ఫ్లమేషన్ (ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సొరియాసిస్‌లో ఈ వ్యాధి నిరోధక శక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శారీరక కణజాలాన్ని అన్యపదార్థంగా అన్వయించుకొని, దాడిచేసి ఇన్‌ఫ్లమేషన్ని కలిగిస్తుంది. సొరియాసిస్ వ్యాధి ప్రక్రియలో తెల్లరక్తకణాల్లోని ‘బి’ కణాలనేవి యాంటీ బాడీలను తయారు చేస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉండే కణాలమీద దాడి చేయటం మొదలెడతాయి. ఈ లోపు తెల్లరక్త కణాల్లోని ‘టి’ కణాలనేవి సైటోకైన్స్ అనే పదార్థాన్ని ఎక్కువ మొత్తాల్లో విడుదలయ్యేలా చేస్తాయి. ఈ పదార్థం చర్మకణాల సంఖ్యను అదుపుతప్పి పెరగనివ్వకుండా చేసే యంత్రాంగాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా చర్మపు కణాలు అనియతంగా పెరిగి పొలుసులుగా తయారవుతాయి.

కొన్ని కుటుంబాల్లో సొరియాసిస్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రుల్లో ఇద్దరికీ సొరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం ముప్పైశాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం పదిహేను శాతం. ఐతే కుటుంబలో సొరియాసిస్ ఎవరికీ లేకపోయినప్పటికీ కొంతమందిలో ఈ వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. జన్యుపరమైన అంశాలు దీనికి కారణం.

సోరియాసిస్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచీ మరొకరికి వ్యాపించదు. సొరియాసిస్ వచ్చిన వారిని తాకినా, కరచాలనం చేసినా, సొరియాసిస్ వచ్చిన వారితో కలిసి జీవించినా ఇతరులకు అంటుకోదు.

సొరియాసిస్‌లో రకాలు

సొరియాసిస్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీరించారు. ఉదాహరణకు (1) ప్లేక్ సొరియాసిస్ లేదా సొరియాసిస్ వర్గారిస్ (వల్గర్ అంటే సాధారణం) (2) గట్టేట్ సొరియాసిస్ (గట్టా అంటే బిందువు) (3) పుస్చులర్ సొరియాసిస్ (పస్ అంటే చీము) (4) ఇన్వర్స్ సొరియాసిస్ (పొలుసులు లేకుండా పొడ మాత్రమే కనిపించడం) (5) ఎరిత్రోడర్మిక సొరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపు)

* ప్లేక్ సొరియాసిస్ అనేది అన్ని సొరియాసిస్ రకాల కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్రని మచ్చలాగా మొదలై పెద్ద పొడగా మారటం దీని ప్రధాన లక్షణం. మందం ఎక్కువ. వ్యాధి లక్షణాలు చాలాకాలం పాటు కొనసాగుతాయి.

*గటేట్ సొరియాసిస్ వాన చినుకుల్లా కనిపిస్తుంది. ఎర్రని పొక్కులు పొలుసులులతో కూడి కనిపిస్తాయి. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లల్లో ఎక్కువ జలుబు, గొంతు నొప్పి, టాన్సిలైటిస్, చికెన్‌పాక్స్ వంటివి ప్రేరేపిస్తాయి. పొట్ట, చేతులు, కాళ్లు, తల వంటి భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. త్వరగానే తగ్గిపోతుంది.

*పుస్చులర్ సొరియాసిస్‌లో చీముతో (తెల్ల రక్తకణాలు నిండి పొక్కులు తయారవుతాయి. జ్వరం, వణుకు తీవ్రమైన దురద, నాడి వేగం పెరగటం, రక్తహీనత ఉంటాయి. చీము పొక్కులు కొంతకాలానికి ఎండిపోయి, చెక్కుకట్టి, ఊడిపోతాయి. సాధారణంగా ఈ పొక్కులు హస్త, పాదాల మీద ఎక్కువగా తయారవుతాయి.

* ఇన్వర్స్ సొరియాసిస్ పల్చగా, పొట్టులేకుండా, ఎర్రగా కనిపించే మచ్చలు. ఇవి చర్మపు ముడతల్లో వస్తాయి.

చికిత్స పద్ధతులు

ఆయుర్వేదంలో దీనికి చికిత్స మూడురూపాల్లో జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత ప్రకృతిని బట్టి ఏరకమైన ఆహారం పడుతుందో ఏది పడదో సూచిస్తారు. వ్యాధి ప్రబలడానికి కారణమైన ప్రేరకాలను గుర్తించి వాటిని దూరం చేసుకొనేందుకు ధ్యానం, జపం లాంటి అద్రవ్యభూత చికిత్సలను సూచించి తద్వారా మానసిక అస్థిరతలను తగ్గిస్తారు. ఔషధ ప్రయోగంతో చేసే చికిత్సలను గాని, పంచకర్మపద్ధతులలో చేసే శోధనచికిత్సలను గాని సూచిస్తారు.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.