దగ్గు
పొడి దగ్గు తగ్గాలంటే…?
January 7, 2014
పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి?
February 17, 2014

క్యాన్సర్‌… మన దేశంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు, యాభై ఐదేళ్ల వయస్సు దాటిన వారు క్యాన్సర్‌తో బాధపడు తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా గుండె జబ్బు తర్వాత రెండో స్థానంలో ఉన్నది క్యాన్సరే. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధారణంగా మగవాళ్లల్లో ఓరల్‌ (నోటికి) సంబంధించిన క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లోని మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువ. వివాహం చేసుకోకపోవడం, పిల్లలకు పాలివ్వకపోవడం లాంటి కారణాల వల్ల కూడా క్యాన్సర్‌ రావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, వర్థమాన దేశాల్లో గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. ఇందుకు ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం, చిన్న వయసులోనే లైంగిక చర్యలో పాల్గొనడం, వెనువెంటనే గర్భధారణ, ఎక్కువసార్లు ప్రసవాలు అవడంతోపాటు ఇంకా అనేక కారణాలున్నాయి. యోని నుంచి రక్తస్రావం, కడుపు కింది భాగంలో, నడుము కింది భాగంలో నొప్పి, బహిష్టు ఆగిన తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్‌గా అనుమానించి, వైద్యులతో నిర్ధారించుకోవాలి.

Cervical Cancerమానవ శరీరమంతా కణ నిర్మితం. ఏ అవయవం చుట్టూ ఉన్న కణాలు ఆ అవయవాలు చేసే పనికే తోడ్పడతాయి. మూలకణాలు అనే మరోరకం కణాలు శరీరంలోని ఏ ప్రాంతంలో వేస్తే ఆ కణాలుగా మారుతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఎముకల్లో, భుజాల్లో ఉంటాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కణాల పనులే కాదు. పరిమాణం కూడా పద్ధతిగానే ఉంటుంది. రోజూ మన శరీరంలో ఎన్ని కణాలు చనిపోతుంటాయో అంతేస్థాయిలో కొత్త కణాలు పుడుతుంటాయి. అలా ఉత్పత్తి కాకుండా అదుపు తప్పిన కణవిభజననే మ్యుటేషన్స్‌ అంటారు. ఇది ప్రాణాంతకం కాదు. కణిత బాగా పెద్దదైతే శస్త్ర చికిత్సతో తొలగించవచ్చు. కొన్నిసార్లు అసహజ కణాల ఉత్పత్తి శరీరంలో ఒకేచోట కాకుండా, ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంటాయి. వీటిని మాలిగెంట్‌ ట్యూమర్స్‌ అంటారు. ఇవి రక్తం ద్వారా గానీ, లింఫ్‌ ద్వారా గానీ శరీరంలో ఒకచోట నుంచి మరొక చోటుకు వెళ్తుంటాయి. లింఫ్‌ ద్వారా అయితే లింఫ్‌ గ్రంథులు వాస్తాయి. రక్తం ద్వారా అయితే ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, ఎముకల్లోకి వ్యాప్తి చెందుతాయి. అందుకే శరీరంలో ఏ గ్రంథులు వాచినా, ఏ ప్రాంతంలో గడ్డలు అనిపించినా, ఎటువంటి స్రావం జరుగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్ష చేయించుకొని, కారణం తెలుసుకొని అవసరమైన చికిత్సను ఆలస్యం చేయకుండా తీసుకోవాలి. చాలా వరకూ క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించగలిగితే పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైన కొద్దీ నయమయ్యే అవకాశం తగ్గుతుంది.

దాదాపు 35 ఏళ్ల వయస్సు వరకూ శరీరంలో ఎన్ని కణాలు దెబ్బతిన్నాయో అన్ని కణాలూ ఉత్పత్తి అవుతుంటాయి. ఆ తర్వాత వయస్సు పెరుగుతున్న కొద్దీ దెబ్బతిన్న కణాలకన్నా పునరుత్పత్తి అయ్యే కణాల సంఖ్య తగ్గుతుంటుంది. దాంతో అవయవాల శక్తి తగ్గుతుంది. పెరిగే కొద్దీ కణాల ప్రక్రియలలో జరిగే తప్పులూ పెరిగే అవకాశముంది. మామూలుగా పి-53 అనే జీన్‌ ఈ తప్పుల్ని సరిదిద్దుతుంటుంది. దీనినే ‘మాలిక్యులార్‌ పోలీస్‌’ అంటారు. ఈ మాలిక్యులార్‌ పనితీరు ‘మ్యుటేషన్స్‌’తో దెబ్బ తింటుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ దెబ్బతినే కణాల్లో తప్పులను సరిదిద్దే పి-53 జీన్‌ కూడా ఉండటంతో కణాల్లో జరిగే ప్రక్రియల్లో తప్పుల్ని సరిదిద్దే అవకాశం ఉండదు. దాంతో కణాల మీద నియంత్రణ తగ్గుతుంది.

మర్మావయవ ప్రాంతాల్లో శుభ్రత పాటించాలనే విషయంలో ఇప్పటికీ గ్రామీణ స్త్రీలకు సరైన అవగాహన ఉండట్లేదు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడబడితే అక్కడ మూత్రానికి వెళ్లడం లాంటిది మంచిది కాదు. ఎందుకంటే స్త్రీ మర్మావయవాలు అలా కూర్చున్నప్పుడు నేల ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా ఇన్‌ఫెక్షన్స్‌ని, ఇన్‌ప్లమేషన్స్‌ని అలాగే వదిలేస్తే క్యాన్సర్‌గా మారే అవకాశాలున్నాయి. కాబట్టి యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ లాంటివి వస్తే చికిత్స చాలా అవసరం.

స్త్రీలలో వెజైనల్‌ క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు, గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్లు వస్తుంటాయి. వెజైనల్‌ క్యాన్సర్లు తక్కువ. వీటికన్నా గర్భాశయ క్యాన్సర్లు (యుటెరైన్‌ క్యాన్సర్‌) ఎక్కువ. గర్భాశయ క్యాన్సర్ల కన్నా ముఖద్వార (సర్వైకల్‌ ) క్యాన్సర్లు ఎక్కువ. చాలామంది పిన్న వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. చిన్న వయస్సులో శరీరం

పూర్తిగా పరిపక్వత చెందకుండా దాంపత్య జీవితంలో పాల్గొనడం మంచిది కాదు. చిన్న వయస్సులో ప్రసవాల వల్ల యుటెరెస్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి. కొంతమంది స్త్రీలు వరుస వరుసగా ఎక్కువసార్లు గర్భాలు ధరిస్తారు. దీనివల్ల యుటెరెస్‌ క్యాన్సర్‌ రావచ్చు. స్త్రీలల్లో మర్మావయవం ముందు భాగంలో గానీ, మూత్రాశయంలో గానీ యుటెరెన్‌ ప్రాంతంలో గానీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి రాకుండా స్త్రీలు జాగ్రత్తపడాల్సిన అవసరముంది.

హెచ్‌.పి.వి. వైరస్‌ వల్ల శరీరంలో ఎక్కడా క్యాన్సర్లు రావు. గర్భాశయ ముఖద్వారంలో (సర్విక్స్‌) తప్ప, ఈ క్యాన్సర్‌ మహిళల్లో ఎక్కువ. ఈ వైరస్‌ సోకిన పదిహేను, ఇరవై సంవత్సరాలకు సర్విక్స్‌ క్యాన్సర్‌ వస్తుంది. అంటే ఇరవై, ఇరవై ఐదేళ్లకు ఈ క్యాన్సర్‌ బయట పడుతుందన్న మాట. మెనోపాజ్‌ పీరియడ్‌ తర్వాత రక్తస్రావం అవుతుంటే కూడా క్యాన్సరేమోనని అనుమానించాలి. యోని నుంచి ఎటువంటి అసహజ ద్రావకాలు కారుతున్నా వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి.

పాప్‌స్మియర్‌ టెస్టు

వెజైనల్‌, గర్భాశయ క్యాన్సర్‌ను, ముఖ ప్రాంతంలో క్యాన్సర్‌ను కనుక్కోవడానికి తేలికైన పరీక్ష పాప్‌స్మియర్‌. స్త్రీ జననాంగాల ముందు భాగంలోంచి కొన్ని కణాల్ని తీసి మైక్రోస్కోప్‌ ద్వారా పరీక్షించడంతో ప్రారంభదశలో ఈ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి స్త్రీ రెండు మూడు నెలలకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇది చాలా తేలికైన పరీక్ష. ఖర్చు కూడా తక్కువే. ఏ క్యాన్సర్‌నైనా ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం అవసరం. పాప్‌స్మియర్‌ పరీక్ష, బ్రెస్ట్‌ మీద ఏ ప్రాంతంలోనైనా గడ్డలున్నాయో తెలుసు కోవడానికి ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు పరీక్షించుకోవడం ముఖ్యం. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా జాగ్రత్తపడాలి. ప్రసవ సమయంలో గర్భాశయంలో, యోని లోపల ఎక్కడ గాయమైనా త్వరగా మానేలా చూసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలతో క్యాన్సర్‌ను నివారించవచ్చు.

– డాక్టర్‌ రవికుమార్‌,

మెడికల్‌ ఆంకాలజిస్టు,
గ్లోబల్‌ హాస్పిటల్‌,
లక్డీకాపూల్‌,
హైదరాబాద్‌.
ఫోన్‌: 9949385000

(ప్రజాశక్తి దినపత్రిక, ౨౫ జనవరి ౧౪)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.